కరోనావైరస్ అంతా కట్టుకథ అనుకున్నాడు... చివరకు భార్యను పోగొట్టుకున్నాడు

భార్య ఎరిన్‌తో బ్రయన్

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, భార్య ఎరిన్‌తో బ్రయన్
    • రచయిత, మరియానా స్ప్రింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ గురించి వచ్చే సమాచారాన్ని గాలి వార్తగా భావించిన ఫ్లోరిడాకి చెందిన ఒక ట్యాక్సీ డ్రైవర్ తన భార్యని పోగొట్టుకున్నారు.

కరోనావైరస్ సాధారణ జలుబు లాంటి దేనని, 5జీకి సంబంధించిన వైరస్ అని, అనవసరంగా దాని గురించి పదింతలు చేసి చెబుతున్నారనే సమాచారాన్ని బ్రయన్ లీ హిచెన్స్ అతని భార్య ఎరిన్ సోషల్ మీడియాలో చూశారు.

ఆ తరువాత వారిద్దరూ మే నెలలో అనారోగ్యం బారిన పడ్డారు. కానీ, వారు ఎటువంటి వైద్య సలహాలు తీసుకోలేదు. వారు దానిని సాధారణ అనారోగ్యంగానే భావించారు.

బ్రయన్ వైరస్ బారిన పడి కోలుకున్నారు కానీ ఆయన 46 సంవత్సరాల భార్య మాత్రం వైరస్ కారణంగా తలెత్తిన గుండెకి సంబంధించిన సమస్యలతో తీవ్రంగా అనారోగ్యం పాలై ఆగష్టు నెలలో మరణించారు.

వైరస్ గురించి ఆన్లైన్లో ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారం వలన ప్రాణాలు కోల్పోతున్న వారి గురించి బీబీసీ చేసిన పరిశోధనలో భాగంగా జులైలో బీబీసీ బ్రయన్ తో మాట్లాడింది. అప్పటికి అతని భార్య ఐసియులో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.

భయంకరమైన కుట్రపూరిత సిద్ధాంతాలు

ఫ్లోరిడాలో ఎరిన్ పాస్టర్ గా పని చేసేవారు. ఆమెకి అంతకు ముందే ఆస్తమా, నిద్ర లేమి లాంటి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి.

ఈ మహమ్మారి తలెత్తిన మొదట్లో ప్రభుత్వం చేస్తున్న వైద్య సూచనలను వీరు పాటించలేదని, బ్రయిన్ చెప్పారు. ఇదంతా ఆన్ లైన్ లో ప్రచారమైన తప్పుడు సమాచారం వలనే జరిగిందని ఆయన అన్నారు.

బ్రయన్ టాక్సీ డ్రైవర్ గా పనులకు వెళ్లేవారు. ఆయన భార్య కోసం మందులను కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు భౌతిక దూరం పాటించడం గాని, మాస్క్ వేసుకోవడం గానీ చేయలేదని చెప్పారు.

మే నెలలో అనారోగ్యం బారిన పడగానే వైద్యులను సంప్రదించలేదు. చివరికి ఇద్దరికీ కోవిడ్ పాజిటివ్ అని తేలింది.

Brian and wife

ఫొటో సోర్స్, Facebook

ఫొటో క్యాప్షన్, బ్రయన్, ఎరిన్‌లు ఫేస్‌బుక్‌లో కరోనావైరస్ కుట్ర సిద్ధాంతాలను విపరీతంగా చదివారు

మొదటి నుంచి అధికారికంగా వస్తున్న సూచనలను విని ఉంటే బాగుండేదని బ్రయన్ అన్నారు. ఆయన భార్య ఆయనను క్షమించి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు.

"ఇది మనుషుల పై రకరకాలుగా దాడి చేసే నిజమైన వైరస్. నేనిప్పుడు వెనక్కి వెళ్లి జరిగింది మార్చలేను. కానీ, భవిష్యత్తు కోసం ఇకపై సరైన నిర్ణయాలు తీసుకోగలను”, అని ఆయన అన్నారు.

"నా భార్యకి బాధ నుంచి విముక్తి లభించి శాంతి లభించింది . నేను తనని మిస్ అవుతూ ఉంటాను. కానీ, ఆమె ఒక ఉత్తమమైన ప్రదేశానికి చేరింది”, అని ఆయన అన్నారు.

“కోవిడ్ గురించి నేను నా భార్య మొదటి నుంచి నమ్మలేదు. వైరస్ ఒక గాలి వార్త అని, 5 జి టెక్నాలజీకి సంబంధించినదని, ఒక వేళ వైరస్ ఉన్నా ఒక సాధారణ జబ్బు లాంటిదని భావిస్తూ వచ్చాం” అని ఆయన చెప్పారు. ఇలాంటి సిద్ధాంతాలన్నీ వారు ఫేస్ బుక్ లో చూసారు.

"మమ్మల్ని తప్పు దోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అనుకున్నాం”, అని ఆయన వివరించారు.

కానీ, ఈ దంపతులు వైరస్ బారిన పడగానే తప్పుడు సమాచారం వలన తామెలా నష్టపోయామో వివరిస్తూ బ్రయన్ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

"మీరు ఒక వేళ ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే మాలాగా మూర్ఖంగా ప్రవర్తించకుండా తెలివితేటలతో ప్రవర్తించమని” బ్రయన్ ఫేస్ బుక్ పోస్ట్ లో రాసారు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాకు, నా భార్యకి జరిగినట్లు జరగకుండా ఉంటుందని సూచించారు.

వైరస్ గురించి ప్రచురితమవుతున్న తప్పుడు సమాచారాన్ని పరిశీలిస్తున్న బీబీసీ బృందానికి దాడులు, దోపిడీలు, మరణాల గురించి లింకులు లభించాయి.

సోషల్ మీడియాలో వ్యాక్సీన్ కి వ్యతిరేకంగా అనేక కుట్ర సిద్ధాంతాలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో, వైరస్ గురించి వస్తున్న పుకార్లు, కుట్ర సిద్ధాంతాలు, తప్పుడు సమాచారం తెలియకుండానే తీవ్రమైన హాని కలుగ చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనావైరస్ గురించి ప్రచారమయ్యే తప్పుడు సమాచారాన్ని నియంత్రించడానికి సోషల్ మీడియా కంపెనీలు చర్యలు చేపట్టినప్పటికీ , రానున్న నెలల్లో దీని గురించి మరింత అవగాహన కలుగచేయవలసిన అవసరం ఉందని విమర్శకులు అంటున్నారు.

"హాని చేసే తప్పుడు సమాచారాన్ని మేము మా ప్లాట్ఫారం మీద ప్రచురించనివ్వము. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో కోవిడ్ 19 గురించి ప్రచురితమైన 70 లక్షల పోస్టులను తొలగించాం. అందులో చిట్కా వైద్యాలు , భౌతిక దూరం పాటించనవసరం లేదని చెప్పే లాంటి సమాచారం ఉన్న పోస్టులను కూడా తొలగించాం”, అని ఫేస్‌బుక్ ప్రతినిధులు బీబీసీకి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)