రూ.50 వేలిస్తే వర్షాలు కురిపిస్తానన్న వ్యక్తి.. ఆయన సేవలు ఉపయోగించుకోవాలంటూ విజయనగరం కలెక్టర్ సిఫారసు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఉత్తరాంధ్ర ప్రాంతం చాలాకాలంగా వర్షాభావ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు కురిపించటం కోసం విజయనగరం జిల్లా కలెక్టర్ రాసిన ఒక సిఫారసు లేఖ వివాదాస్పదంగా మారింది.
వర్షాభావాన్ని, కరువు కష్టాలను అధిగమించేందుకు గతం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది.
దశాబ్దం క్రితమే మేఘమథనం వంటి కార్యక్రమాలు నిర్వహించింది. ఆ తర్వాత రెయిన్ గన్ల సహాయంతో పంటల పరిరక్షణ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ ఏడాది విజయనగరం జిల్లాలో వర్షాభావం లోటు కొనసాగుతోంది.
జూన్ 1 నుంచి నవంబర్ 23 నాటికి జిల్లాలో 933 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయితే సాధారణ వర్షపాతంగా భావిస్తారు. కానీ ఈ ఏడాది 683.8 మి.మి వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. దాంతో 26.7 శాతం లోటు ఏర్పడింది.

‘ఆయన సేవలు ఉపయోగించుకోండి’
ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాకి చెందిన చియాద్రి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇటీవల విజయనగరం జిల్లా కలెక్టర్‌ని కలిశారు. తనకు వర్షాలు కురిపించే శక్తి ఉందని చెప్పడంతో కలెక్టర్ ఆశ్చర్యపోయారు.
ఎప్పుడు కావాలంటే, అక్కడ వర్షాలు కురిపిస్తానంటూ చెప్పిన వెంకటేశ్వర్లు సేవలను వినియోగించుకోవాలంటూ కలెక్టర్ నేరుగా వ్యవసాయ శాఖ అధికారులను కోరుతూ లేఖ కూడా విడుదల చేశారు.
కొత్తవలస మండలం చీపురువలసలో 30 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం కురిపించినట్టు వెంకటేశ్వర్లు చెప్పుకున్న విషయాన్ని కలెక్టర్ తన లేఖలో ప్రస్తావించడం విశేషం.
ఆ లేఖ ద్వారా జిల్లాలోని పలువురు అధికారులను వెంకటేశ్వర్లు కలిశారు. చివరకు విజయనగరం మునిసిపాలిటీ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణని కూడా కలిశారు.

ఫొటో సోర్స్, Getty Images
‘వర్షం స్వామి కరుణించటానికి రూ. 50 వేలు ఖర్చు‘
వర్షం కురిపిస్తారంటూ, ఆయన సేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరిన లేఖను పరిగణలోకి తీసుకున్న మునిసిపల్ చైర్మన్.. తమకు ముషిడిపల్లి రిజర్వాయర్‌లో వర్షం కురిపించాలని కోరారు.
వర్షం స్వామి కరుణించడానికి మొత్తం రూ. 50,000 ఖర్చవుతుందని.. అడ్వాన్సుగా రూ. 7,000 ఇవ్వాలని కోరారు. దీంతో అక్కడి వారికి అనుమానం వచ్చి నిలదీయగా వర్షం స్వామి వ్యవహారం బయటకొచ్చింది.
అంతకుముందే కలెక్టర్ లేఖతో తమను కలిశారని విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ జేడీ జీఎస్ఎన్ఎస్ లీలావతి తెలిపారు. తాను ఒక ప్రార్థన చేసి, ధ్యానం ద్వారా వర్షాలు కురిపిస్తానని చెప్పినట్టు జేడీ వివరించారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏదో చేస్తానని చెప్పినప్పుడు అభ్యంతరం చెప్పడం ఎందుకని సహకరించామన్నారు.
