ప్రెస్ రివ్యూ: ఒక వ్యక్తికి ఒకే బ్యాంకు ఖాతా! ఆర్బీఐ ఆలోచన

ఫొటో సోర్స్, Getty Images
"ఒక మనిషికి ఒకటే బ్యాంకు ఖాతా! ఇదీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న తాజా సంస్కరణ. ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి బ్యాంకులకు ఈ మేరకు సూత్రప్రాయంగా సమాచారం అందింది" అంటూ సాక్షి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
తొలి దశలో ఒక బ్యాంక్‌లో వేర్వేరు శాఖల్లో ఖాతాలుంటే అందులో ఒకదాన్నే కొనసాగించి.. మిగతావాటిని బ్యాంకులే రద్దు చేస్తాయని తెలిపింది.
కొన్ని బ్యాంకుల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని పేర్కొంది. మొబైల్ పోర్టబిలిటీ మాదిరిగానే బ్యాంకు ఖాతాల పోర్టబిలిటీని తీసుకొచ్చే యోచనలో భారతీయ రిజర్వ్ బ్యాంకు ఉందని సాక్షి వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
అమావాస్య పేరుతో అమానుషం
అమావాస్య రోజు బాలింత మృతి చెందిందని, మృతదేహం ఉంటే అరిష్టమనే మూఢ విశ్వాసంతో హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ గ్రామంలో అమానుషం జరిగింది. బాలింత మృతదేహాన్ని ఊరిలో ఉంచొద్దంటూ కాలనీవాసులు అడ్డుకున్నారు.
గ్రామంలోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్న మాలతి (30) కొన్ని రోజుల క్రితం ప్రసవం తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది 17న (శుక్రవారం) సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె.. మళ్లీ ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందారు.
అయితే, అమావాస్య రోజు బాలింత మృతి మంచిది కాదని, మృతదేహాన్ని వెంటనే అక్కడి నుంచి తరలించాలని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాంతో కుటుంబీకులు మృతదేహాన్ని సమీప చెరువు వద్ద బంధువుల చివరిచూపు నిమిత్తం ఉంచారు. అనంతరం ఆధిభట్ల ఠాణా ఎస్సై చొరవతో మృతదేహాన్ని మళ్లీ కాలనీకి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఈనాడు పత్రిక తెలిపింది.

ఫొటో సోర్స్, FACEBOOK
సీబీఐ మాజీ జేడీ లక్మీనారాయణ ఇంట్లో చోరీ
సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర ఏడీజీ వివి.లక్మీనారాయణ ఇంట్లో చోరీ జరిగింది. 30 తులాల బంగారు ఆభరణాల పెట్టె కనిపించడంలేదంటూ ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు-12 ఎమ్మెల్యే కాలనీలో లక్మీనారాయణ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఈనెల 16న ఆయన కుటుంబం ఓ శుభకార్యానికి హాజరు కావాల్సి ఉండగా.. ఇంట్లో దాచిన ఆభరణాలు కనిపించలేదు.
దాంతో లక్మీనారాయణ భార్య ఊర్మిళ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ఉద్యోగాల్లో వెనకబడుతున్న తెలుగోళ్లు
దేశవ్యాప్తంగా పోటీపడి ఐఐటీ సీట్లు, విదేశాల్లో ఐటీ కొలువులు సాధించడంలో గుత్తాధిపత్యం తెలుగు యువతదే. ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో మాత్రం తడబడుతున్నారు.
తెలుగు యువత కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురుచూస్తుంటే, ఉత్తరాది అభ్యర్థులు మాత్రం కేంద్ర ఉద్యోగాలను తన్నుకుపోతున్నారు.
కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లోని ఖాళీలను నింపటానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సీ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, ఐబీపీఎస్ వంటి సంస్థలు లక్షల పోస్టులను భర్తీ చేస్తున్నా, తెలుగు యువత దృష్టి పెట్టడంలేదంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









