కొందరు మహిళలకు మీసాలు, గడ్డాలు ఎందుకు పెరుగుతాయి.. చికిత్స ఎలా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ శైలజ చందు
- హోదా, బీబీసీ కోసం
చాలా రోజుల తర్వాత స్నేహితురాళ్లంతా స్కూల్లో కలుసుకున్నారు.
“అసలీ మాస్కులెన్నాళ్లకు మాయమవుతాయో.”
“పదేళ్లకంటున్నారు.”
"కాదట. ఇక జీవితమంతా మాస్క్ తియ్యలేమట" అంది పూజిత.
“జీవితంలో ఒకసారైనా ఒక మంచి కబురు చెప్పవే.”
నవ్వారు అంతా.
“ఇంత వరకే వేసుకున్నాను, మేకప్” అంటూ నుదురు చూపెట్టింది రచన.
“లిప్ స్టిక్స్ ఏం చెయ్యాలే. డేట్ ఎక్స్‌పైర్ అయిపోయినాక వాడొచ్చా?”
“అందరికన్నా మాస్క్ సుఖం అనుకునేది మాత్రం మన ప్రవీణ.” అంటూ ఆమె భుజం పొడిచి నవ్వింది సుప్రజ.
ఆమె పెదవుల మీద, గడ్డమ్మీదా మగవారిలా వెంట్రుకలున్నాయి. అవి కనిపించకుండా వుండేందుకు ఇదివరకు కర్చిఫ్ అడ్డు పెట్టుకునేది.
ఇప్పుడా అవసరం లేదు. కోవిడ్ వల్ల మాస్క్ వాడుతున్నప్పటినుండీ హాయిగా వుందామెకు.

ఫొటో సోర్స్, SPL
క్లాసులోపలికి అడుగుపెట్టాక,.
"ఈ మాస్కుల వల్ల గిల్లెట్ కంపెనీ బాగా దెబ్బ తిందిరా."
"ఏ మాస్కు వెనకాలా ఏ మీసమున్నదో!" అని పాడుతున్నారు ఆకతాయి మగ పిల్లలు.
ఆ మాటలు తన గురించేనని తెలుసు.
ప్రవీణ కళ్ళలో నీళ్లు తిరిగాయి.
టీనేజ్ వచ్చిన దగ్గర్నుండీ ఆమెకీ కష్టాలు మొదలయ్యాయి. మగవారిలా ముఖమ్మీద వెంట్రుకలు పెరిగాయి.
కాలేజికి వెళ్లక తప్పదు. వెళ్లనంటే అమ్మ కారణమడుగుతుంది. ఇదీ విషయమని చెప్పలేదు. ఎందుకంటే అమ్మకు అదేమీ పెద్ద విషయమే కాదు. చిన్నతనంలో ఆమెక్కూడా ముఖంపై జుట్టు వుండేదట. తను పుట్టాక తగ్గిందట.
ముఖమ్మీద వెంట్రుకల్ని తొలగించడానికి అన్నకు తెలియకుండా అతని షేవింగ్ సామాన్లు వాడుతుండేది. షేవింగ్ చేశాక ఆ వెంట్రుకలు మరింత దుబ్బుగా పెరుగుతున్నట్లు ఆమెకు అనుమానం కలిగేది.
ఆడవారికి ముఖమ్మీద వెంట్రుకలు రావడానికి కారణమేమిటి?
ఆడవారిలో సైతం పురుషులకు చెందిన హార్మోన్లుంటాయి, కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఆ హార్మోన్లు ఉండవలసిన స్థాయి కన్నా మించి పెరిగినట్లైతే ఆడవారికి పురుషుల వలె మీసాలు, గడ్డమ్మీద వెంట్రుకలు పెరుగుతాయి.
PCOD: దాదాపు 70%- 80% యువతుల్లో ముఖమ్మీద రోమాలు పెరగడానికి ప్రధాన కారణం, PCOD అనే హార్మోన్ల సమస్య.
ఈ స్థితిలో సక్రమంగా పీరియడ్స్ రాకపోవడం, పురుష హార్మోన్ల ఆధిక్యత, అండాశయాల్లో నీటి తిత్తులు ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. PCOD వున్న ఆడవారిలో దాదాపు 30-75% మంది అధిక బరువుతో బాధ పడుతుంటారు.
