ఇండియా లాక్‌డౌన్‌: నరేంద్ర మోదీ ముఖ్యమైన శాఖలను అడగకుండానే లాక్‌డౌన్ విధించారా? – బీబీసీ ఎక్స్‌క్లూజివ్

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుగల్ పురోహిత్, అర్జున్ పర్మార్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

"దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి వస్తుంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం పూర్తిగా నిషిద్ధం. రానున్న 21 రోజులు ఇల్లు దాటి బయటకు వెళ్లడం అంటే ఏంటో మీరు మర్చిపోవాలి"

ఈ మాటలు మీకు గుర్తున్నాయా?

2020 మార్చి 24 రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటిస్తూ చెప్పిన మాటలు ఇవి.

కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్ విధిస్తున్నామని ఆయన చెప్పారు.

ఆ రోజు వరకు దేశంలో మొత్తం 519 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. తొమ్మిది మంది ఆ వ్యాధితో మరణించారు.

అయితే, ఇక్కడ మరొక విషయం కూడా ఉంది.

కరోనా వ్యాప్తిని నియంత్రించే దిశలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తోందని, నిపుణుల సలహాలను పాటిస్తోందని కూడా ప్రధాని తన ప్రసంగంలో చెప్పారు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

అప్పటికి రెండున్నర నెలల నుంచి కోవిడ్ వ్యాప్తి, వ్యాధి నిరోధక చర్యల గురించి కేంద్ర ప్రభుత్వం అందరితోనూ చర్చిస్తోందని చెబుతూ వచ్చింది.

"ప్రధానమంత్రే స్వయంగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారని" కూడా చెప్పారు.

అయితే, లాక్‌డౌన్ విషయంలో కరోనా సంక్షోభ సమయంలో నేరుగా వివిధ బాధ్యతలు నిర్వర్తించిన కేంద్రంలోని కీలక ప్రభుత్వ శాఖలను, విభాగాలను, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని మేం కొన్ని ప్రశ్నలు అడిగాం.

దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తున్న విషయం ముందుగానే తెలుసా? అందుకు సన్నద్ధంగా చేపట్టాల్సిన చర్యలు, పాత్ర గురించి ఏమైనా సమాచారం అందిందా? అని ఆరా తీశాం.

బీబీసీ చేపట్టిన ఈ విస్తృత పరిశీలనలో అలా జరిగినట్లు పెద్దగా ఆధారాలు లభించలేదు.

2021 మార్చి 1న ప్రభుత్వ వాదనను తెలుసుకునేందుకు మేం కేంద్ర సమాచార, ప్రసార శాఖను సంప్రదించాం. కానీ, ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ గానీ, కార్యదర్శి అమిత్ ఖరే గానీ మాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ముందుకు రాలేదు.

ఇక కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు ముఖ్యంగా ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వ్యవహారాలను చూసే విభాగాల సంగతి చూద్దాం.

చాలా శాఖలు తమకు దేశవ్యాప్త లాక్‌డౌన్ గురించి ముందస్తు సమాచారమేమీ లేదని, ఈ విషయంలో తమను ఎవరూ సంప్రదించలేదని అధికారికంగానే చెప్పాయి.

మరి భారత ప్రభుత్వం ఒక్కసారిగా అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది?

అసలు దాని గురించి సమాచారమేమీ లేకుండా పౌరులకు కీలక ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఎలా సాయపడగలవు?

లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన ఇండోర్ రోడ్లు

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన ఇండోర్ రోడ్లు

ఇదంతా ఎప్పుడు ప్రారంభమైంది?

లాక్‌డౌన్‌కు రెండున్నర నెలల ముందు అంటే 2020 జనవరి మధ్య నుంచి కరోనా వ్యాప్తిని పరిశీలిస్తూ, దాన్ని అరికట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రాక కోసం ఘనమైన ఏర్పాట్లు చేస్తున్న సమయంలో, 22వ తేదీన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఒక ప్రకటన చేశారు.

"సమర్థంగా పనిచేస్తున్న భారత ఆరోగ్య వ్యవస్థ కరోనావైరస్‌ను దేశంలోకి రాకుండా అడ్డుకోగలిగింది" అని డాక్టర్ హర్ష్ వర్ధన్ చెప్పారు.

కానీ, ఆ తర్వాత కేసులు పెరుగుతూ పోయాయి.

‘‘కరోనా వ్యాప్తిని తట్టుకునేందుకు తగినన్ని ఐసోలేషన్ బెడ్‌లు ఏర్పాటు చేశాం. పీపీఈ కిట్లు, ఎన్95 మాస్క్‌లను కూడా సమకూర్చుకున్నాం’’ అని మార్చి 5న ఆయన పార్లమెంటులో చెప్పారు.

