మోదీ-అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూకు రాజకీయాలతో సంబంధం లేదా? - అభిప్రాయం

ఫొటో సోర్స్, Bjp
- రచయిత, హనీఫ్ ముహమ్మద్,
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, పాకిస్తాన్
కొంత కాలం క్రితం నేను ఒక పెద్ద భారత వ్యాపారిని కలిశాను. ఆయన ఒక యువకుడు. "మీరు ఏం చేస్తుంటారు" అని ఆయన్ను అడిగాను. "సినిమాలు తీస్తుంటానని" చెప్పారు.
నేను ఆయనతో "మీరు నిర్మాతా" అని అడిగాను. పెద్ద కంపెనీల పేర్లన్నీ చెప్పిన ఆయన "సినిమా నిర్మించే ఆ కంపెనీలకు నేను డబ్బులు పెడుతుంటా" అన్నారు.
నేను "అయితే మీరు చాలా స్క్రిప్ట్ చదవాల్సి ఉంటుందే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఒక్కడూ స్క్రిప్ట్ ఐడియాలతో సిద్ధమైపోతున్నాడుగా" అన్నాను.
దానికి ఆయన "ఆ.. అది కాస్త తలనొప్పిగానే ఉంటుంది. కానీ నా దగ్గర దానికొక మంచి ఫార్ములా ఉంది" అన్నాడు.
నేను "అదేంటి" అనగానే, ఆయన "నిర్మాత నా దగ్గరకు స్క్రిప్ట్ తీసుకుని రాగానే, నేను దాన్ని చదవను, 'ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఉన్నాడా' అని ఆయన్నే అడుగుతా" అన్నాడు.
"ఉన్నాడు అని చెబితే, ఇదిగో డబ్బు తీసుకో, వెళ్లి సినిమా తీయమని చెబుతా, లేడు అంటే, స్క్రిప్టులో అక్షయ్ కుమార్ ఉన్నప్పుడు నా దగ్గరికి మళ్లీ రా అంటాను" అన్నారు.
ఇప్పటివరకూ ఆ ఫార్ములా బాగానే పనిచేసిందని ఆయన నాతో అన్నారు. నాకెందుకో ఆ వ్యాపారి నాతో పరాచికాలు ఆడుతున్నట్టే అనిపించింది.

ఫొటో సోర్స్, Bjp
కొన్ని రోజుల క్రితం నేను ప్రధాన మంత్రి మోదీ గారి ఒక ఇంటర్వ్యూ చూశాను. అది చూడగానే "ఆ ఫార్ములా" ఇప్పుడు మోదీ దగ్గరికి కూడా చేరిందనే అనిపించింది.
మోదీ ఐదేళ్లు ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఒక్క ఇంటర్వ్యూగానీ, ప్రెస్ కాన్ఫరెన్స్ గానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల మధ్య ఒక సుదీర్ఘ ఇంటర్వ్యూ, అది కూడా అక్షయ్ కుమార్‌కు ఇచ్చారు. వీటన్నిటికీ తోడు దీనికి రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల సమయంలో ఇంటర్వ్యూ ఇవ్వడం, అది రాజకీయం కాదని చెప్పడం చూస్తుంటే, ఇండియా-పాకిస్తాన్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ ఏర్పాటు చేస్తామని, శాంతియుతంగా యుద్ధం చేద్దామని చెబుతున్నట్లే ఉంది. లాహోర్ ప్రజలు ఇవి చూస్తే, "రాజకీయాలకు సంబంధం లేదట ఓ పెద్ద చెప్పొచ్చాడు" అనుకుంటారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఒక వ్యక్తి "నా పాలన గురించి మర్చిపొండి. నా ముఖం చూడండి. నేను ఒక పేద బాలుడిని అనే విషయం గుర్తుంచుకోండి. నేను మామిడిపండు జుర్రుతూ వెళ్లా, ప్రధాన మంత్రి అయిపోయా" అని చెప్పుకోవడం లాంటి రాజకీయ ఇంటర్వ్యూ నేను ఇప్పటివరకూ చూళ్లేదు.
"నేను భుజానికి సంచి తగిలించుకుని ఒంటరిగా దేశ సేవ చేయడానికి బయల్దేరాను. ప్రధానిగా ఎవరు చేసేశారో తెలీనేలేదు. నాకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండేది కాదు. నేను కూడా మీలాగే బాగా జోకులు వేసేవాడ్ని. ప్రధాని అయ్యాక ఎంత కష్టపడుతున్నానో చూడండి. మా అమ్మతో సమయం గడపడానికి కూడా టైం దొరకడం లేదు".. ఇలాంటివి మాటలు వింటే లాహోర్ జనం "తల్లినే చూసుకోని వాళ్లు, వేరే వాళ్లను ఎలా చూసుకుంటారులే" అనుకుంటారు.