వారిలో ఇన్సులిన్ హార్మోన్ పట్ల నిరోధకత వ్యక్తమవుతుంది.
Insulin resistance: కొన్ని సందర్భాలలో ఇన్సులిన్ హార్మోన్ పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇన్సులిన్ నిరోధకతను అధిగమించడానికి ఇన్సులిన్ హార్మోన్ స్థాయి మరింత పెరుగుతుంది. పెరిగిన ఇన్సులిన్ పురుష హార్మోన్లు ఎక్కువగా విడుదల కావడానికి కారణమవుతుంది.
Tumours: అండాశయాల్లోను, ఎడ్రినల్ గ్రంధిలోనూ, పెరిగే ట్యూమర్ల నుండి పురుష హార్మోన్లు రిలీజవుతాయి. ముఖమ్మీద రోమాలు పెరిగే క్రమం, వేగంగా జరుగుతూ వుంటే దానికి ట్యూమర్లు కారణమనుకోవాలి.
థైరాయిడ్ గ్రంధి తక్కువగా పని చేసినా, పాలను వుత్పత్తి చేసే హార్మోన్ ఎక్కువైనా, స్టీరాయిడ్స్ ఎక్కువగా విడుదలయే వ్యాధి వున్నా కూడా రోమాలు ఎక్కువగా కనిపిస్తాయి.
కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా ముఖం మీద రోమాలు ఎక్కువగా వస్తాయి.
ఉదాహరణకు మినాక్సిడిల్, ఫిట్స్ వ్యాధిలో వాడే ఫెనిటాయిన్, స్టెరాయిడ్స్ , స్ట్రెప్టోమైసిన్, సొరియాసిస్ లో వాడే మందుల వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు పెరిగే అవకాశం వుంది.

ఫొటో సోర్స్, Other
చికిత్స ఎలా చేయాలి?
ముఖమ్మీద వెంట్రుకల పెరుగుదల ఫిర్యాదుతో వచ్చినపుడు, వారి లక్షణాల వివరాలు సేకరించాలి. శరీరాన్ని సమగ్రంగా పరీక్షించాలి.
బరువు పెరిగారా, థైరాయిడ్ గ్రంధి వాచి వున్నదా, వక్షోజాల నుండి పాలు వస్తున్నాయా, కడుపులో కణుతులేమైనా వున్నాయా అన్న విషయాలు నిర్థారించుకోవాలి.
ఆ తర్వాత రోమాల పెరుగుదలను, సమస్య తీవ్రతను Ferriman–Gallwey స్కోరింగ్ ద్వారా అంచనా వేస్తారు.
ఒక వేళ ఈ స్కోర్ 8- 15 మధ్య వుంటే సమస్య తేలికగా వున్నట్లు.
వారికి కాస్మొటిక్ పద్ధతుల ద్వారా చికిత్స సరిపోతుంది.
అదే ఆ స్కోర్ 15 కన్నా పైన వున్నట్లైతే - సమస్య తీవ్రంగా వున్నట్లు. పురుష హార్మోన్ల ప్రభావం ఎక్కువగా వున్నట్లు. దానికి గల కారణాలను పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. రక్తంలో టెస్టోస్టెరోన్ స్థాయి ఎంత వుందో చూడాలి.
ఒక వేళ టెస్టోస్టెరోన్ లెవల్ చాలా ఎక్కువగా వున్నట్లైతే, ఆ హార్మోన్ విడుదల చేసే కణుతులు గానీ, ఎడ్రినల్ గ్రంధిలో కణజాలపు పెరుగుదల గానీ కారణమయే అవకాశముంది.
ఈ రోమాలు రావడంతో బాటు, ఇంకా ఏవైనా పురుష లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూసుకోవాలి. ముఖాకృతిలో తేడాలు రావడం, మగవారికి వచ్చినట్లు బట్ట తల రావడం, ముఖం పైన మొటిమలు ఇవన్నీ androgens అంటే పురుష హార్మోన్ల ఆధిక్యతను తెలియజేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
అధిక బరువు:
PCOD వున్న స్త్రీలలో బరువు తగ్గడం అనేది ప్రాథమిక చికిత్సా విధానం.
