అమెరికాను ఆందోళనకు గురి చేస్తున్న చైనా సైనిక వ్యూహాలు

యుద్ధ విమానం

ఫొటో సోర్స్, Getty Images

పసిఫిక్ సముద్రంలోని అమెరికా, దాని మిత్ర పక్షాల సైనిక స్థావరాలపై "దాడులు చేసేందుకు చైనా సైన్యం శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోందని" 'పెంటగాన్ నివేదిక' హెచ్చరించింది.

అమెరికా కాంగ్రెస్‌కు పెంటగాన్ అందించిన నివేదిక ప్రకారం, చైనా తన బాంబర్ ప్లేన్‌లను మరింత దూరానికి పంపించే విధంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది.

రక్షణ రంగానికి చైనా భారీగా 13 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని, ఆ మొత్తం అమెరికా రక్షణ బడ్జెట్‌లో మూడో వంతు అని ఆ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. అయితే, ఈ నివేదికపై చైనా ఇంతవరకూ స్పందించలేదు.

ఆ నివేదికలో ఇంకా ఏముంది?

చైనా నిర్దేశించుకున్న సైనిక, ఆర్థిక లక్ష్యాలలో భాగమే ఈ గగనతల దాడుల హెచ్చరికలు.

''పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పి.ఎల్.ఎ) గత మూడేళ్ళలో సముద్ర ఉపరితల దాడుల పరిధిని వేగంగా విస్తరించింది. కీలక సముద్ర ప్రాంతాల్లో అనుభవాన్ని పెంచుకుంది. అమెరికా, దాని మిత్రపక్షాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంలో శిక్షణ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది" అని నివేదిక వెల్లడించింది.

అంతేకాకుండా, సముద్రం ఉపరితలంపై ఈ విమానాలతో చక్కర్లు కొడుతూ, చైనా అసలు ఏం చెప్పాలని అనుకుంటోందో ఇంకా స్పష్టం కాలేదని కూడా ఆ నివేదిక తెలిపింది.

"పశ్చిమ పసిఫిక్ సముద్రంలో గువామ్ సహా అమెరికా, దాని మిత్ర పక్షాల సైనిక స్థావరాల మీద దాడి చేసే సామర్థ్యం తనకు ఉందని" పీఎల్ఏ చాటుకునే ప్రయత్నం చేస్తోందని, "పోరాడు, విజయం సాధించు" అనే పంథాలో చైనా తన సైన్యాన్ని పునర్వ్యవస్థీకరిస్తోందని ఆ నివేదిక వివరించింది.

చైనా యుద్ధ నౌక

ఫొటో సోర్స్, Getty Images

ఈ నివేదిక చేసిన అంచనాల ప్రకారం రాబోయే పదేళ్ళలో చైనా రక్షణ బడ్జెట్ దాదాపు 16.80 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. చైనా అంతరిక్ష కార్యక్రమాలను కూడా విశ్లేషించిన ఈ నివేదిక, స్పేస్ మిలటరైజేషన్ విషయంలోనూ చైనా తన ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ముందుకు వెళ్ళేందుకు నిర్ణయించుకుందని తెలిపింది.

అంతరిక్షంలో సైనిక కార్యకలాపాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ గత జూన్ నెలలో మాట్లాడుతూ, అమెరికా సైనిక బలగాల ఆరవ శాఖ - ‘స్పేస్ ఫోర్స్‌’ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.

ఆందోళన కలిగిస్తున్న ప్రాంతాలు ఏవి?

అమెరికా కీలక పాత్ర పోషిస్తోన్న పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా ఆధిపత్యం పెరుగుతుండటం పట్ల అమెరికా ఆందోళన చెందుతోంది.

ఇక్కడి కీలక ప్రాంతాలలో ఒకటైన దక్షిణ చైనా సముద్రంలో ఎక్కువ భాగం తమదేనని చైనా, ఇంకా ఇతర దేశాలు చెప్పుకుంటున్నాయి.

దక్షిణ చైనాలోని అమెరికా మెరైన్

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణ చైనా సముద్ర ఉపరితలం మీద తరచూ విమానాలలో విహరిస్తూ ఆ ప్రాంతంలో ప్రయాణించే స్వేచ్ఛ తమకు ఉందని అమెరికా చాటుకుంటోంది. అయితే, ఇక్కడి దీవుల్లో చైనా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. అవి సైనిక స్థావరాలేనని భావిస్తున్నారు. అంతేకాకుండా, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఔట్‌పోస్టులలో చైనా బాంబర్లను కూడా మోహరించింది.

ఇక, మరో ఆందోళనకరమైన ప్రాంతం తైవాన్. అది తన నుంచి విడిపోయిన భూభాగమేనని చైనా భావిస్తుంటుంది. బలప్రయోగంతో తైవాన్‌ను తమ దేశంలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నిస్తోందని కూడా ఆ నివేదిక హెచ్చరించింది.

''చైనా, తైవాన్ వ్యవహారంలో అమెరికా జోక్యాన్ని వీలైనంతగా ఆలస్యమయ్యేలా చేయాలన్నది చైనా ఆలోచన. ఆ విధంగా పరిమిత కాలంలో తీవ్ర స్థాయిలో దాడి చేసి తైవాన్‌ను తన వశం చేసుకోవాలని చైనా భావిస్తోంది'' అని నివేదిక చెబుతోంది.

అమెరికా 1979లో చైనా కోరిక ప్రకారం తైవాన్‌తో సంబంధాలు తెంచేసుకుంది. కానీ, రాజకీయ, భద్రతాపరమైన సంబంధాలను మాత్రం సన్నిహితంగా కొనసాగిస్తోంది. అది చైనాకు కంటగింపుగా ఉంది.

అంతేకాకుండా, చైనా, ఫిలిప్పీన్స్ దేశాలతో సరిహద్దు వివాదాలున్న జపాన్‌లో కూడా తన సైనిక స్థావరాలను ఆమెరికా విస్తృతంగా నిర్వహిస్తోంది.

అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు సైనికేతర రంగాల్లో కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాలు దిగుమతుల మీద పోటాపోటీగా సుంకాలు విధించుకుంటూ ఆర్థిక ఉద్రిక్తతలకు కూడా ఆజ్యం పోస్తున్నాయి.

ఉద్రిక్తతను తగ్గించేందుకు ఏం చేయాలి?

చైనాతో నిర్మాణాత్మకమైన, సత్ఫలితాలనందించే సంబంధాలను అమెరికా కోరుకుంటోందని నివేదిక తెలిపింది.

అమెరికా, చైనా సైనిక అధికారుల మధ్య సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయని కూడా గుర్తు చేసింది.

గత జూన్ నెలలో అమెరికా రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మేటిస్ చైనాలో పర్యటించారు. అమెరికా రక్షణ మంత్రి 2014 తర్వాత చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)