కానీ, మూడు వారాలలోపే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు.

ప్రధాని లాక్‌డౌన్ ప్రకటన చేయకముందే "30కు పైగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పూర్తి లాక్‌డౌన్ విధించాయని" చెబుతూ భారత ప్రభుత్వం తమ చర్యలను సమర్థించుకుంది.

అయితే, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పలేదంటే.. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు పరిస్థితిని బట్టి, వైరస్‌ను ఎదుర్కొనేందుకు వారి సన్నద్ధతను బట్టి లాక్‌డౌన్ విధించాయి. చాలా రాష్ట్రాల్లో 2020 మార్చి 31 వరకే లాక్‌డౌన్ ప్రకటించారు.

కానీ, ప్రధానమంత్రి మొదట మూడు వారాల పూర్తి లాక్‌డౌన్ ప్రకటించారు.

జనతా కర్ఫ్యూ రోజున దిల్లీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జనతా కర్ఫ్యూ రోజున దిల్లీ

అంతర్జాతీయ స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది?

భారత్ లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలోనే, కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ లాంటి యురోపియన్ దేశాలు లాక్‌డౌన్ ప్రకటించలేదు. కానీ కఠినమైన నిబంధనలు, ఆంక్షలు విధించాయి.

చైనాలో హుబీ ప్రాంత్రంలో మాత్రమే లాక్‌డౌన్ విధించారు. అప్పటికే చైనాలో 80,000 కోవిడ్ కేసులు, 3,000 మరణాలు నమోదయ్యాయి.

లాక్‌డౌన్ ప్రకటన ఎలా జరిగింది?

మార్చి 24న లాక్‌డౌన్ గురించి దేశానికి తెలియజేయడం ప్రధాని మోదీ వంతు అయితే, దీని గురించి ప్రభుత్వ రికార్డులలో నమోదు చేయడం (ఆర్డర్ నంబర్ 1-29/2020-పీపీ (పీటీ ఈఈ)) జాతీయ విపత్తు నిర్వహణ శాఖ (ఎన్‌డీఎంఏ) వంతు.

ఎన్‌డీఎంఏ ఛైర్‌పర్సన్ ప్రధానమంత్రే అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఎన్‌డీఎంఏ పాలసీ, ప్రణాళిక విభాగం మార్చి 24న జారీ చేసిన ఆదేశాల్లో.. "దేశవ్యాప్తంగా వివిధ చర్యలు చేపట్టడంలో నిలకడ, స్థిరత్వం అవసరం. కోవిడ్ వ్యాప్తిని అరికట్టే దిశలో భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేయాలని ఎన్‌డీఎంఏ నిర్ణయించింది" అని తెలిపారు.

అదే రోజు దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా విడుదల చేశారు.

లాక్ డౌన్

మేం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ)ను సంప్రదించాం.

లాక్‌డౌన్ గురించి ఆదేశాలు జారీ చేసే ముందు ఎన్‌డీఎంఏ సంప్రదించిన అన్ని ప్రభుత్వ/ప్రైవేటు రంగ సంస్థల, నిపుణుల జాబితాను పరిశీలించేందుకు ప్రయత్నించాం.

2020 మార్చి 24కు ముందు కరోనా వ్యాప్తి గురించి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఎన్‌డీఎంఏ ఎన్ని సమావేశాలు నిర్వహించిందో తెలుసుకునేందుకు ప్రయత్నించాం.

అలాంటి సమావేశాలు ఏమీ జరగలేదని ఎన్‌డీఎంఏ స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రధానమంత్రి హాజరైన సమావేశాలు ఏమీ లేవని తెలిపింది.

లాక్ డౌన్

ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఏం చెప్పింది?

కరోనా వ్యాప్తి, నివారణ చర్యలకు సంబంధించి ప్రధానమంత్రి హాజరైన సమావేశాల జాబితాను పీఎంఓ నుంచి సేకరించడానికి ప్రయత్నించాం.

లాక్‌డౌన్ నిర్ణయానికి సంబంధించి పీఎంఓ సంప్రదించిన మంత్రులు, ముఖ్యమంత్రులు, సలహాదారుల జాబితా సేకరించేందుకు ప్రయత్నించాం.

లాక్‌డౌన్

అయితే, రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ పీఎంఓ మాకు ఎలాంటి సమాచారమూ ఇవ్వలేదు.

ఒక దరఖాస్తును స్పష్టంగా లేదని, అస్తవ్యస్తంగా ఉందని పక్కనపెట్టారు.

