ఇథియోపియా: కొత్త జెరూసలెం నిర్మించాలని.. శిలలను చర్చిలుగా చెక్కారు

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర ఇథియోపియాలోని లాలిబెలా.. ప్రాచీనకాలంనాటి అద్భుత చర్చిలకు నిలయం. 12వ శతాబ్దం నాటి ఈ చర్చిలను ఆనాటి రాజు లాలిబెలా ఆదేశాలతో కళాకారులు భారీ శిలలను తొలిచి సృష్టించారు.
అయితే, శిలలను చర్చిలుగా మార్చే కళ 500 ఏళ్ల కిందటే మరుగునపడిందని చాలా మంది అంటుంటారు. కానీ.. అది నిజం కాదు. ఇప్పటికీ ఇథియోపియాలో ఏకశిలా చర్చిలు తయారవుతున్నాయి.
ఇక్కడ ఉన్న సెయింట్ జార్జ్ చర్చి ఇథియోపియాలోని అత్యద్భుత వారసత్వ కట్టడాల్లో ఒకటి.
12వ శతాబ్దంలో రూపుదిద్దుకున్న 11 ఏకశిలా చర్చిలలో ఒకటి. ఈ పురాతన చర్చిల కారణంగానే.. ఈ ప్రాంతాన్ని ఇథియోపియా దేశీయ క్రైస్తవ కేంద్రమని అంటారు.
జెరూసలెం వెళ్లేందుకు అనుమతి లేని క్రైస్తవ పర్యాటకుల కోసం కొత్త జెరూసలెంను నిర్మించాలన్న అప్పటి రాజు లాలిబెలా ఆదేశాలతో ఈ చర్చి లను రూపొందించారు.
దాంతో ఇప్పటికీ అనేక మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.
అయితే.. బండరాళ్లను చర్చిలుగా మార్చే కళ 500 ఏళ్ల క్రితమే కనుమరుగైందని చాలా మంది విద్యావేత్తలు చెబుతుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ.. స్థానిక చర్చి నిర్వాహకుడు గెబ్రెమెస్కెల్ లాంటి డజన్ల కొద్ది మంది ఆ కళను సజీవంగా కొనసాగిస్తూనే ఉన్నారు.
గెబ్రెమెస్కెల్ మరో ముగ్గురితో కలిసి నాలుగేళ్లలో నాలుగు చర్చి లను రూపొందించారు.
"ఇది దేవుని కోరిక. క్రైస్తవ స్పూర్తితో ఈ పనిచేస్తున్నాం. ఈ డిజైన్ల కోసం ఎవరి నుంచీ ప్రణాళికలు.. సూచనలనూ తీసుకోలేదు" అని ప్రస్తుతం శిలలను తొలిచి చర్చిలుగా మార్చేస్తున్న శిల్పి గెబ్రెమెస్కెల్ టెస్సెమ అంటున్నారు.

ఈ కళాత్మక నిర్మాణాలపై దేశంలోని చరిత్రకారులతో కలిసి.. అమెరికా.. బ్రిటన్ దేశాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ బృందం 20 అధునాతన చర్చిలను కనుగొంది.
"ఇక్కడి చర్చిలకు వెళ్తున్నాం. వాటి నిర్మాణంలో పాలుపంచుకున్న శిల్పులతో మాట్లాడుతున్నాం. వారి వ్యక్తిగత అనుభవాలను తెలుసుకుంటున్నాం" అని టొరొంటో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మైకేల్ గెర్వెర్స్ తెలిపారు.
లాలిబెలా నేటికీ ఇథియోపియాలో ప్రముఖ యాత్రాస్థలంగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయ కళను సజీవంగా కాపాడుకుంటే... ఈ ఆకర్షణ కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









