మలేసియా: 92 ఏళ్ల వయసులో మాజీ ప్రధాని మహతిర్ రీఎంట్రీ విజయవంతం అవుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోనాథన్ హెడ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల మలేసియా ఎన్నికల ప్రచారంలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఒక మాలే బాలిక తన తాతయ్య వయసున్న వృద్ధుణ్ని కళ్లు విప్పార్చుకుని చూస్తోంది.
ఈ వీడియోలో ఉన్నది - మలేసియాను 22 ఏళ్ల పాటు పాలించి, తీర్చిదిద్దిన మాజీ ప్రధాని డాక్టర్ మహతిర్ మొహమద్.
డాక్టర్ మహతిర్ బుధవారం జరిగే ఎన్నికల్లో ప్రధాని నజీబ్ రజాక్‌కు సవాలు విసురడమే కాకుండా, గతంలో తన పార్టీ అయిన యునైటెడ్ మాలేస్ నేషనల్ ఆర్గనైజేషన్ (యూఎమ్‌ఎన్‌ఓ)కు వ్యతిరేకంగా రంగంలోకి దిగారు.
ఈ వీడియోలో మహతిర్ ''నేను చాలా వృద్ధుణ్నని నాకు తెలుసు. నాకు చాలా తక్కువ సమయం ఉంది. అయినా దేశ పునర్నిర్మాణం కోసం నేను మళ్లీ మీ ముందుకు రావాల్సి వచ్చింది. బహుశా అది నేను గతంలో చేసిన ఒక తప్పు వల్ల కావచ్చు'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆసక్తికర పోరు
మహతిర్ ఎన్నికల బరిలోకి దిగడం మలేసియా ఎన్నికలను ఆసక్తికరంగా మార్చేసింది. ఆయన రాకతో ప్రతిపక్ష పార్టీల కూటమి బలోపేతమైంది. 2015లో విపక్ష నేత అన్వర్ ఇబ్రహీం జైలుకు వెళ్లిన నాటి నుంచి అవి బలహీనమైపోయాయి.
ఒకానొక సమయంలో ఆయన మహతిర్ ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్నారు. అయితే 1997లో ఆగ్నేయాసియాలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి చేపట్టిన విధానాలను వ్యతిరేకించడంతో ఆయనను పదవి నుంచి తొలగించారు.
డాక్టర్ మహతిర్ అధికారంలో ఉన్న సమయంలో ఇబ్రహీం ఆయనకు గట్టి పోటీ ఇచ్చేవారు. సుమారు 18 ఏళ్ళ పాటు ఆయన మహతిర్ ప్రత్యర్థిగా ఉన్నారు.
అన్వర్ ఇబ్రహీంను డాక్టర్ మహతీరే 1998లో జైలుకు పంపారు. ఇబ్రహీం 2004లో జైలు నుంచి విడుదల కాగా.. 2013లో జరిగిన ఎన్నికల్లో గట్టి పోటీని ఇచ్చిన ఆయనను 2015లో మరోసారి అసహజ లైంగిక కార్యకలాపాల ఆరోపణలతో జైలుకు పంపారు. అయితే అన్వర్ ఇబ్రహీం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

ఫొటో సోర్స్, AFP
2013లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ మహతిర్, ఇబ్రహీంకు పరిపక్వత లేదని, దేశానికి నాయకత్వం వహించలేరని అన్నారు.
కానీ రెండేళ్ల క్రితం, ఇబ్రహీంతో చర్చల అనంతరం, 'ఆయన యవ్వనంలో అనేక తప్పులు చేశారు. వాటి కారణంగా చాలా శిక్షలు అనుభవించార'ని మాట మార్చారు.
ఇప్పుడు తిరిగి, ''ఇద్దరం కలిసి పని చేయడం చాలా ముఖ్యం. ప్రధాని నజీబ్‌ను అధికారం నుంచి తొలగించడానికి ఇద్దరం కలిసి పని చేస్తున్నాం'' అంటున్నారు.

ఫొటో సోర్స్, EPA
ఇటీవల మహతీర్ ఒక ప్రసంగంలో, ''నేను గతంలో చేసిన తప్పులకు మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. నా వల్లనే నజీబ్ తెర మీదకు రాగలిగాడు. ఇదే నేను చేసిన అతి పెద్ద తప్పు. ఆ తప్పును దిద్దుకోవాలనుకుంటున్నాను.'' అన్నారు.
ఇబ్రహీం కుటుంబం కూడా ఈ కూటమి చాలా అవసరం అని అభిప్రాయపడుతోంది. ఇబ్రహీం కూతురు నూరుల్ నూహా ఇది మలేసియా భవితవ్యానికి సంబంధించిన సమస్య అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఎన్నికల కమిషన్‌పై ఆరోపణలు
ఇటీవలే మలేసియా ఎన్నికల కమిషన్ ఆరుగురు అభ్యర్థులను సాంకేతిక కారణాలు చూపుతూ అనర్హులుగా ప్రకటించింది.
అంతే కాకుండా ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్‌ను కూడా దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈసారి ఎన్నికలను గతంలో మాదిరి శని, ఆదివారాల్లో కాకుండా, వారం మధ్యలో నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం నజీబ్ ప్రభుత్వంపై అవినీతి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే డాక్టర్ మహతిర్ అధికారాన్ని చేజిక్కించుకుని, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచి, నజీబ్ గుత్తాధిపత్యానికి గండి కొట్టాలనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








