వైట్ డైమండ్: అత్యంత స్వచ్ఛమైన 102 క్యారెట్ల వజ్రం.. చాలా చౌకగా రూ. 115 కోట్లకే అమ్మేశారు

ఫొటో సోర్స్, AFP
అరుదైన 102 క్యారెట్ల తెల్లటి స్వచ్ఛమైన వజ్రాన్ని వేలంలో సుమారు 115 కోట్ల రూపాయలకు ($ 15.7 మిలియన్లు) విక్రయించారు. ఇది భలే మంచి చౌక బేరం అంటున్నారు వజ్రాల నిపుణులు.
పేరు చెప్పకుండా టెలిఫోన్‌లో వేలంపాడుకున్న ఒక వ్యక్తికి ఈ విలువైన వజ్రం దక్కింది.
కోవిడ్-19 కారణంగా ఈ వేలంపాట ఆన్‌లైన్‌లో జరిగింది. సొదబీస్ సంస్థ హాంకాంగ్‌లో ఈ వేలాన్ని నిర్వహించింది.
రెండేళ్ల కిందట కెనడాలో దొరికింది
2018లో కెనడాలోని ఒక గనిలో దొరికిన 271 క్యారెట్ల శిల నుంచి ఈ అరుదైన తెల్లటి వజ్రాన్ని మలిచారు.
ఇప్పటివరకూ ఇంత నాణ్యమైన, 100 క్యారెట్లు దాటినవి ఏడు వజ్రాలు మాత్రమే దొరికాయి.
ఈ వజ్రానికి అమ్మకపుదారులు కనీస ధర నిర్ణయించలేదు. ఇలా కనీస ధర లేకుండా వజ్రాన్ని వేలంపాట పాడడం చరిత్రలో ఇదే తొలిసారి.
ఈ వజ్రం 'మచ్చలేనిది.. ఇది ఎంత అందమైనది, అపురూపమైనదో వర్ణించి చెప్పడం కష్టం’ అని సొదబీస్ సంస్థ తెలిపింది.
చౌక బేరమేనా?
ఆన్‌లైన్‌లో వజ్రాలు అమ్మే సంస్థ '77 డైమండ్స్' మేనేజింగ్ డైరెక్టర్ టోబయాస్ కోర్మైండ్…ఇలాంటి అరుదైన వజ్రాన్ని 115 కోట్ల రూపాయలకు చేజిక్కుంచుకోవడాన్ని "భలే మంచి చౌక బేరం"గా అభివర్ణించారు.
"అమ్మకపుదారులు కనీస ధర నిర్ణయించకపోవడం సాహసమనే చెప్పాలి. ఇంతకన్నా ఎక్కువ ధరకే అమ్ముడయ్యే అవకాశం ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
2017లో జెనీవాలో క్రిస్టీస్ నిర్వహించిన ఒక వేలంపాటలో 163 క్యారట్ల వజ్రం పొదిగిన ఒక హారం సుమారు 246 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.
ఈ వజ్రాన్ని అంగోలాలో 404 క్యారెట్ల శిలనుంచీ సంగ్రహించారు. ఇప్పటివరకూ వేలంలో విక్రయించిన అతి పెద్ద వజ్రం ఇదే.
అదే ఏడాది మరొక వేలంపాటలో అరుదైన 10 క్యారెట్ల గులాబీ రంగు వజ్రాన్ని 402 కోట్ల రూపాయలకు విక్రయించారు.
అరుదైన, విలువైన రత్నాలకు కెనడా పెట్టింది పేరు. ఇక్కడి గనుల్లో ఎన్నో అపురూపమైన రత్నాలు, వజ్రాలు దొరుకుతూ ఉంటాయి.
రెండేళ్ల కిందట 552 క్యారెట్ల పసుప్పచ్చని వజ్రం లభించిందని 'ది డొమినియన్ డైమండ్ మైన్స్ కంపెనీ' ప్రకటించింది.
2015లో కూడా ఇలాంటిదే ఒక అరుదైన వజ్రం అదే గనిలో దొరికింది. 'ఫైర్‌ఫాక్స్' అని పిలిచే ఈ 187.7 క్యారెట్ల వజ్రం 200 కోట్ల ఏళ్ల కిందటిదని అంచనా. దీన్ని ప్రపంచంలో పలుచోట్ల ప్రదర్శనకు ఉంచారు.
ఇవి కూడా చదవండి:
- జాకబ్ డైమండ్: హైదరాబాద్ నిజాం 'పేపర్ వెయిట్'గా వాడిన రూ.900 కోట్ల వజ్రం ఇదే
- ఈ గోల్కొండ వజ్రం ఖరీదు చెప్పగలరా?
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గులాబీ వజ్రం ఇది
- సియెర్రా లియోన్: రూ.42 కోట్ల వజ్రం దొరికినా కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామం
- బంగారం, వజ్రాల గనులున్నా.. ఈ దేశంలో పేదరికం పోవట్లేదు
- ఏపీలో దొరికిన కోహినూర్ వజ్రాన్ని ఎలా కొట్టేశారు?
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
- మానసిక ఒత్తిడి వల్ల తొందరగా చనిపోతారా....
- బీటిల్స్ మ్యూజిక్ బ్యాండ్ భారత్‌లో ఓ గుండె పగిలిన ప్రేమికుడికి ఎదురుపడినప్పుడు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








