పాకిస్తాన్: చైనా రాయబారి లక్ష్యంగా క్వెట్టా హోటల్లో బాంబు పేలుడు, నలుగురి మృతి

సెరీనా హోటల్ కార్ పార్కింగులో మంటలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, సెరీనా హోటల్ కార్ పార్కింగ్‌లో మంటలు

పాకిస్తాన్‌లోని క్వెట్టాలో ఒక లగ్జరీ హోటల్లో జరిగిన బాంబు పేలుడులో నలుగురు మరణించారు. 11 మంది గాయపడ్డారు.

సెరీనా హోటల్ కార్ పార్కింగ్ దగ్గర ఈ బాంబు దాడి జరిగింది.

పాకిస్తాన్‌లోని చైనా రాయబారి లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగినట్లు స్థానిక మీడియా ప్రతినిధులు చెప్పారు.

ఆ సమయంలో ఆయన బలూచిస్తాన్ ప్రావిన్స్‌ రాజధాని క్వెట్టాలోనే ఉన్నారు. కానీ పేలుడు జరిగినప్పుడు ఘటనాస్థలంలో లేరు.

ఈ దాడి తమ పనే అని పాకిస్తాన్ తాలిబన్‌లు చెప్పారు. కానీ మిగతా వివరాలేవీ ఇవ్వలేదు.

మ్యాప్

గత కొన్ని నెలలుగా ఈ గ్రూపుతోపాటూ ఇతర మిలిటెంట్ సంస్థలు అఫ్గానిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో దాడులు పెంచాయి.

ఈ బాంబు పేలుడు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. వాటిలో హోటల్ కార్ పార్కింగ్‌లో మంటలు చెలరేగడం కనిపిస్తోంది.

క్వెట్టాలో సెరీనా ఒక ప్రముఖ హోటల్. ప్రభుత్వ అధికారులు, నగరాన్ని సందర్శించే ప్రముఖులు అక్కడే విడిది చేస్తుంటారు.

"హోటల్ కార్ పార్కింగులో పేలుడు పదార్థాలతో నిండిన ఒక కారును పేల్చేశారు.

పేలుడు జరిగినప్పుడు చైనా రాయబారి నాంగ్ రాంగ్ ఒక వేడుకలో ఉన్నారు. ఆ హోటల్లో లేరు అని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ పాకిస్తాన్ మీడియా ఏఆర్‌వై న్యూస్ చానల్‌తో అన్నారు.

బాంబు పేలుడు తర్వాత దృశ్యం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బాంబు పేలుడు తర్వాత మంటలు చెలరేగాయి

"నాంగ్ క్షేమంగా ఉన్నారని, ఆయన బలూచిస్తాన్ పర్యటన గురువారం ముగుస్తుందని" బలూచిస్తాన్ హోంమంత్రి జియావుల్లా లాంగో మీడియాకు చెప్పారు.

బలూచిస్తాన్ సుదీర్ఘకాలంగా వేర్పాటువాద తిరుగుబాటుకు వేదికగా ఉంటోంది.

స్థానిక మిలిటెంట్లు పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. ఆ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)