ఫొటో సోర్స్, Ani
మోదీ ఈ ఇంటర్వ్యూ మొత్తం ఓటు అడగకుండానే ఓటు వేయమని చెబుతూ వచ్చారు. "మీకు నా 56 అంగుళాల చాతీకి ఓటు వేయకూడదని అనిపించినా, నా మతంతో జరిగే యుద్ధం నచ్చకపోయినా, నా పాకిస్తాన్ వ్యతిరేక వైఖరిపై సందేహాలున్నా, ఒక పేద బాలుడిగా భావించి నాకు ఓటు వేయండి" అన్నారు.
"నాతో ఎవరున్నారో చూడండి. అక్షయ్ కుమార్. ఈయనకు 50 ఏళ్లు దాటాయి. అక్షయ్ ఇప్పుడు హైస్కూల్ పిల్లాడి యూనిఫాం వేసుకుని తెరపై కనిపించినా, మీరు చప్పట్లు కొడతారు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. నాకోసం కాకపోయినా, ఈయన్నైనా చూడండి" అన్నారు.
అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూలో మోదీని ఒక్కోసారి ప్రేమగా, ఒక్కోసారి సిగ్గుపడుతూ ఏదో సినిమాలో రవీనా టండన్‌ను చూసినట్టు చూశారు. ఆ... ఆ సినిమా పేరు కూడా గుర్తొచ్చింది 'మొహరా'.
ఈయన తలకు రుమాలు కట్టుకుని మోదీ చెయ్యి పట్టుకుని "తూ చీజ్ బడీ హై మస్త్-మస్త్" అని పాటందుకుంటారేమో అనిపించింది.
వాళ్లు అలా చేసుంటే నేను దాన్ని కచ్చితంగా రాజకీయాలకు సంబంధం లేని ఇంటర్వ్యూనే అనుకునేవాడ్ని.
మోదీ ఇంటర్వ్యూలు ఇవ్వకపోయినా 'మన్ కీ బాత్' పేరుతో పెద్ద పెద్ద ప్రసంగాలు చేశారు. ప్రజలకు మాత్రం తమ మనసులో మాట చెప్పే అవకాశం ఐదేళ్ల తర్వాతే లభిస్తుంది.
ఇక్కడ కరాచీ మాటకొస్తే 'మోదీ స్వయంగా ఒక పూర్తి సినిమా' లాంటి వారు. ఇప్పుడు ఆయన అందులో అక్షయ్ కుమార్‌ను కూడా పెట్టారు.
ఆ వ్యాపారి ఫార్ములా ప్రకారం ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. మిగతాదంతా ఓటర్ల వివేకంపైనే ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- లోక్సభ ఎన్నికలు 2019: పార్టీలన్నీ సోషల్ మీడియాపై ఎందుకు దృష్టిసారిస్తున్నాయి?
- అభిప్రాయం: మోదీ ప్రతి ప్రసంగంలోనూ 2022 ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు?
- నవీన్ పట్నాయక్ మ్యాజిక్ అయిదోసారీ ఫలించనుందా?
- లోక్సభ ఎన్నికలు 2019: 24 సార్లు ఓటమి.. ‘ఇవే నా చివరి ఎన్నికలు కావొచ్చు’
- క్రిస్మస్: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- సర్జికల్ స్ట్రైక్స్ అబద్ధం, అవన్నీ ఊహాజనితం: పాకిస్తాన్
- ‘మోదీ గంటల కొద్దీ గొప్పలు చెప్పి.. చివర్లో సన్యాసిని అంటారు’
- బీజేపీ ‘ఆర్టికల్ 370, 35ఎ రద్దు' హామీని వ్యతిరేకిస్తున్న జమ్ముకశ్మీర్ పార్టీలు
- ‘బీజేపీ వ్యతిరేకులు దేశద్రోహులు కారు’ - అడ్వాణీ
- రాజకీయ పార్టీల నుంచి ముస్లిం మహిళలు ఏం కోరుకుంటున్నారు...
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









