కిమ్‌తో శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది: ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జూన్ 12న సింగపూర్‌లో శిఖరాగ్ర సదస్సు జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఆ సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్టు గతవారం ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ, ఉత్తర కొరియా సీనియర్ మంత్రి జనరల్ కిమ్ యోంగ్- చోల్‌తో వైట్‌హౌస్‌లో చర్చలు జరిపిన అనంతరం ట్రంప్ మళ్లీ తాజా ప్రకటన చేశారు.
ఈ భేటీ సందర్భంగా ఉత్తర కొరియా పాలకుడు కిమ్ పంపిన లేఖను చోల్ అమెరికా అధ్యక్షుడికి అందజేశారు.
తొలుత ఆ ఉత్తరం 'చాలా ఆసక్తికరంగా' ఉందని చెప్పిన ట్రంప్, తర్వాత దాన్ని ఇంకా తెరవలేదని అన్నారు.
ఈ సమావేశం అనంతరం వైట్‌హౌస్ వద్ద ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
ఈ ఒక్క సమావేశంతో ఉత్తర కొరియా వివాదాస్పద అణు కార్యక్రమంపై పూర్తిస్థాయి డీల్ కుదరకపోవచ్చని ట్రంప్ అన్నారు.
"కేవలం ఒక్క సదస్సులోనే అంతా జరిగిపోతుందని నేను ఎన్నడూ చెప్పలేదు. సింగపూర్ భేటీ ద్వారా దానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభమవుతుందని అనుకుంటున్నా. మా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి, అది చాలా సానుకూల విషయం" అని ట్రంప్ వివరించారు.

ఫొటో సోర్స్, iStock
బినామీల వివరాలు చెప్పండి.. రూ. కోట్లు పట్టుకెళ్లండి
పన్ను ఎగవేత దారులు, బినామీల వివరాలను తెలిపిన వారికి రూ.5 కోట్ల దాకా నజరానా ఇచ్చే పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ప్రకటించింది.
విదేశాల్లో ఆస్తులు కలిగి ఉండి, ఆదాయ పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నవారి వివరాలు అందించిన వారు గరిష్ఠంగా రూ. 5 కోట్లు పొందుతారు.
దేశంలో లోపల ఉన్న ఆస్తులపై పన్ను ఎగవేతకు పాల్పడే వారి వివరాలు చెప్పిన వారు గరిష్ఠంగా రూ.50 లక్షలు అందుకుంటారని ఆర్థిక శాఖ తెలిపింది.
అలాగే, బినామీ వ్యక్తుల ద్వారా లావాదేవీలు, బినామీల పేరు మీద ఆస్తులు కలిగి ఉన్న వారి వివరాలు వెల్లడించిన వారికి రూ. కోటి దాకా రివార్డు లభిస్తుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దిల్లీని కమ్మేసిన దుమ్ము తుపాను
అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ రాజధాని దిల్లీ వాసులకు శుక్రవారం రాత్రి దుమ్ము తుపాను కొంత ఊరటనిచ్చింది. దిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో ఈ ప్రభావం కనబడింది. కొన్ని విమానాలను దారిమళ్లించినట్లు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
దాదాపు 40 కి.మీ.ల వేగంతో వీచిన గాలులు వీచాయని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా దాదాపు 5 డిగ్రీల తగ్గుదల కనిపించి, వాతావరణం ఆహ్లాదంగా మారింది. ఈరోజు కూడా మరో తుపాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
పది రోజుల రైతుల సమ్మె
తమ సమస్యలను పరిష్కరించాలంటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల రైతులు చేపడుతున్న పది రోజుల సమ్మె శుక్రవారం ప్రారంభమైంది.
ఈ 10 రోజులపాటు మార్కెట్లకు పాలు, పండ్లు, కూరగాయలు సరఫరా చేసేదిలేదని రైతులు ప్రకటించారు.
సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయాన్ని గట్టెక్కించేందుకు రైతు రుణాలు మాఫీ చేయాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతుల సమ్మె ప్రభావం దిల్లీ, ముంబయి నగరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
"అయోధ్య వివాదాస్పద భూమిని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలి"
అయోధ్యలో వివాదాస్పద రామ జన్మభూమి - బాబ్రీ మసీదు స్థలాన్ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే కోర్టు దీనిపై కేంద్రానికి విజ్ఞప్తి చేయాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది.
కేంద్రం ఈ విజ్ఞప్తిని పరిశీలించి, మూడు నెలల్లో ఓ నిర్ణయం వెలువరించాలని ఈ పిటిషన్‌పై విచారణ చేసిన ధర్మాసనం సూచించింది.
వివాదాస్పద స్థలాన్ని కేంద్రం చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుని, దాన్ని జాతీయ ప్రాముఖ్యం కలిగిన ప్రదేశాల జాబితాలో చేర్చి రక్షించాలని పిటిషనర్ కోరారు.
ఆలయం, మసీదు... రెండింటికి సంబంధించిన పవిత్రతను కాపాడుతూ, వాటిని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








