బ్రిట్నీ స్పియర్స్: ‘నా వ్యక్తిగత జీవితంపై మా నాన్న పెత్తనాన్ని తీసేయండి’- కోర్టును కోరిన పాప్ గాయని

బ్రిట్నీ స్పియర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్రిట్నీ స్పియర్స్

తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై అదుపాజ్ఞలు కలిగి ఉండే అధికారాన్ని తండ్రికి మళ్లీ ఇవ్వొద్దంటూ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ కోర్టును కోరారు.

బ్రిట్నీ మానసిక ఆరోగ్యం దృష్ట్యా ఆమె తండ్రి జేమీ స్పియర్స్ గత పన్నెండేళ్లుగా ఆమెకు న్యాయపరమైన సంరక్షకుడిగా ఉన్నారు.

తన ఆరోగ్య సమస్యలను కారణంగా చూపిస్తూ జేమీ స్పియర్స్ 2019లో బ్రిట్నీ వ్యక్తిగత వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత నుంచి తాత్కాలికంగా తప్పుకొన్నారు.

బలవంతంగా ఆమెను ఆ రకమైన సంరక్షణ చట్రంలో ఇరికించారని ఆమె అభిమానుల్లో చాలామంది భావిస్తారు. అందుకే వారు #FreeBritney అనే ప్రచారాన్ని నడిపిస్తున్నారు.

జేమీ, బ్రిట్నీ స్పియర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తండ్రి జేమీతో బ్రిట్నీ

బ్రిట్నీ ఏం చెబుతున్నారు

లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా సుపీరియర్ కోర్టులో దాఖలు చేసిన ఒక పత్రం ప్రకారం తన సంరక్షుకుడిగా తండ్రి జేమీ స్పియర్స్ రాకను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.

కొందరి దోపిడీ నుంచి, ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి నుంచి తనను తప్పించి తిరిగి వరల్డ్ క్లాస్ ఎంటర్‌టైనర్‌గా తన స్థానాన్ని తిరిగి పొందేలా చేసింది తన తండ్రే అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన మళ్లీ లీగల్ కంజర్వేటర్ స్థానంలోకి రావడాన్ని ఆమె ఇష్టపడడం లేదు.

గత ఏడాది తండ్రి ఆ స్థానాన్ని ఖాళీ చేయడంతో ఆ బాధ్యతలు చూస్తున్న తన మేనేజర్ జోడీ మాంట్‌గోమెరీ శాశ్వతంగా తన వ్యక్తిగత వ్యవహారాలు పర్యవేక్షించాలని 38 ఏళ్ల బ్రిట్నీ కోరుకుంటున్నరు.

ఆగస్టు 22తో లీగల్ కన్సర్వేటర్‌గా జేమీ స్పియర్స్ కాలం పూర్తవుతుంది.. ఆ తరువాత దాన్ని మళ్లీ పొడిగించాల్సి ఉంటుంది.

బ్రిట్నీ ఆర్థిక వ్యవహారాలను కూడా జేమీ స్పియర్స్ చూసేవారు. గత ఏడాది తన కో కంజర్వేటర్, న్యాయవాది రాజీనామా చేసిన తరువాత ఆయన బ్రిట్నీ ఆర్థిక వ్యవహారాల మొత్తాన్ని పర్యవేక్షించడం ప్రారంభించారు. అయితే, ఇప్పుడు తానే స్వయంగా తన ఆర్థిక వ్యవహారాలను చూసుకోగలనని బ్రిట్నీ కోర్టుకు చెప్పారు.

ఇప్పుడు జేమీని పక్కనపెట్టాలన్న బ్రిట్నీ విన్నపాన్ని ఆయన గట్టిగా ఎదుర్కొంటారని ఆమె లాయర్ అంటున్నారు.

అయితే, ''బ్రిట్నీ ప్రస్తుత లైఫ్ స్టైల్, ఆమె ఆకాంక్షల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబించేలా కన్జర్వేటర్‌షిప్‌లో గణనీయమైన మార్పులు అవసరం'' అని లీగల్ డాక్యుమెంట్స్ చెబుతున్నాయి.

త్వరలో మళ్లీ ప్రదర్శన ఇచ్చే ఆలోచన కూడా బ్రిట్నీకి లేదని ఆ పత్రాలు చెబుతున్నాయి. ఆమె చివరిసారిగా 2018 అక్టోబరులో ప్రదర్శన ఇచ్చారు. 2019లో లాస్ వెగాస్‌లో ఒక ప్రదర్శన ఇవ్వాల్సి ఉన్నప్పటికీ తండ్రి అనారోగ్యం కారణంగా దాన్ని ఆమె రద్దు చేసుకున్నారు.

బుధవారం ఈ కేసు లాస్ ఏంజెల్స్ కోర్టులో విచారణకు వస్తుంది.

బ్రిట్నీ స్పియర్స్

ఫొటో సోర్స్, Reuters

ఇంతకీ ఈ కన్సర్వేటర్‌షిప్ ఏమిటి?

కోర్టు ద్వారా చేసుకున్న ఒక ఒప్పందం ప్రకారం 2008 నుంచి తన కెరీర్, ఆర్థిక నిర్ణయాలను బ్రిట్నీ తీసుకోవడం లేదు.

మానసిక వైకల్యం, ఇతర మానసిక సమస్యల కారణంగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేనివారికి ఈ కన్సర్వేటర్‌షిప్ అనుమతి ఇస్తారు.

అంటే వారి తరఫున వేరొకరు కన్సర్వేటర్ హోదాలో నిర్ణయాలు తీసుకుంటారు.

ఈ ప్రకారమే గత పన్నెండేళ్లుగా బ్రిట్నీకి సంబంధించిన అన్ని నిర్ణయాలను తండ్రి, న్యాయవాదే చూస్తున్నారు. ఆమె ఆస్తిపాస్తులు, వ్యక్తిగత జీవిత వ్యవహారాలనూ వారే చూస్తున్నారు.

ఆమె ఎవరిని కలవాలనేదీ వారి చేతుల్లోనే ఉంటుంది. ఆమె చికిత్సకు సంబంధించి డాక్టర్లతో మాటామంతీ కూడా వారే జరుపుతారు.

బ్రిట్నీ స్పియర్స్

ఫొటో సోర్స్, BritneySpears

ఇంతకీ బ్రిట్నీ ఎందుకలా మారిపోయింది

బ్రిట్నీ కెవిన్ ఫెడర్లైన్‌తో విడాకులు తీసుకున్న తరువాత.. తన ఇద్దరు పిల్లల కస్టడీ తనకు రాకుండా పోయాక 2007 నుంచి ఆమె అనూహ్యంగా ప్రవర్తించడం ప్రారంభించారు.

గుండు చేయించుకోవడం.. ఓ ప్రెస్ ఫొటోగ్రాఫర్ కారును గొడుగుతో పొడవడం వంటి పనులతో అప్పట్లో ఆమె పతాక శీర్షికల్లో నిలిచారు.

తన పిల్లలను భర్తకు అప్పగించడానికి నిరాకరించడం.. ఆ విషయంలో పోలీసులతో వివాదం కారణంగా ఆమెను కొంతకాలం మానసిక చికిత్స నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు.

ఆ తరువాత 2008లో కోర్టు ద్వారా ఈ కన్సర్వేటర్‌షిప్ మొదలైంది.

తండ్రి తనకు కన్సర్వేటర్‌గా ఉన్న ఈ పన్నెండేళ్ల కాలంలో ఆమె మూడు ఆల్బమ్‌లు విడుదల చేశారు. ఎక్స్ ఫ్యాక్టర్ ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)