రెండవది, సమాచార హక్కు చట్టం 2005లోని సెక్షన్ 7 (9)ని అనుసరించి సమాచారాన్ని ఇవ్వడం కుదరదని చెప్పారు.

ఈ సెక్షన్ చూపించి ప్రభుత్వం సమాచారం ఇవ్వలేనని చెప్పేందుకు అధికారాలు లేవని ప్రభుత్వ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ విభాగంలో పని చేసే అంజలి భరద్వాజ్ చెప్పారు.

"ఆ దరఖాస్తుకు సమాధానం చెప్పడం ద్వారా సంస్థ సమయం, వనరులు దుర్వినియోగం అవుతాయని అనుకున్నప్పుడు మాత్రమే సమాచారాన్ని మరో విధంగా అందించాలి. ఈ సెక్షన్ చూపించి సమాచారాన్ని ఇవ్వకపోవడం సమాచార హక్కును ధిక్కరించటమే" అని అన్నారు.

ఈ లాక్‌డౌన్ ప్రకటనకు నాలుగు రోజుల ముందు అంటే మార్చి 20, 2020న ప్రధానమంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు.

ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో లాక్‌డౌన్ గురించి ప్రస్తావనే లేదు.

అయితే, ఆ సమావేశంలో లాక్‌డౌన్ గురించి చర్చ జరిగిందా లేదా అనే అంశంపై మేం సమాచారాన్ని ఇవ్వమని కోరాం.

మా అభ్యర్థనను ప్రధాన మంత్రి కార్యాలయం... కేంద్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేసింది.

ఆ తరువాత దానిని కేంద్ర హోంశాఖకు బదిలీ చేశారు. చివరకు మమ్మల్ని ఆ మొదటి పత్రికా ప్రకటననే చూసుకోమని చెప్పారు.

లాక్‌డౌన్

ఈ నివేదికలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడుకోవడం చాలా కీలకమైన విషయం.

ముందుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేతృత్వంలో లాక్‌డౌన్ నిబంధనలను ప్రకటించారు.

లాక్‌డౌన్ నిర్ణయంలో వివిధ విభాగాలు పోషించిన పాత్ర గురించి మేం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు చాలా శాఖలు మా అభ్యర్థనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బదిలీ చేశాయి.

ఇందులో ప్రధానమంత్రి కార్యాలయం, రాష్ట్రపతి సచివాలయం, కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్ధిక మంత్రిత్వ శాఖలోని కొన్ని విభాగాలు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లాంటివి ఉన్నాయి.

లాక్‌డౌన్

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశాల గురించి మేం అడిగిన సమాచార హక్కు అభ్యర్థనను తిరస్కరించారు.

కారణం:

"మీ దరఖాస్తులో విధానపరమైన, ఆర్థికపరమైన ఆసక్తులు ఉన్నందున, విశ్వసనీయ సమాచార వివరాలను కోరినందువలన, సమాచార హక్కు చట్టం 2005లోని సెక్షన్ 8 (1) (ఏ) (ఇ)లను అనుసరించి ఈ సమాచారం ఇవ్వడానికి అనుమతి లేదు" అని రాత పూర్వకంగా తెలిపింది.

లాక్‌డౌన్

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి బదిలీ అయి వచ్చిన అభ్యర్థనలలో చాలా వాటికి ఇలాగే సమాధానాలు వచ్చాయి.

కొన్ని కేసులలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సదరు మంత్రిత్వ శాఖనే సమాధానం ఇవ్వమని చెబుతూ అభ్యర్థనను తిరిగి పంపించేసింది.

లాక్‌డౌన్

ఈ విషయం రాష్ట్రాలకు తెలుసా?

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ గురించి సమాచారం దిల్లీ లెఫ్టినెంట్ జనరల్‌కి కానీ, ముఖ్యమంత్రికి కానీ, ముఖ్య కార్యదర్శికి కానీ ముందస్తుగా తెలియదు.

లాక్‌డౌన్ గురించి ముందుగా రాష్ట్రాలను సంప్రదించినట్లు తెలియదని తెలంగాణ, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రి కార్యాలయాలు తెలిపాయి.

పంజాబ్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ల సెక్రటేరియట్‌లు కూడా ఈ సమాచారం తమకు తెలియదనే చెప్పాయి.

లాక్‌డౌన్

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం ప్రధానమంత్రి కార్యాలయాన్నే సంప్రదించమని చెబుతూ మాకు సమాధానమిచ్చింది.

లాక్‌డౌన్

క్యాబినెట్ అసలు లాక్‌డౌన్ గురించి చర్చించిందా?

