అమెరికా: 10 కోట్ల రోబోకాల్స్ చేసిన సేల్స్‌మ్యాన్.. రూ.808 కోట్ల జరిమానా

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో సుమారు 10 కోట్ల ఆటోమేటెడ్ మార్కెటింగ్ కాల్స్ చేసిన ఒక సేల్స్‌మ్యాన్‌కు దాదాపు రూ.808 కోట్ల జరిమానా పడింది. ఇప్పటివరకు అమెరికాలోని స్వతంత్ర సంస్థ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్(ఎఫ్‌సీసీ) విధించిన అత్యధిక జరిమానా ఇదే.
మయామికి చెందిన సేల్స్‌మ్యాన్ ఆడ్రియన్ అబ్రమోవిచ్ విహారయాత్రలు, వాటికి సంబంధించిన ఇతరత్రా ప్యాకేజీలను అమ్మేందుకు ఈ కాల్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వినియోగదారులను మోసగించాలనే ఉద్దేశంగాని, వారికి హాని చేయాలనే ఉద్దేశంగాని తనకు లేవని అబ్రమోవిచ్ చెప్పారు. ఈ వాదనను ఎఫ్‌సీసీ పరిగణనలోకి తీసుకోలేదు.
2016లో మూడు నెలల వ్యవధిలో అబ్రమోవిచ్ 9,67,58,223 రోబోకాల్స్ చేశారని, వినియోగదారుల సమ్మతి లేకుండానే ఈ కాల్స్ చేశారని, ఈ వాస్తవాన్ని ఆయన తోసిపుచ్చడం లేదని ఎఫ్‌సీసీ ఛైర్మన్ అజిత్ పాయ్ ఒక ప్రకటనలో చెప్పారు.
స్థానిక నంబరు నుంచి కాల్ వస్తున్నట్లుగా వినియోగదారులను నమ్మించేందుకు అబ్రమోవిచ్ తన కాలర్ ఐడీని 'స్పూఫింగ్' చేశారని, ఇది అమెరికాలోని చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఎఫ్‌సీసీ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రిప్‌అడ్వైజర్, హిల్టన్ హోటల్స్ లాంటి ప్రముఖ బ్రాండ్లు అందిస్తున్న ఆఫర్ అని చెబుతూ ముందే రికార్డు చేసిన సందేశాన్ని రోబో కాల్ ద్వారా అందించేవారు.
తర్వాత కాల్ విదేశాల్లోని నిర్దేశిత కాల్‌సెంటర్లలోని ఆపరేటర్లకు బదిలీ అయ్యేది. వారు ప్యాకేజీలు అమ్మేందుకు ప్రయత్నించేవారు.
ఎఫ్‌సీసీ ఈ భారీ జరిమానాను 2017లోనే విధించింది. అబ్రమోవిచ్ దీనిపై అప్పీలు చేశారు. జరిమానాను తగ్గించాలని అభ్యర్థించారు.
అతిపెద్ద అక్రమ రోబోకాలింగ్ పథకం ఇదేనని, జరిమానా అందుకు తగినట్లుగానే ఉందని ఎఫ్‌సీసీ ఛైర్మన్ తెలిపారు. స్ఫూఫింగ్, రోబో కాలింగ్‌కు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించేవారికి తమ నిర్ణయంతో గట్టి సందేశం వెళ్తుందని వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంత వరకు రోబో కాల్స్ రావడం ఎవరికీ ఇష్టం ఉండదన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








