హాగిబిస్ పెనుతుపాను: నీట మునిగిన బుల్లెట్ రైళ్లు

ఫొటో సోర్స్, Reuters
జపాన్‌లో టైపూన్ హాగిబిస్ సృష్టించిన తీవ్ర విధ్వంసంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది ఆచూకీ గల్లంతయ్యింది. అనేక మంది గాయపడ్డారు.
ఈ పెను తుపాను కారణంగా పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. చెట్లు కూలిపోయాయి.
నదులు ఉప్పొంగి ప్రవహించడంతో 14 లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొన్ని ప్రాంతాలలో బుల్లెట్ రైళ్లు కూడా సగం లోతు దాకా వరద నీటిలో మునిగిపోయాయి.
వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను హెలీకాప్టర్లలో వెళ్లి సహాయక దళాలు రక్షిస్తున్నాయి.
సహాయక చర్యల కోసం ప్రభుత్వం 27,000 మంది సైనిక బలగాలను, ఇతర సహాయక సిబ్బందిని రంగంలోకి దించింది.

ఫొటో సోర్స్, Reuters
హాగిబిస్ టైపూన్ ప్రస్తుతం ఉత్తర దిశగా కదులుతోంది. అలా కదులుతూ అది ఉత్తర పసిఫిక్‌లోకి ప్రవేశిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
టోక్యోకు నైరుతి వైపున ఉన్న ఇజు ద్వీపకల్పంలోకి శనివారం సాయంత్రం 7 గంటలకు టైపూన్ ప్రవేశించింది. దాని ప్రభావంతో దాదాపు ఐదు లక్షల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
గ్రేటర్ టోక్యో పరిధిలో 1,50,000 నివాసాలలోకి నీరు చేరింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఫుజీ పర్వతానికి సమీపంలో ఉన్న హకోన్ పట్టణంలో శుక్ర, శనివారాల్లో కలిపి 1 మీటరు (3 అడుగుల)కు పైగా వర్షపాతం నమోదైంది. కేవలం 48 గంటల్లోనే అంత భారీ వర్షపాతం నమోదవ్వడం జపాన్ చరిత్రలో ఇదే మొదటిసారి.

ఫొటో సోర్స్, Reuters
నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు నివాస ప్రాంతాలు జలమయమయ్యాయని జపాన్‌లోని బీబీసీ ప్రతినిధి రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ హాయెస్ చెప్పారు.
కొందరు కొండచరియలు విరిగిపడటంతో చనిపోగా, మరికొందరు కార్లలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరో 13 మంది ఆచూకీ తెలియడంలేదని, డజన్ల కొద్దీ గాయపడ్డారని కథనాలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, EPA
పెను తుపానుకు ముందే 70 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. కానీ, చాలామంది వెళ్లలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలలో 50,000 మంది మాత్రమే ఉన్నారు.
చాలా మంది ముందుగానే నిత్యావసరాలను నిల్వ చేసుకున్నారు, సూపర్ మార్కెట్లన్నీ ఖాళీ అల్మారాలతో కనిపించాయి.
"ముందస్తుగా అత్యవసర హెచ్చరికలు జారీ చేసిన నగరాలు, పట్టణాలు, గ్రామాలలో అతిభారీ వర్షపాతం నమోదైంది" అని జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) తెలిపింది.
శనివారం అనేక బుల్లెట్ రైలు సర్వీసులను నిలిపివేశారు. టోక్యో నగరంలో చాలా లైన్లలో మెట్రో సేవలు ఆపేశారు.

ఫొటో సోర్స్, Reuters
టోక్యోలోని హనేడా, చిబాలోని నరిటా విమానాశ్రయాలలో వెయ్యికి పైగా విమానాలను రద్దు చేశారు.
ఈ పెను తుపాను కారణంగా కొన్ని రగ్బీ ప్రపంచ కప్ మ్యాచ్‌లను రద్దు చేశారు. అయితే, జపాన్, స్కాట్లాండ్ మధ్య కీలకమైన మ్యాచ్ ఆదివారం యథావిధిగా జరుగుతోంది.
గత నెలలోనే టైపూన్ ఫక్సాయ్ జపాన్‌లోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేసింది. 30,000 నివాసాలను ధ్వంసం చేసింది.
ఆ విధ్వంసం నుంచి కోలుకునేలోపే, ఇప్పుడు హాగిబిస్ విరుచుకుపడింది.
జపాన్‌లో ఏటా దాదాపు 20 టైపూన్లు వస్తుంటాయి. అయితే, టోక్యో నగరం మీద అన్ని టైపూన్లు ప్రభావం చూపించవు.
ఇవి కూడా చదవండి:
- వరదల్లో మోడల్‌తో ఫ్యాన్సీ ఫొటోషూట్ ఎందుకు చేశారు
- బిహార్ వరదల్లో మునగడానికి భారత్, నేపాల్ మధ్య గొడవలే కారణమా?
- లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ‘బిగ్ బాస్’
- క్రికెట్: భారత్‌లో బెట్టింగ్ చట్టబద్ధమైతే ఏమవుతుంది? బుకీలు ఏమంటున్నారు?
- కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను బీబీసీ ఎలా కనిపెట్టిందంటే...
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
- భారతదేశ వాతావరణం: ఒకవైపు వరదలు, మరోవైపు కరవు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








