కరోనావైరస్: దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం టెస్టుల్ని ఎందుకు తగ్గిస్తోంది? వైద్య వ్యవస్థ విఫలమైందా?

    • రచయిత, సింధువాసిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీలో మెరుగైన వైద్య వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఇదే విషయమై విమర్శలు ఎదుర్కొంటోంది.

జూన్ 3వ తేదీ బుధవారం ఒక్కరోజే దిల్లీలో 1,513 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దిల్లీలో ఒక రోజులో ఇంత భారీగా కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి.

గురువారం 1,359 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ప్రభుత్వ గణాంకాల ప్రకారం దిల్లీలో ఇప్పటివరకూ 25వేలకుపైగా కేసులు నమోదు కాగా, 650కుపైగా మంది మరణించారు.

కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య వెయ్యికి అటూఇటుగానే ఉంటోంది.

కేసుల సంఖ్య పరంగా దేశంలో మహారాష్ట్ర తర్వాతి స్థానం దిల్లీదే. రోజురోజుకీ ఇక్కడ పరిస్థితి ఇంకా తీవ్రమవుతోంది.

కొన్ని రోజుల క్రితం దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ... ‘‘లాక్‌డౌన్ తెరుచుకున్న తర్వాత దిల్లీ సరిహద్దులు కూడా తెరిస్తే, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి జనాలు వస్తారు. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చాలా మెరుగైన వసతులు అందుతాయి’’ అని అన్నారు.

‘‘సరిహద్దులు తెరవాలా? వద్దా అనే విషయాన్ని మీరే ఓటింగ్ ద్వారా చెప్పండి. దిల్లీలో ఆసుపత్రులు దిల్లీ ప్రజల కోసం రిజర్వ్ చేయాలా?’’ అంటూ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేస్తున్నట్లు చెప్పారు.

కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలపై చాలా విమర్శలు వస్తున్నాయి. సరిహద్దులు మూసివేయాలన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

సమానత్వం, జీవించే హక్కులకు ఆ నిర్ణయం విఘాతం కలిగిస్తుందని ఆ పిటిషన్ వేసిన కుశాగ్ర్ కుమార్ అనే న్యాయవాది అన్నారు.

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో రాకపోకల కోసం ఒకే పాస్ జారీ చేయాలని గురువారం సుప్రీం కోర్టు తమ ఆదేశాల్లో సూచించింది.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సరిహద్దుల మూసివేత గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

దిల్లీ వైద్య వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందా అనే అనుమానాలు కూడా ఇవి రేకెత్తించాయి.

పరీక్షలు తగ్గించాలని ఆదేశం

పరీక్షల సంఖ్యను తగ్గించాలని ప్రైవేటు ల్యాబులకు దిల్లీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. లక్షణాలు బయటపడనివాళ్ల విషయంలో దీన్ని మరింత ముఖ్యంగా పాటించాలని సూచించింది.

లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్నవారి పరీక్షలు చేయించుకుని, కోవిడ్-19 అని పాజిటివ్ తేలడంతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని ప్రభుత్వం అంటోంది.

ఇలాంటి వారు ఆసుపత్రుల్లో చేరితే, తీవ్ర లక్షణాలున్నవారికి చికిత్సలు అందించడంలో ఇబ్బందులు వస్తాయని చెబుతోంది.

ఆసుపత్రుల్లో కోవిడ్-19 లేనివారిని, ఉన్నవారిని విడివిడిగా ఉంచడం కోసం పరీక్షలు చేయడం తప్పనిసరని ప్రైవేటు ఆసుపత్రుల్లోని ల్యాబ్‌లో చెబుతున్నట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దినపత్రికలో ఓ కథనం వచ్చింది.

భారత్‌లో లక్షణాలు బయటపడనివారి సంఖ్య ఎక్కువగా ఉందని, వారికి కూడా పరీక్షలు చేయడం అవసరమేనని నిపుణులు అంటున్నారు.

‘‘లక్షణాలు బయటపడనివారు ‘రెండు వైపులా పదునున్న కత్తుల’ లాంటి వాళ్లు. తమకు తెలియకుండానే వాళ్లు కరోనావైరస్‌ను వ్యాప్తి చేసుకుంటూ పోతారు’’ అని సవాయి మాన్‌సింగ్ ఆసుపత్రి డాక్టర్ ఎమ్ఎస్ మీణా బీబీసీతో ఇదివరకు అన్నారు.

స్వల్ప లక్షణాలున్నవారు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండాలని దిల్లీ ప్రభుత్వం సూచిస్తోంది.

పరీక్షల సంఖ్యను తగ్గించాలని దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపైనా విమర్శలు వస్తున్నాయి.

కేసుల సంఖ్యను పెరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కేసుల సంఖ్యను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దాస్తోందని బీజేపీ, కాంగ్రెస్ విమర్శిస్తున్నాయి.

అంత్యక్రియలకూ ఇబ్బందులు

దిల్లీలోని లోక్‌నాయక్ ఆసుపత్రిలోని మార్చురీలో శవాల సంఖ్య పెరిగిపోవడంతో కింద నేలపై ఒకదాని తర్వాత ఒకటి పెట్టుుకుంటూ పోతున్నారని కొన్ని రోజుల క్రితం మీడియాలో కథనాలు వచ్చాయి.

కోవిడ్-19తో మరణించినవారికి ఐదు రోజుల తర్వాత కూడా అంత్యక్రియలు చేసే పరిస్థితి లేదని, శ్మశానాల నుంచి శవాలను తిప్పి పంపుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.