‘కొత్తవలసలో కురవలేదు కానీ.. గంట్యాడలో వర్షం కురిసింది’
ఆయన కోరడంతో ప్రార్థన చేయాలని తాము చెప్పడంతో కొత్తవలస మండలంలో పూజలు చేశారని, కానీ ఆ మండలంలో మాత్రం వర్షం కురవలేదన్నారు. గంట్యాడ మండలంలో మాత్రం వర్షం కురిసినట్టు జేడీ లీలావతి వివరించారు.
ఈ లేఖ రాసిన విషయంపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహార్‌లాల్ ని సంప్రదించగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
కలెక్టర్ కార్యాలయ అధికారి ఆనంద్ మాత్రం లేఖ జారీ చేసిన తీరు గురించి బీబీసీకి వివరించారు. తన దగ్గర అతీతశక్తులున్నాయని, ఒక అవకాశం ఇవ్వాలని వేడుకోవడంతోనే తాము లేఖ రాసినట్టు ఆయన చెప్పారు.
అయితే కలెక్టర్ లెటర్ హెడ్ మీద జారీ అయిన లేఖను దుర్వినియోగం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.
లేఖను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, వెంకటేశ్వర్లు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నానని చెబుతున్నారని ఆనంద్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇలాంటి వాటిని ప్రోత్సహించటం తగదు’
ఇలాంటి ప్రయత్నాలు తనకు ఆశ్చర్యం కలిగించాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ఇ.ఎస్.శర్మ పేర్కొన్నారు. అతీతశక్తులున్నాయని చెబుతున్న వారిని ప్రోత్సహించడం ఏమాత్రం తగదన్నారాయన.
ప్రభుత్వ సర్వీసులో కలెక్టర్ స్థాయి అధికారి ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు వేరు, సొంతంగా ఇలాంటివి ప్రోత్సహించడం వేరు గానీ అధికారాన్ని ఉపయోగించుకుని అతీతశక్తుల పేరుతో మార్కెటింగ్ చేసినట్టుగా ఉందన్నారు.
ప్రజాధనం దుర్వినియోగం చేసినట్టుగా పరిగణలోకి తీసుకోవాలని శర్మ కోరుతున్నారు. సమాజంలో ఇలాంటి ధోరణులు పెరుగుతున్నాయనడానికి ఈ లేఖ ఓ నిదర్శనమన్నారు.
శాస్త్రీయ భావనల ప్రచార కార్యక్రమంలో ఉన్న సైన్స్ ఉద్యమ కార్యకర్త త్రిమూర్తులురెడ్డి కూడా ఈ లేఖ మీద స్పందించారు. ఇప్పటికే కృత్రిమ వర్షాల కోసం అనేక ప్రయోగాలు చేసినప్పటికీ సంపూర్ణంగా ఫలితాలు రాలేదన్నారు.
అలాంటి సమయంలో ఆధారాలు లేని విషయంలో అతీతశక్తులున్నాయంటూ నేరుగా జిల్లా కలెక్టర్ అధికారికంగా లేఖ రాయడాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. వ్యక్తిగత విశ్వాసాలను అధికారయుతం చేయడం తగదన్నారు.
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- 26/11 ముంబయి దాడులకు ఎల్లుండికి పదేళ్లు పూర్తి.. ‘ఆ రోజు ఓ సైన్యమే యుద్ధానికి దిగినట్టు అనిపించింది’
- తెలంగాణలో టీడీపీతో పొత్తు కాంగ్రెస్‌కు లాభిస్తుందా?
- తెలంగాణ ఎన్నికలు 2018: మీ నియోజకవర్గ అభ్యర్థులు ఎవరో తెలుసుకోండి
- తెలంగాణ ఎన్నికలు 2018: నెహ్రూ నుంచి సోనియా గాంధీ దాకా... తెలంగాణపై ఏమన్నారు?
- బ్రెగ్జిట్ ప్రభావం భారత్‌పై ఉంటుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









