కరోనా లాక్‌డౌన్: కష్టకాలంలో యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ వ్యాపారం చేసి లాభాలు పొందిన రైతులు, మత్స్యకారులు

    • రచయిత, జస్టిన్ హార్పర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో మలేసియాలోని కామెరూన్ పర్వతప్రాంతాల్లోని రైతులు టన్నులకొద్దీ తాజా కూరగాయలను పారబోయాల్సిన పరిస్థితి ఎదుర్కున్నారు.

వైరస్ వ్యాపించకుండా సామాజిక నిబంధనలు విధించడంతో మాంసం, కూరగాయలు అమ్మే మార్కెట్లన్నీ మూసేశారు.

దీంతో తమ వినియోగదారుల కోసం మొదటిసారి ఆన్‌లైన్‌లో అడుగుపెట్టిన వారిని, ఇప్పుడు ఈ కామర్స్ కష్టాల నుంచి గట్టెక్కించింది.

ఆగ్నేయాసియాలో అమ్మకాలకు కొత్త మార్గాన్ని ఎంచుకున్న రైతులు, మత్స్యకారులు అందరి కథ ఇంచుమించు ఇలాగే ఉంటుంది.

కరోనా వ్యాప్తితో మలేషియాలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దానిని మూమెంట్ కంట్రోల్ ఆర్డర్(ఎంసీఓ) అంటున్నారు. మార్చి నుంచి మొదలైన దీనిని తాజాగా జూన్ 9 వరకూ పొడిగించారు.

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌కు ఉత్తరంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామెరూన్ పర్వతప్రాంతాల్లో డియోనెస్ తోటల యజమాని స్టీవ్ టియో పూలు, మొక్కజొన్న విక్రయిస్తారు.

“మూమెంట్ కంట్రోల్ ఆర్డర్ ఇవ్వగానే, రాత్రికిరాత్రే ఫ్లోరిస్ట్ షాపులన్నీ మూతబడ్డాయి. డిమాండు లేకపోవడంతో సాగుచేసిన పూలన్నీ పారబోయాలేమో అనుకున్నా” అన్నారు.

అదృష్టవశాత్తూ సింగపూర్‌లో ఉన్న లజాడా అనే ఒక ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫాం టియోకు కొత్త మార్గం చూపింది. ఆన్‌లైన్‌లో ఉన్న ఫ్లోరిస్టులతో ఆయన్ను అనుసంధానం చేసిన సంస్థ టియోకు కొత్త వినియోగదారులను పరిచయం చేసింది.

మలేసియాలో ఇలాంటి సమస్యలే ఎదుర్కున్న మరికొందరు రైతులకు కూడా ఈ సంస్థ ఇలాంటి సాయమే చేసింది. లాక్‌డౌన్ సమయంలో మార్కెట్లలో అమ్మకాలు లేక పేరుకుపోయిన తాజా కూరగాయలు, పండ్లు వారు ఆన్‌లైన్లో అమ్ముకునేలా చేసింది. లజాడా లెక్కల ప్రకారం లాక్‌డౌన్ మొదటి వారాంతంలో ఆన్‌లైన్లో 1.5 టన్నులకు పైగా కూరగాయలు అమ్ముడయ్యాయి.

“ఆన్‌లైన్ చానల్ లేకుంటే, నేను బహుశా నా పూలన్నీ పారబోసేవాడిని” అని టియో చెప్పారు.

ప్రాధాన్యతల నుంచి కొత్త అవకాశాలు

మలేసియాలో తాజా చేపలు, ఇతర సముద్ర జీవులు అమ్మే మై ఫిష్‌మాన్ డెలివరీ సంస్థ యజమాని ఆండ్రీ గూ కూడా ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలో చేరక ముందు వాటిని మార్కెట్లో అమ్మడానికి, ఖాతాదారులకు డెలివరీ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారు.

“కోవిడ్-19 వల్ల మా వ్యాపారంపై కచ్చితంగా ప్రభావం పడింది. మేం రెస్టారెంట్లకు, హోల్‌సేల్ చేపల మార్కెట్లకు, గ్రాసరీ దుకాణాలకు, కాఫీ షాపులకు వాటిని సరఫరా చేయలేకపోయాం. వాటిని చాలావరకూ మూసివేశారు. కానీ ఆన్‌లైన్‌లో అమ్మడం వల్ల మేం ఇప్పటికీ ఆ వ్యాపారంలో నిలదొక్కుకోగలిగాం” అని ఆమె చెప్పారు.

