యూఎన్ ఆంక్షల్ని ప్రతిసారీ ధిక్కరిస్తున్న ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, KCNA
శుక్రవారం ఉదయం ఉత్తర కొరియా మరోసారి జపాన్ దిశగా మిస్సైల్ ప్రయోగించింది. జపాన్ ప్రధాని షింజో అబే భారత పర్యటనలో ఉన్న సమయంలో ఉత్తర కొరియా ఈ చర్యకు పూనుకుంది.
ఇలాంటి ప్రమాదకరమైన, రెచ్చగొట్టే చర్యను తమ దేశం ఎన్నటికీ సహించదని షింజో అన్నారు. "ఉత్తర కొరియా ఇదే బాటలో నడిస్తే దాని భవిష్యత్తు దెబ్బతింటుంది" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
గత పదిహేను రోజుల్లో ఇలా జపాన్ మీదుగా క్షిపణిని ప్రయోగించడం ఇది రెండోసారి. అగస్టు 29న ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణి జపాన్ ఉత్తర ద్వీపమైన హొక్కైడో మీదుగా ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది.
ఈ మిస్సైల్ దాదాపు 770 కి.మీ. ఎత్తుకు వెళ్లిందనీ, దాదాపు 3,700 కి.మీ. దూరం ప్రయాణించిందనీ దక్షిణ కొరియా సైన్యం చెబుతోంది. స్థానిక సమయం ప్రకారం ఉదయం 6.57 గంటలకు ఈ మిస్సైల్‌ను పరీక్షించినట్టు జపాన్‌కు చెందిన ఎన్‌హెచ్‌కే టీవీ రిపోర్టును ఉటంకిస్తూ రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా చైనా, రష్యాలు ప్రత్యక్ష చర్యలు చేపట్టాలని అమెరికా రక్షణ మంత్రి రెక్స్ టిల్లర్‌సన్ డిమాండ్ చేశారు.
గత పరీక్షలతో పోల్చినపుడు ఈ మిస్సైల్ చాలా ఎక్కువ దూరం ప్రయాణించిందని టోక్యోలోని బీబీసి ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
ఆంక్షలు విధించినా ఆగడం లేదు..
సరిగ్గా నాలుగు రోజుల క్రితం, ఆగస్టు 11న ఐక్యరాజ్య సమితి ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముడి చమురు సహా ఇతర చమురు ఉత్పత్తుల దిగుమతులపై పరిమితులు, టెక్స్‌టైల్స్ ఎగుమతులపై నిషేధం, విదేశాలలో పని చేసే ఉత్తర కొరియా కార్మికులకు వీసాల నిరాకణ ఈ ఆంక్షల్లో భాగంగా ఉన్నాయి.
ఆంక్షలు విధించిన ప్రతి సారీ ఉత్తర కొరియా మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. గతంలోనూ ఐక్యరాజ్య సమితి పలు మార్లు ఆంక్షలు విధించిన వివిధ సందర్భాల్లో ఉత్తర కొరియా ఇలాగే అణు పరీక్షల్ని నిర్వహించింది.
- 2016 నవంబర్ 30: ఉత్తర కొరియా చైనాకు విలువైన బొగ్గును ఎగుమతి చేస్తుంది. నూతన అమ్మకాల పరిమితుల విధానం కింద యూఎన్ ఈ ఎగుమతులను 60 శాతానికి కుదించింది. అట్లాగే రాగి, నికెల్, సిల్వర్, జింక్ సహా విగ్రహాల అమ్మకాలపై కూడా నిషేధం విధించింది.
- ఉత్తర కొరియా స్పందన: భారీ న్యూక్లియర్ వార్‌హెడ్‌ను మోసుకుపోగల బాలిస్టిక్ రాకెట్‌ను ఉత్తర కొరియా 2017 మే 14న ప్రయోగించింది. దీనిని నూతనంగా అభివృద్ధి చేశామని అది పేర్కొంది.
- 2017 జూన్ 2: నాలుగు సంస్థలపై, 14 మంది అధికారులపై యూఎన్ ప్రయాణ ఆంక్షలు విధించింది. ఆంక్షలు విధించిన వారిలో ఉత్తర కొరియా విదేశీ గూఢచర్య విభాగపు అధిపతి కూడా ఉన్నాడు.
- ఉత్తర కొరియా స్పందన: జులై 4న తమ తొలి ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతమైందని ఉత్తర కొరియా ప్రకటించింది.
- 2017 ఆగస్టు 6: బొగ్గు, ఖనిజాలు, ముడి పదార్థాల ఎగుమతులపై యూఎన్ ఆంక్షలు విధించింది. దీని వల్ల ఉత్తర కొరియా ఎగుమతి రంగానికి ఒక బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
- ఉత్తర కొరియా స్పందన: సెప్టెంబర్ 3న తాము హైడ్రోజెన్ బాంబును పరీక్షించామని ఉత్తర కొరియా ప్రకటించింది. దానిని లాంగ్ రేంజ్ మిస్సైల్ ద్వారా ప్రయోగించగలుగుతామని అది చెప్పింది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)








