ప్రిన్స్ ఫిలిప్: రాచకుటుంబం మరణ వార్తలను బీబీసీ ఎలా కవర్ చేస్తుంది

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీలో వార్తలు ఇప్పుడు భిన్నంగా కనిపిస్తాయి. బీబీసీ వెబ్‌సైట్, న్యూస్ బులిటెన్లలో ఒకే అంశాన్ని లోతుగా కవర్ చేస్తారు. గంభీరమైన విషయాలే తప్ప మామూలు వార్తలు కనిపించవు, వినిపించవు. న్యూస్ రీడర్ల గొంతులో మరింత గాంభీర్యం గోచరిస్తుంది.
బ్రిటన్ రాజకుటుంబంలోని ఓ వరిష్ఠ వ్యక్తి మరణం కారణంగా ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
ప్రస్తుత వార్తలను మీరు గమనించినట్లయితే ఆ వ్యక్తి ఎవరన్నది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ మరణించినట్లు బకింగ్‌హమ్ ప్యాలెస్ ప్రకటించింది.
రాచకుటుంబంలోని నలుగురు వరిష్ఠుల్లో ఎవరి గురించైనా బీబీసీ ఇలా రిపోర్ట్ చేస్తుంది.
ప్రిన్స్ ఫిలిప్‌తో పాటు రాచకుటుంబంలో రాణి ఎలిజబెత్-2.. వారి కుమారుడు, వారసుడు అయిన ప్రిన్స్ ఛార్లెస్ (ప్రిన్స్ ఆఫ్ వేల్స్), వారి కుమారుడు ప్రిన్స్ విలియం (డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జ్) వరిష్ఠులు.
ఇతర మీడియా సంస్థలతో పోలిస్తే బీబీసీ ఈ మరణవార్తను లోతుగా కవర్ చేస్తున్నట్లు కనిపించవచ్చు.
అయితే, బీబీసీ ఇలా ఎందుకు చేస్తుంది? దీనికి కారణాలేంటి?
రాచకుటుంబంలోని మరణవార్తలు బీబీసీకి ఎందుకింత పెద్ద విషయాలు

ఫొటో సోర్స్, Getty Images
క్వీన్ ఎలిజబెత్-2 అందరికన్నా అధికంగా గత 69 సంవత్సరాలుగా బ్రిటన్ సింహాసనాన్ని అధిరోహించి పాలన సాగిస్తున్నారు.
ఆమె బ్రిటన్‌తో పాటూ మరో 15 దేశాలకు అధినేత్రి.
అంతే కాకుండా, 54 దేశాలతో కూడిన కామన్‌వెల్త్ సంఘానికి ఆమె అధ్యక్షురాలు.
వారంతా క్వీన్‌కు అధిక ప్రాధాన్యమిస్తారు.
బ్రిటన్ రాచకుటుంబంలో ఎవరైనా మరణిస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థలు ఆ వార్తకు ప్రాధాన్యమిస్తాయి.
అలాంటి వార్తలపై బీబీసీ ప్రత్యేకంగా దృష్టి సారించి లోతైన, విస్తృతమైన కవరేజ్ అందించేందుకు ప్రయత్నిస్తుంది.
బీబీసీకి బ్రిటిష్ ప్రభుత్వం నిధులు ఇవ్వదు. కానీ, ఒక రకమైన టాక్స్ లైసెన్స్ ఫీజు ద్వారా నిధులు సమకూరుతాయి.
బీబీసీకి సంపాదకీయ స్వాతంత్ర్యాన్ని సమకూర్చడం కోసం ఈ పద్ధతిని అనుసరిస్తారు.
లైసెన్స్ ఫీజు మంజూరు చేసినవారికి బీబీసీ విలువ ఇవ్వడం సహజం.
అలాగే, బ్రిటిష్ ప్రజలు రాజపరివారం హితాన్ని కోరుకుంటారు. వారిని అభిమానిస్తారు.
2002లో క్వీన్ మదర్.. అంటే క్వీన్ ఎలిజబెత్-2 తల్లి మరణించినప్పుడు ఆమె మృతదేహాన్ని వెస్ట్ మినిస్టర్ ప్యాలస్‌లో మూడు రోజులు ఉంచారు.
అప్పుడు ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు లక్ష మంది కంటే ఎక్కువ అక్కడకు వచ్చారు.
ఆమెకు విండ్సర్‌లో అంతిమ సంస్కారాలు జరిపేటప్పుడు పది లక్షల కన్నా ఎక్కువమంది జనం రోడ్లపైకి వచ్చి వీడ్కోలు పలికారని అంచనా.
ఆమె అంతిమ సంస్కారాల కార్యక్రమాన్ని టీవీలో కోటిమంది వరకు చూసి ఉంటారని అంచనా.
ప్రపంచ మీడియా ఈ అంశాన్ని విస్తారంగా కవర్ చేసింది.
రాచకుటుంబానికి సంబంధించిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తాయి. కోట్లమంది వీటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. అలాగే బీబీసీ వాటిని విస్తృతంగా కవర్ చేస్తుంది.
బీబీసీ రాయల్ ఫ్యామిలీ కరస్పాండెంట్ జానీ డైమండ్ మాటల్లో చెప్పాలంటే.. "రాజకుటుంబంలోని వార్తలు సెలిబ్రిటీ వార్తలకన్నా ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. ఎక్కువమందిని ఆకర్షిస్తాయి".
అంతే కాకుండా, బీబీసీ రాజకుటుంబం వార్తలను విస్తృతంగా కవర్ చేస్తుందని కూడా ప్రజలు ఆశిస్తారు.
"రాజకుటుంబంలోని పెద్ద వ్యక్తి మరణానికి సంబంధించిన వార్తలు తెలుసుకోవాలని అనేకమందికి ఆసక్తిగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకన్నా ఎక్కువమంది పాఠకులు, ప్రేక్షకులు ఉన్న బీబీసీ ఈ వార్తను కూలంకుషంగా కవర్ చేస్తుందని ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఆశిస్తారు" అని బీబీసీ వరల్డ్ సర్వీస్ లాంగ్వేజ్ న్యూస్ కంట్రోలర్ తారిక్ కఫాలా అన్నారు.
బ్రిటిష్ రాజకుటుంబంలో మరణాన్ని బీబీసీ ఎలా రిపోర్టింగ్ చేస్తుంది