ఎంసీఓ సమయంలో చాలామంది తమ ఇళ్లలో ఆహారం నిల్వ చేసుకోవడంతో మై ఫిష్‌మాన్ అమ్మకాలు మొదటి రెండు వారాల్లో దాదాపు 150 శాతం పెరిగాయి.

ఆగ్నేయాసియా అంతటా జనవరి మధ్య నుంచి మే మధ్య వరకూ తాజా ఉత్పత్తుల ఆర్డర్లు రెట్టింపుకంటే ఎక్కువే వచ్చాయని లజాడా చెప్పింది.

“వినియోగదారుల ప్రాధాన్యతల నుంచి ఉత్పన్నమయ్యే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోడానికి వ్యవసాయ రంగంతోపాటూ, అన్ని పరిశ్రమలు, వ్యాపారాలు ఆన్‌లైన్ వైపు మళ్లుతున్నాయి” అని లాజడా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పియెర్రె పొయగ్నంట్ చెప్పారు.

కరోనా కాలం, సవాలు సమయం

ఇండోనేషియాలోని 89 గ్రామాలకు చెందిన 2500 మంది రైతులు, తమ తాజా ఉత్పత్తులు అమ్ముకోడానికి సాయం చేసేందుకు వ్యవసాయ సహకార సంస్థ రుమా సయూర్ గ్రూప్ ఆన్‌లైన్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు ఈ గ్రూప్ వాటిని నేరుగా జకర్తా ప్రాంతంలో ఉన్న సూపర్ మార్కెట్లకు, హోటళ్లకు, రెస్టారెంట్లకు, కెఫేలకు విక్రయించేది.

కానీ, మహమ్మారి వ్యాపించడంతో ఈ గ్రూప్ అమ్మకాలు 60 శాతానికి పైగా పడిపోయాయి. దాంతో అది ఈ-కామర్స్ వైపు మళ్లింది.

పాక్ ఒపిక్ అనే ఒక ఇండోనేషియా రైతు పర్పుల్ కాబేజీలు, జపనీస్ దోసకాయలు లాంటి విదేశీ వంగడాలు పండించేవారు. వాటిని జకార్తాలోని సంప్రదాయ మార్కెట్లలో, వెస్ట్ జావా నగరం బాండంగ్‌లో అమ్మేవారు.

“కరోనా వల్ల ప్రస్తుతం మాలాంటి రైతులు ఇంతకు ముందులా సంప్రదాయ మార్కెట్లలో ఉత్పత్తులు అమ్ముకోవడం పెను సవాలుగా మారింది. కానీ, గ్రూప్ ఈ-కామర్స్ భాగస్వామ్యం ద్వారా మా పంట ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడూ కొనుగోలు చేసే మార్కెట్లకు వెళ్లలేకపోతున్నవారి దగ్గరకు చేరుతోంది” అన్నారు.

థాయ్‌లాండ్‌లో తమ పండ్లను ఎగుమతి చేసే రైతులు స్థానికంగా ఉండే కొత్త కొనుగోలుదారులను కనుగొనడానికి లజాడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. దేశంలో జూన్‌లో జరిగే గోల్డెన్ ఫ్రూట్ మంత్ ప్రచార సమయంలో 50 మంది పండ్ల అమ్మకం దారులను ఆన్‌లైన్లోకి తీసుకురావాలని థాయ్ ప్రభుత్వం, లజాడా చూస్తున్నాయి.

చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు కనెక్ట్ కావడానికి 4 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న తన ఫుడీ లైవ్ స్ట్రీమ్ చానల్‌తోపాటూ టావ్‌బావ్ లైవ్ ప్లాట్‌ఫాం కూడా తెరిచింది. జాక్ మా స్థాపించిన ఈ సంస్థ లైవ్‌స్ట్రీమింగ్ ఇచ్చిన మొదటి మూడు రోజుల్లో కోటీ 50 లక్షల ఉత్పత్తులు అమ్మినట్లు చెప్పింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)