'స్పీడ్ లిమిట్' 10 కిలోమీటర్లు తగ్గించారని...

ఫొటో సోర్స్, Getty Images
ఫ్రాన్స్‌లో గ్రామీణ ప్రాంత రోడ్లపై గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 90 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లకు తగ్గిస్తూ ఎమాన్యుయెల్ మేక్రాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ చర్యతో ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని, ఏటా 300 నుంచి 400 మంది ప్రాణాలు కాపాడొచ్చని రోడ్డు భద్రత విభాగం చెబుతోంది. ఇది అంతర్గత వ్యవహారాల శాఖ పరిధిలో ఉంటుంది.
ఈ నిబంధన దేశవ్యాప్తంగా నాలుగు లక్షల కిలోమీటర్ల పొడవున ఉన్న రోడ్లపై వర్తిస్తుంది.
2017లో ఫ్రాన్స్‌లో రోడ్డు ప్రమాదాల్లో 3,684 మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
'జరిమానాల కోసమే'
గరిష్ఠ వేగాన్ని కుదించడాన్ని ఫ్రాన్స్ వ్యాప్తంగా అత్యధికులు వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
వేగ పరిమితి తగ్గింపు అనవసరమని, తప్పుడు విశ్లేషణల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని చాలా మంది డ్రైవర్లు విమర్శిస్తున్నారు. ఈ చర్యతో తమ రోజువారీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని విచారం వ్యక్తంచేశారు.
గత ప్రభుత్వాల మాదిరే మేక్రాన్ ప్రభుత్వం కూడా ప్రజల పట్ల సున్నితత్వం, వారి అవసరాలు, సమస్యల పట్ల స్పృహ లేకుండా వ్యవహరిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ నిర్ణయాన్ని జరిమానాల రూపంలో వాహన చోదకుల నుంచి మరింత డబ్బు వసూలు చేసేందుకు వేసిన ఎత్తుగడ అని కొందరు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
వేగ పరిమితి కుదింపుపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఎందుకంటే ఇది సాధారణ ప్రజానీకాన్ని నేరుగా ప్రభావితం చేసే అంశమని పోలింగ్ ఏజెన్సీ 'ఇఫాప్'కు చెందిన జెరోమ్ ఫౌర్‌క్వెట్ తెలిపారు. ఈ ఆలోచన ప్రధానమంత్రి ఎడ్వర్డ్ ఫిలిప్‌దే అయ్యుంటుందని అత్యధికులు భావిస్తున్నారని చెప్పారు. ఈ చర్యతో అధ్యక్షుడు మేక్రాన్ ప్రతిష్ఠ మసకబారుతోందన్నారు.
మేక్రాన్‌పై వ్యతిరేకత
ఈ నిర్ణయం గ్రామీణ ఫ్రాన్స్‌లో తనకు ప్రజాదరణను తగ్గిస్తోందనే విషయం మేక్రాన్‌కు తెలుసు. ఇప్పటికే పల్లెల్లో ఆయన్ను పట్టణ ప్రాంత పక్షపాతిగా చూస్తున్నారు. తన శాఖ ఆధ్వర్యంలోనే అమలవుతున్న ఈ విధానంపై అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి గెరార్డ్ కొలాంబ్ సంతృప్తిగా లేరు.
అధ్యక్షుడు మేక్రాన్ మద్దతుదారులు కూడా ఈ విషయంలో ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏయే రోడ్లపై గరిష్ఠ వేగ పరిమితిని మార్చాలో నిర్ణయించే అధికారాన్ని స్థానిక పాలనా యంత్రాంగానికి కల్పించేలా చట్టం చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. మేక్రాన్ సారథ్యంలోని 'లా రిపబ్లికన్ ఎన్ మార్చే(ఎల్ఆర్ఎం)' పార్టీకి చెందిన పలువురు ఎంపీలు వీటికి మద్దతు పలుకుతున్నారు.
గంటకు 80 కి.మీ. గరిష్ఠ పరిమితి ఫలితాలపై రెండేళ్ల తర్వాత మదింపు చేస్తామని, ఆశించిన ఫలితం లేకపోతే ఉపసంహరించుకుంటామని మేక్రాన్ ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.
బోర్డుల మార్పు
ప్రస్తుతం గరిష్ఠ వేగ పరిమితిని 90 కిలోమీటర్లుగా చూపిస్తున్న దాదాపు 20 వేల బోర్డులను అధికారులు తొలగిస్తున్నారు. వీటి స్థానంలో గరిష్ఠ పరిమితిని 80 కి.మీ.గా చూపే బోర్డులు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా చట్టసభలో 'జాతీయవాదాన్ని' తూర్పారబట్టిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
- గాంధీ మహాత్ముడిగా మారేందుకు పురికొల్పిన ఆ అవమానానికి 125 ఏళ్లు
- తాగునీరు అందని గ్రామాలు.. ఆంధ్రాలో మూడొంతులు, తెలంగాణలో సగం
- యూరప్: జాతీయవాదం ఎందుకు పెరుగుతోంది? ఏ దేశంలో ఎలా ఉంది?
- రాషిద్ ఖాన్: పాకిస్తాన్లో క్రికెట్ నేర్చుకున్నా.. భారతీయుల ద్వారా ప్రేమించటం నేర్చుకున్నా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