బరువు తగ్గే కార్యక్రమాన్ని కనీసం ఆరు నెలల పాటు రూపొందించాలి. తక్కువ కెలొరీలున్న ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా సన్నబడతారు. బరువు తగ్గడం వల్ల పురుష హార్మోన్ల స్థాయి తగ్గు ముఖం పడుతుంది. 5-10% బరువు తగ్గడం వల్ల ఈ రోమాలు రావడం 40-55% వరకు తగ్గుతుంది.
కాస్మొటిక్ చికిత్స
అప్పటికే పెరిగిన రోమాలను తొలగించడానికి కాస్మొటిక్ పద్ధతులు ఉపయోగపడతాయి. వాక్సింగ్, బ్లీచింగ్, విధానాల ద్వారా తొలగించాలి. స్త్రీలలో ముఖం పైన పెరిగిన వెంట్రుకలు తొలగించడానికి షేవింగ్ పద్ధతి అంత మంచిది కాదు. దీని వలన చర్మం మొద్దు బారే అవకాశముంది.
ఎలెక్ట్రాలిసిస్:
ఇది శాశ్వతంగా జుట్టుని నిర్మూలించే పద్ధతి. ఒక్కొక్క hair follicle నీ ఎలక్ట్రోడ్ ద్వారా నిర్మూలించడం. ఈ పద్ధతి ద్వారా రోమాలను తొలిగించడానికి నైపుణ్యం కావాలి. ఎక్కువ సమయం పడుతుంది. సుమారుగా 18 నెలల నుండు 4 సంవత్సరాల వరకూ పట్టొచ్చు. నొప్పితో కూడుకున్న పద్ధతి. చర్మం తన సహజమైన పిగ్మెంట్ ని పోగొట్టుకొనవచ్చు. చర్మం పైన కాలిన మచ్చలు పడే అవకాశముంది.
లేజర్ చికిత్స
చుట్టుపక్కల చర్మానికి హాని చెయ్యకుండా హెయిర్ ఫాలికల్ ను తొలగించే పద్ధతి. ఎలక్ట్రాలసిస్ తో పోలిస్తే తక్కువ నొప్పి, అదనపు ప్రయోజనాలున్నాయి. ఒక పర్యాయంలో ఎక్కువ చర్మ వైశాల్యాన్ని కవర్ చేయగలదు.
మూడు నాలుగు పర్యాయాల తర్వాత దట్టంగా వున్న రోమాలు దాదాపు 30% వరకు పలచ బడతాయి.
హార్మోన్ చికిత్స
హార్మోన్ల చికిత్స వలన యాండ్రోజెన్ (పురుష హార్మోన్ల) వుత్పత్తి తగ్గించవచ్చు. ఈ చికిత్సలో సరైన ఫలితాలు రావడానికి దాదాపు 9 నుండి 12 నెలల వరకు పడుతుంది.
ఈ చికిత్సలో గర్భ నిరోధక మాత్రలు ముఖ్యపాత్ర వహిస్తాయి.
స్త్రీలలో ముఖంపై వచ్చే రోమాలను నియంత్రించడానికి Yasmin®️, Dianette®️ అనే సంతాన నిరోధక మాత్రలను వాడతారు.
ఇవే కాకుండా, పురుష హార్మోన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఔషధాలు అందుబాటులో వున్నాయి. వాటి వాడకం ద్వారా, స్త్రీలలో ముఖంపైన వెంట్రుకలు పెరగకుండా తగ్గించవచ్చు.
(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు.)
ఇవి కూడా చదవండి:
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటి? పాటించకపోతే ఏమవుతుంది?
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- హైదరాబాద్కు బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది?
- మనిషికి ఎలుక కామెర్లు... మొట్టమొదటి కేసు
- డస్టర్ క్లాత్ పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
- సెక్స్కూ గుండెపోటుకు సంబంధముందా?
- ఒకచోట ఉండే మహిళలకు పీరియడ్స్ ఒకేసారి వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








