కోవిడ్: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ.. ఈ రోజు రాత్రి నుంచి మే 1 ఉదయం వరకు అమలు

హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ రోజు(ఏప్రిల్ 20) నుంచి మే 1 వరకు ఇది అమలులో ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు ఉంటాయి.

కర్ఫ్యూ సమయంలో..

అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలి.

ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు, మందుల దుకాణాలు, అత్యవసర సేవలందించేవాటికి మినహాయింపు ఉంది.

నైట్ కర్ఫ్యూ ఆదేశాలు

ఫొటో సోర్స్, TelangaGovt

అత్యవసర సర్వీసులు ఏవంటే...

* ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా

* టెలికమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసులు

* ఈ-కామర్స్ డెలివరీ

* పెట్రోలు పంపులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, పెట్రోల్, గ్యాస్ అవుట్‌లెట్‌లు

* విద్యుదుత్పత్తి, పంపిణీ సంస్థలు..

* నీటి సరఫరా, పారిశుద్ధ్యం

* కోల్డ్ స్టోరేజ్, గోదాములు

* ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు

రాత్రి 9 తరువాత తిరగడానికి వీల్లేదు

నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న నేపథ్యంలో రాత్రి 9 గంటల తరువాత ఎవరూ బయట తిరగడానికి వీల్లేదని సీఎస్ సోమేశ్ కుమార్ తన ఆదేశాల్లో స్పష్టం చేశారు.

పైన పేర్కొన్న అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చేవారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బంది అత్యవసర విధుల్లో ఉంటే ఐడెంటిటీ కార్డులు చూపించి తిరిగే వెసులుబాటు ఉంది.

వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, ఆసుపత్రి సేవలు అందించేవారు కూడా ఐడెంటిటీ కార్డు చూపిస్తే కర్ఫ్యూ సమయంలో కూడా వెళ్లనిస్తారు.

గర్భిణి

ఫొటో సోర్స్, Getty Images

గర్భిణులు, రోగులకు..

గర్భిణులు, రోగులు వైద్య సహాయం కోసం వెళ్తున్నప్పుడు వారికి మినహాయింపు ఉంటుంది.

ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు వెళ్తున్నవారు కానీ, అక్కడి నుంచి వస్తున్నవారు కానీ టికెట్లు చూపించాల్సి ఉంటుంది.

కేసులు పెరుగుతుండడంతో..

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు, నగరాల్లో ఇప్పటిక కట్టుదిట్టమైన ఆంక్షలు అమలవుతున్నాయి.

దిల్లీలో వారం రోజుల లాక్‌డౌన్ అమలవుతోంది. రాజస్థాన్ రాష్ట్రంలో రెండు వారాల లాక్ డౌన్ అమలవుతోంది.

తెలంగాణలోనూ గత కొద్ది రోజులుగా కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుంది.

సోమవారం ఒక్క రోజే తెలంగాణలో 5,926 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 793 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు.

తెలంగాణ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

హైకోర్టు ఆగ్రహం తరువాత..

మరోవైపు తెలంగాణ హైకోర్టు కూడా ప్రభుత్వంపై సోమవారం అసహనం వ్యక్తంచేసింది. కోవిడ్ నియంత్రణలో ఉదాసీనంగా ఉంటున్నారని.. బార్‌లు, సినిమా హాళ్లలో రద్దీని ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నించింది.

మద్యం ఆదాయంపై ఉన్న శ్రద్ధపై ప్రజల ప్రాణాలపై లేదా అని ప్రశ్నించింది.

రాత్రి కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్‌డౌన్ వంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.. 48 గంటల్లో చర్యలు ప్రారంభించండి అని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)