దిల్లీ హైకోర్టు తమకు తాముగా ఈ విషయంపై దృష్టి సారించి, ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

అంత్యక్రియలకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం తన మార్గదర్శకాలను తానే పాటించలేకపోతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

కోవిడ్-19 మరణాలు ఒక్కసారిగా పెరగడం వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నట్లు దిల్లీ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం కరోనావైరస్ సోకి మరణించినవారి అంత్యక్రియలు 24 గంటల్లోగా పూర్తి చేయాలి.

వైద్యులు ఏం చేస్తున్నారు?

దిల్లీ వైద్య వ్యవస్థ మెరుగ్గానే ఉందని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని కమ్యునిటీ మెడిసిన్ చీఫ్, కోవిడ్-19 నోడల్ అధికారి డాక్టర్ జుగల్ కిశోర్ అన్నారు.

‘‘మిగతా ప్రాంతాలతో పోల్చితే, దిల్లీలో వైద్య వసతులు మెరుగ్గా ఉన్నాయి. కానీ, ఇక్కడ నిర్వహణ, సమన్వయ లోపాలు ఉన్నాయి. దిల్లీ ప్రభుత్వ ఆసుపత్రులున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఎన్‌డీఎమ్‌సీవి ఉన్నాయి. వీటన్నింటి మధ్య సమన్వయం కొరవడింది’’ అని ఆయన అన్నారు.

లక్షణాలు లేనివారికి పరీక్షలు చేయకూడదన్న దిల్లీ ప్రభుత్వ విధానంతో డాక్టర్ జుగల్ విభేదించారు.

‘‘ఎపిడిమాలజికల్‌ కోణంలో చూస్తే దిల్లీ ప్రభుత్వం నిర్ణయం పూర్తిగా తప్పు. పరీక్షలు సరిగ్గా చేయకపోతే, కేసులు పెరుగుతున్న వేగం, కోలుకుంటున్న వేగంపై సరైన అంచనాలు రావు. వ్యాధిని అర్థం చేసుకోవడంలో, తగిన చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి’’ అని అన్నారు.

కేసుల సంఖ్యలో పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జుగల్ చెప్పారు.

‘‘భారత్ ఇంకా పీక్‌కి చాలా దూరంలో ఉంది. దిల్లీలో 30 నుంచి 40 శాతం మంది ఈ వ్యాధికి గురవుతారు. కేసుల సంఖ్య పెరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పాజిటివ్‌గా ఎక్కువ మంది మారితే రోగ నిరోధకత పెరిగేందుకు తోడ్పడుతుంది’’ అని చెప్పారు.

చికిత్స అవసరం లేని వాళ్లు ఆసుపత్రుల్లో చేరుతున్నారని అనుకుంటే ప్రభుత్వం నియమనిబంధనలు మార్చవచ్చని, పరీక్షలు వద్దనడం సరికాదని సర్ గంగారామ్ ఆసుపత్రిలోని సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ధీరేన్ గుప్తా అన్నారు.

‘‘పరీక్షలు చేసి జనాలను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచవచ్చు. అసలు పరీక్షలే చేయకుండా ఉంటే, బయటకు తెలియకుండా వాళ్లు వ్యాధి వ్యాప్తి చేస్తూ పోతారు’’ అని అన్నారు.

మెరుగైన వైద్య వసతులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చి గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, ఆ వైద్య వ్యవస్థ నిర్వహణలోనే విఫలమవుతోందని పబ్లిక్ హెల్త్ రీసెర్చర్ ఇనాయత్ సింగ్ కక్కర్ అన్నారు.

క్షేత్ర స్థాయిలో పనిచేసేవారి సూచనలను దిల్లీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తాము ప్రభుత్వానికి చాలా లేఖలు రాసినా స్పందన రాలేదని ఆమె అన్నారు.

‘‘దిల్లీ ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించడానికి ఎంత ప్రయాస పడాల్సి వస్తుందో నాకు అనుభవపూర్వకంగా తెలుసు. ప్రభుత్వ అధికారులతో పరిచయాలున్నవారికి పనులు జరుగుతున్నాయి. లేనివారు చాలా కష్టాలు పడాల్సి వస్తోంది’’ అని ఇనాయత్ సింగ్ కక్కర్ చెప్పారు.

తగినంత సామర్థ్యం లేదు: దిల్లీ ఆరోగ్య శాఖ డీజీ

ప్రజల్లో అనవసర ఆందోళనను తగ్గించేందుకే పరీక్షలను తక్కువ చేయాలని నిర్ణయించామని దిల్లీ ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ నూతన్ ముండేజా బీబీసీతో చెప్పారు.

‘‘మేం పరీక్షలు ఆపేయలేదు. తగ్గించాం. కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా ఆపలేదు. కోవిడ్-19 లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్నవారు ఆసుపత్రుల్లో చేరకుండా, హోం క్వారంటైన్‌లో ఉండేలా చేయడమే మా ఉద్దేశం’’ అని ఆయన అన్నారు.

‘‘కరోనావైరస్ పాజిటివ్‌గా తేలిన ప్రతి వ్యక్తీ ఆసుపత్రిలో చేరానుకుంటారు. అలాంటప్పుడు వ్యాధి తీవ్రంగా ఉన్నవారికి, కోవిడ్ కాకుండా ఇతర సమస్యలతో ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతాయి. అందరినీ చేర్చుకునేంత సామర్థ్యం మనకు లేదు. దిల్లీలో ఉన్న రెండు కోట్ల మందికి పరీక్షలు చేసే సామర్థ్యం కూడా లేదు’’ అని అన్నారు.

ప్రైవేటు ల్యాబులు, ఆసుపత్రులకు పరీక్షల నిర్వహణ సంపాదన మార్గం తప్ప మరోటి కాదని వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)