యూట్యూబ్: ఆ వీడియోలపై ఫిర్యాదులు భారత్‌ నుంచే ఎక్కువ

యూట్యూబ్

ఫొటో సోర్స్, Reuters

2017 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తన సామాజిక మార్గదర్శకాలకు అనుగుణంగా లేని 83 లక్షల వీడియోలను తొలగించినట్టు యూట్యూబ్ వెల్లడించింది.

అందుకు సంబంధించిన నివేదికను తాజాగా విడుదల చేసింది.

కాపీ రైట్స్, న్యాయపరమైన కారణాలతో తొలగించిన వీడియోలను ఈ జాబితాలో పేర్కొనలేదు.

వీడియోలను తొలగించాలంటూ భారత్ నుంచే ఎక్కవ ఫిర్యాదులు వస్తున్నాయని యూట్యూబ్ తెలిపింది. తరువాతి స్థానంలో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.

అసభ్యకరంగా, లైంగిక చర్యలను స్పష్టంగా చూపించే వీడియోలను తొలగించాలంటూ వినియోగదారుల నుంచి 91 లక్షల ఫిర్యాదులు, ద్వేషపూరితమైన సమాచారంతో కూడిన వీడియోలపై మరో 47 లక్షల అభ్యంతరాలు వచ్చాయని ఆ సంస్థ పేర్కొంది.

రోజూ అప్‌లోడ్ అయ్యే ప్రతి వీడియోనూ యూట్యూబ్‌లోని అంతర్గత సాఫ్ట్‌వేర్ పరిశీలిస్తుంది. తన నిబంధనలకు అనుగుణంగా లేని వీడియోలను గుర్తించి పరిశీలకులకు(మోడరేటర్స్) తెలియజేస్తుంది.

అలా 2017 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తమ అల్గారిథమ్ 67 లక్షల వీడియోలను గుర్తించగా, వాటిని పరిశీలించి డిలీట్ చేసినట్టు యూట్యూబ్ తెలిపింది.

తొలగించిన వీడియోల "ఫింగర్‌ప్రింట్" డేటా తమ సర్వర్‌లో నిక్షిప్తమై ఉంటుందని, మళ్లీ ఆ వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినా వెంటనే తమకు తెలిసిపోతుందని బీబీసీకి వివరించింది.

'యూట్యూబ్ కిడ్స్' నుంచి ఎన్ని వీడియోలను తొలగించారన్న వివరాలను ఆ సంస్థ వెల్లడించలేదు.

వీడియోలపై ఫిర్యాదులు చేసిన టాప్ 10 దేశాలు

  • భారత్
  • అమెరికా
  • బ్రెజిల్
  • రష్యా
  • జర్మనీ
  • బ్రిటన్
  • మెక్సికో
  • టర్కీ
  • ఇండోనేసియా
  • సౌదీ అరేబియా

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.