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అత్యున్నత స్థాయిలో మంత్రులతో కూడిన బృందాన్ని (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఫిబ్రవరి 03, 2020న ప్రకటించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ బృందానికి నాయకత్వం వహించారు. బృందంలో సివిల్ ఏవియేషన్, విదేశీ వ్యవహారాలు, షిప్పింగ్, హోమ్ మంత్రిత్వ శాఖల మంత్రులు ఉన్నారు.

ఫిబ్రవరి 3న లాక్‌డౌన్ విధించేటప్పటికి ఈ బృందం చాలాసార్లు సమావేశమయింది.

విదేశాల నుంచి వచ్చే వాణిజ్య విమానాలను ఆపేయడం లాంటి ముఖ్యమైన ప్రకటనలను చేసింది.

అయితే, ఈ మంత్రుల బృందం లాక్ డౌన్‌ని సూచించిందా అనే విషయంపై గాని, దాని గురించి చర్చించిందా అనే విషయంపై గానీ సమాచారం ఉందా అని మేం క్యాబినెట్ సెక్రటేరియట్‌ని అడిగాం.

క్యాబినెట్‌కి, క్యాబినెట్ కమిటీలకు అవసరమైన కార్యదర్శక సహాయాన్నిసెక్రటేరియట్ అందిస్తుంది.

ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూస్తూ సహకారం అందిస్తుంది.

అలాంటి పరిస్థితుల్లో క్యాబినెట్ సెక్రటేరియట్ తప్పకుండా ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది.

లాక్‌డౌన్

కానీ, వారు మా అభ్యర్థనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు.

కొన్ని రోజుల్లోనే ఈ సమాచారం బహిర్గతం చేయడానికి వీలు లేదని చెబుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బదులిచ్చింది.

ఇదే అభ్యర్థనను మేం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కూడా పంపించాం. కానీ, దీనిపై ఆ శాఖ స్పందించలేదు.

లాక్‌డౌన్‌కి ముందు క్యాబినెట్ సెక్రటేరియట్ సమావేశమైనట్లు వారిచ్చిన సమాచారం చెబుతోంది.

కానీ, కరోనా వైరస్ మహమ్మారి గురించి, లాక్‌డౌన్ గురించి చర్చించారా లేదా అనే సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు.

‘లాక్‌డౌన్ ప్రకటిస్తారని మాకు ముందే తెలుసు’

కేంద్ర సమాచార, ప్రసార శాఖ స్పందించనప్పటికీ, లాక్‌డౌన్ గురించి నీతీ ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్‌ మాతో మాట్లాడారు.

"లాక్‌డౌన్ అనుకోకుండా జరిగిందని నేను భావించట్లేదు. భారత్‌లాంటి దేశానికి ఇలాంటిది అవసరం. మాతో చర్చించిన తరువాతే లాక్‌డౌన్ ప్రకటించారు. ఇది అకస్మాత్తుగా జరిగిందని అనుకోవడం తప్పు. ప్రధాని అందరితోనూ మాట్లాడారు" అని ఆయన తెలిపారు.

‘‘జనవరిలో దేశంలో కరోనావైరస్ కేసులు బయటపడటం మొదలయితే, మార్చి ఆఖరి వారంలో లాక్‌డౌన్ ప్రకటించారు. అదేమీ ఒక వరదలానో, భూకంపంలానో రాత్రికి రాత్రే రాలేదు. అందరినీ సంప్రదించి అన్ని విభాగాలు సంసిద్ధంగా ఉన్న తర్వాతే లాక్‌డౌన్ ప్రకటించి ఉంటారని భావిస్తున్నాం’’ అని ఎన్‌డీఎంఏ, హోం మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన ఆర్‌టీఐ సమాధానాలను విశ్లేషిస్తూ ప్రభుత్వ ట్రాన్సపరెన్సీ అండ్ అకౌంటబిలిటీ విభాగంలో పని చేసే అంజలి భరద్వాజ్ చెప్పారు.

‘‘ఆర్‌టీఐ అభ్యర్థనలను తిరస్కరించిన విధానం, ఇచ్చిన సమాధానాలు ఆమోదయోగ్యంగా లేవు. ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో దేశ ప్రజలతో పంచుకోకుండా ఉండాల్సిన రహస్యాలేముంటాయి?’’ అని ఆమె అన్నారు.

ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆమె వ్యాఖ్యానించారు.

రాష్ట్రాలకు కూడా ఈ విషయంపై సమాచారం లేదా అని అడిగినప్పుడు... “ఇలా సమాధానం చెప్పడం వల్ల వారికి ఏ ఉపయోగమూ ఉండదు. అందుకే రాష్ట్రాలు సులభంగా బాధ్యతల నుంచి తప్పించుకుని తమకు సమాచారం లేదని చెబుతాయి” అని అంజలి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)