దీనికి సంబంధించిన వార్తల కోసం ప్రజలు ముందుగా బీబీసీ వైపే చూస్తారు.
ఎందుకంటే బీబీసీ.. వార్తలను అందరికన్నా ముందు అందజేయడం కన్నా వాటిని సరైన రీతిలో అందజేయడంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంది. అదే విలువ అని బీబీసీ విశ్వసిస్తుంది.
బీబీసీలో ఈ వార్తలను బ్రేకింగ్ న్యూస్‌గా కాకుండా, అధికారిక ప్రకటనగా భావిస్తారు.
గ్రాఫిక్స్‌పై దృష్టి పెట్టకుండా ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లిన వ్యక్తి జీవితాన్ని గుర్తు చేసుకునేందుకు బీబీసీ ప్రాధాన్యమిస్తుంది.
అందుకే ఇలాంటి విషయాల్లో బీబీసీ స్వరం గంభీరంగా ఉంటుంది.
ఇలాంటి మరణ వార్తలప్పుడు కొంత సమయం పాటూ బీబీసీ ఇతర వార్తలను కవర్ చేయదు.
అలాగే, అంతగా అవసరం లేని కథనాలను వెబ్‌సైట్, రేడియోల నుంచీ తొలగించవచ్చు కూడా.
రాజకుటుంబంలోని వ్యక్తి మరణించిన తరువాత కొన్ని గంటల పాటూ ఆ వార్తలకే ప్రాధాన్యం ఇస్తుంది.
ప్రిన్స్ ఫిలిప్ ఎప్పుడూ సింహాసనాన్ని అధిరోహించలేదు. రాణి తరువాత ఆమె కుమారులు సింహాసనానికి వారసులు అవుతారు. అలాంటప్పుడు ప్రిన్స్ ఫిలిప్ మరణం గురించి ఇంతగా కవర్ చేయడం ఎందుకు అనే సందేహం రావొచ్చు.
1947లో వారి వివాహమైన తరువాత ప్రిన్స్ ఫిలిప్ క్వీన్ ఎలిజబెత్‌కు చేదోడువాదోడుగా ఉంటూ తన పూర్తి సహకారాన్ని, మద్దతును అందజేశారు.
క్వీన్ ఎలిజబెత్ కూడా తన ప్రసంగాలన్నీ "నా భర్త, నేను.." అనే ప్రారంభించేవారు.
తమ 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్వీన్ మాట్లాడుతూ.. "ఆయన వ్యక్తిత్వం చాలా సరళమైనది. చాలా ఏళ్లుగా ఆయనే నా బలం. నేను, నా కుటుంబం, ఈ దేశ ప్రజలు, మరి కొన్ని ఇతర దేశాల ప్రజలు కూడా ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం" అని అన్నారు.
అయితే, ఆయన మరణవార్తను కవర్ చేయడానికి ఈ కారణాలన్నీ అంత ముఖ్యమా?
దీనికి జవాబిస్తూ.. "వాస్తవానికి ఇదే ప్రపంచంలో చివరి రాచరిక వ్యవస్థ అవుతుంది. ప్రిన్స్ ఫిలిప్ ఎల్లప్పుడూ క్వీన్‌కు మద్దతిస్తూ ఆమెతో పాటే చివరి వరకూ ప్రయాణించారు.
అలాంటి ఒక అరుదైన వ్యక్తిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందారు" అని బీబీసీ రాయల్ ఫ్యామిలీ కరస్పాండెంట్ జానీ డైమండ్ వివరించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








