కరోనావైరస్: ‘ఎవరిని బతికించాలి, ఎవరిని వదిలేయాలి’... తలలు పట్టుకుంటున్న ఇటలీ వైద్యులు

కరోనావైరస్ మహమ్మారి ఇటలీలో విజృంభిస్తోంది. రోగులందరికీ చికిత్స చేసేందుకు వసతులు చాలక... వారిలో ఎవరికి ప్రాణం పోయాలో, ఎవరిని వద్దనాలో తేల్చుకోలేక సతమతమవుతున్నామని అక్కడి వైద్య సిబ్బంది అంటున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో 80 నుంచి 95 ఏళ్ల వ్యక్తి తీవ్ర శ్వాసకోశ సమస్యలతో వస్తే, తాము చికిత్స అందించకపోవచ్చని క్రిస్టియన్ సలారోలి అనే డాక్టర్ కొరీరె డెల్లా సెరా వార్తాపత్రికతో అన్నారు. బెర్గామోలోని ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు ఆయన హెడ్‌గా ఉన్నారు.

‘‘నా మాటలు ఘోరంగా అనిపించవచ్చు. కానీ, అవి నిజాలు. ‘అద్భుతాలు’ చేసే స్థితిలో మేం ఇప్పుడు లేం’’ అని ఆయన అన్నారు.

కరోనావైరస్ ఇటలీలో చాలా వేగంగా వ్యాపిస్తోంది. శనివారం నాటికి సుమారు 17,660 మందికి అది సోకింది. వారిలో 1,268 మంది చనిపోయారు. మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. చైనాలో 81,021 మంది సోకితే, 3,192 మంది మరణించారు.

ఐరాస లెక్కల ప్రకారం ప్రపంచంలో జపాన్ తర్వాత అత్యధికంగా వృద్ధులు ఉన్న దేశం ఇటలీనే. వృద్ధులపై కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

ఈ నెల మొదట్లో ఇటాలియన్ సొసైటీ ఆఫ్ అనస్తీషియా, అనల్జీసియా, రీసస్కటేషన్ అండ్ ఇంటెన్స్ థెరపీ (ఎస్ఐఏఏఆర్‌టీఐ) వైద్యులకు కొన్ని నైతిక సూచనలు చేసింది. అందరికీ చికిత్స అందించలేని విషమ పరిస్థితుల్లో ఇంటెన్సివ్ కేర్‌లో బెడ్ ఎవరికి ఇవ్వాలనే విషయం గురంచి వీటిని సూచించింది.

ముందుగా ఎవరు వస్తే, వాళ్లను చేర్చుకోవడం కాకుండా, ఇంటెన్సివ్ కేర్ చికిత్స ద్వారా కోలుకునేందుకు అత్యధిక అవకాశాలున్న రోగులపై దృష్టి పెట్టేందుకు కొన్ని ‘కఠిన నిర్ణయాలు’ తీసుకోవాలని వైద్యులు, నర్సులకు ఎస్ఐఏఏఆర్‌టీఐ సూచించింది.

‘‘కొందరికి చికిత్సను తగ్గించి, ఇంకొందరికి చికిత్స చేయమని మేం చెప్పడం లేదు. సరైన చికిత్స వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో వారిపై దృష్టి పెట్టకుండా ప్రస్తుతం ఏర్పడిన అత్యవసర పరిస్థితులు అడ్డుపడుతున్నాయి’’ అని ఎస్ఐఏఏఆర్‌టీఏ పేర్కొంది.

ఇటలీలో 5,200 ఇంటెన్సివ్ కేర్ పడకలు ఉన్నాయి. శీతాకాలంలో ఇవి చాలా వరకూ శ్వాసకోశ సమస్యలతో వచ్చినవారితో నిండిపోతుంటాయి.

ఉత్తర ప్రాంతాలైన లోంబార్డీ, వెనెటో‌ల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కలిపి 1,800 పడకలే ఉన్నాయి.

తమ ఆసుపత్రిలో పడకలన్నీ నిండుకుంటున్నాయని లాంబార్డీలోని ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ స్టెఫానో మాంగ్నోన్ బీబీసీతో చెప్పారు.

‘‘రోజురోజుకీ పరిస్థితి దిగజారుగుతోంది. ఐసీయూలోనే, సాధారణ వార్డుల్లోనూ పడకలు కరోనావైరస్ రోగులతో నిండుతున్నాయి. మా ప్రావిన్సులో మానవ, సాంకేతిక వనరులు చాలడం లేదు. కొత్త వెంటిలేటర్లు, ఇతర పరికరాల కోసం వేచి చూస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

బెర్గామో‌లో ఈ వారం మొదట్లో డేనియల్ మాచినీ అనే ఐసీయూ ఫిజీషియన్ పెట్టిన ట్వీట్లు వైరల్ అయ్యాయి.

‘‘వెంటిలేటర్ల లాంటి పరికరాలు ఇప్పుడు బంగారంతో సమానమయ్యాయి. కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎమర్జెన్సీ వార్డులు నిండుతున్నాయి. మా సహచరుల్లో కొందరికీ వైరస్ సోకింది. వారి నుంచి వారి కుటుంబ సభ్యులకూ వ్యాపించింది’’ అని ఆయన ఆ ట్వీట్లలో రాశారు.

రోగుల్లో ఎవరికి చికిత్స అందించాలనే విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుండంటంతో వైద్య సిబ్బంది తీవ్రంగా కుంగిపోతున్నారని డాక్టర్ సలారోలి అన్నారు.

‘‘చీఫ్ డాక్టర్‌కు గానీ, అప్పుడే వచ్చిన యువ డాక్టర్‌కు గానీ... ఓ మనిషి విధిని నిర్ణయించాల్సి రావడమనేది తేలిక కాదు. పైగా ఇంత పెద్ద స్థాయిలో. 30 ఏళ్లకు పైగా అనుభమున్న నర్సులు కూడా ఏడుస్తూ, వణికిపోవడం నేను చూస్తున్నా’’ అని ఆయన చెప్పారు.

యూరప్ వ్యాప్తంగా ఆసుపత్రులు, క్లినిక్‌లన్నింటిలో సామగ్రి అందించే విషయంలో సమన్వయం కోసం యూరప్ అంతటికీ ఓ విభాగం పనిచేయాలని ఇటలీ విదేశాంగ మంత్రి లుయిగీ డీ మయో బీబీసీతో అన్నారు.

రెడ్ జోన్ విధించిన ఉత్తర ఇటలీలోని పది పట్టణాల్లో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు ఏవీ నమోదు కాలేదని ఆయన చెప్పారు.

‘‘యూరప్‌లో కరోనావైరస్ తీవ్రప్రభావం మొట్టమొదట పడింది ఇటలీపైనే. ఈ అత్యవసర పరిస్థితి నుంచి మొదటగా బయటపడేది కూడా ఇటలీనే కావాలని ఆశిస్తున్నా’’ అని లుయిగీ అన్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)