కరోనావైరస్ కేసులు: టాప్‌ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?

    • రచయిత, సరోజ్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్-19 కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ పదో స్థానంలో ఉంది.

జులై వరకూ భారత్‌లో కోవిడ్-19 కేసులు కొన్ని లక్షల సంఖ్యలో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం భారత్‌లో ఇప్పటివరకూ 1.38 లక్షలకుపైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

కేసులు అత్యధికంగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ ఉన్నాయి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో ఇప్పటివరకూ కరోనావైరస్ కారణంగా 4,024 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి 13 రోజులకూ కేసులు రెట్టింపవుతున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలను కూడా ప్రభుత్వం ఇప్పుడు సడలించడం మొదలుపెట్టింది.

‘‘ఇప్పుడైతే కేసులు పెరుగుతున్నాయి. పీక్ వస్తుంది. కానీ, అది ఎప్పుడు వస్తుందనేది మెడికల్ డేటాపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది నిపుణులు దీనిపై డేటా మోడలింగ్ చేశారు. వారిలో భారత నిపుణులు ఉన్నారు. విదేశీ నిపుణులు ఉన్నారు. ఎక్కువ మంది జూన్-జులైలో పీక్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టులోనూ వచ్చే అవకాశం ఉందని కూడా కొందరు లెక్కగట్టారు’’ అని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులెరియా ఇదివరకు చెప్పారు.

మోడలింగ్ డేటా ఏం చెబుతోంది?

భారత్‌లో కేసుల పెరుగుదల రేటు ఇంకా తగ్గలేదని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లోని బయోస్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.

జులై ఆరంభానికల్లా 6.3 లక్షల నుంచి 21 లక్షల వరకూ భారత్‌లో కేసులు ఉండొచ్చని ముఖర్జీ బృందం అంచనా వేసింది.

మొదటి స్థానంలో మహారాష్ట్ర

ప్రస్తుతం భారత్‌లో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 20 శాతం ముంబయి నగరంలోనే నమోదవుతున్నాయి.

మహారాష్ట్రలో కోవిడ్-19 రోగుల సంఖ్య 50 వేలు దాటింది. దేశంలోని కేసుల్లో మూడింట ఒక వంతు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. అక్కడి ఆసుపత్రుల్లో కోవిడ్-19 రోగులకు పడకలు చాలడం లేదు. వైద్యుల కొరత కూడా ఉంది.

మహారాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే ఈ విషయాన్ని అంగీకరిస్తోంది. తమ రాష్ట్రానికి వైద్యుల బృందాన్ని పంపించాలని కేరళ ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించింది.

మహారాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నోడల్ ఆఫీసర్ టీపీ లహాణే కేరళ ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు. 50 మంది స్పెషలిస్టు డాక్టర్లను, 100 మంది నర్సులను పంపించాలని అందులో కోరారు.

కేరళ ఇందుకు అంగీకరించిందో, లేదో ఇంకా తెలియరాలేదు.

ప్రస్తుతం ఒక్క ముంబయిలోనే 30 వేల మంది కోవిడ్-19 రోగులున్నారు.

కరోనావైరస్ సోకినవారిలో సుమారు 15 శాతం మందికి ఐసీయూలో వైద్యం అందించడం అవసరమవుతుందని, దాదాపు 5 శాతం మందికి వెంటిలేటర్‌పై చికిత్స అవసరమవుతుందని ప్రభుత్వం అంటోంది. ఈ లెక్కన ముంబయిలో 4,500 మందికి ఐసీయూ, 1500 మందికి వెంటిలేటర్లు అవసరం.

ముంబయి నగరపాలిక గణాంకాల ప్రకారం వారి వద్ద దాదాపు 2000 ఐసీయూ పడకలు ఉన్నాయి. వెంటిలేటర్లు, ఆక్సీజన్ సదుపాయం ఉన్న పడకలు కూడా దాదాపు ఇంతే ఉన్నాయి.

తాత్కాలిక ఆసుపత్రులను నిర్మించేందుకు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐసీయూ వసతులను పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే, కేసులు పెరుగుతున్న రేటుకు తగ్గ వేగంతో ఈ చర్యలు ఉండటం లేదు.

విమానాలు, రైళ్ల రాకపోకలతో మహారాష్ట్రలో రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య ఇంకా పెరగొచ్చు.

దిల్లీలో పరిస్థితి

దిల్లీలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రస్తుతం అక్కడ కోవిడ్-19 కేసుల సంఖ్య సుమారు 13 వేలు. కేసుల సంఖ్యపరంగా చూసుకుంటే దిల్లీది నాలుగో స్థానం. గత వారం కేసుల సంఖ్య చాలా వేగంగా పెరిగింది.

50 దాటి పడకలున్న ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్‌లో 20 శాతం పడకలను కోవిడ్-19 రోగులకు రిజర్వ్ చేయాలని ఆదివారం సాయంత్రం దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దిల్లీలో అలాంటి ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ 117 ఉన్నాయి.

ప్రైవేటు ఆసుపత్రుల్లో సుమారు 700 కోవిడ్-19 పడకలు ఉన్నాయని, వాటిలో 530 భర్తీ అయ్యాయని దిల్లీ డైలాగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ జాస్మిన్ షా బీబీసీతో చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మొత్తం పడకల్లో సగం మాత్రమే కోవిడ్-19 రోగులతో భర్తీ అయ్యాయి.

కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల వేగంగా ఉంటే ఏం చేయాలనే విషయమై ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు ఐదుగురు వైద్యులతో కూడిన ఓ బృందాన్ని మార్చి ఆఖరి వారంలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నియమించారు.

రోజూ వెయ్యి కేసులు నమోదైతే ఏం చేయాలనేదానిపై ఆ బృందం సలహాలు, సూచనలు చేసింది. గత ఆరు రోజులుగా దిల్లీలో రోజూ 500కుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఒక రోజు ఈ సంఖ్య 600 కూడా దాటింది.

ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కోవిడ్-19పై వ్యూహాన్ని మార్చుకుని, మరింత మెరుగైన చర్యలు, ఏర్పాట్లు చేపట్టాల్సిన అవసరం ఉంది.

కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది...

కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కొరత ఉంది. కోవిడ్-19 రోగులను ఆసుపత్రిలో చేర్చేందుకు వారి బంధువులు కొన్ని ప్రాంతాలు తిరగాల్సి వస్తున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి.

పెరుగుతున్న రోగుల విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనే విషయంపై భారత ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏమీ చెప్పలేదని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

కరోనావైరస్ రోగులందరూ ఆసుపత్రుల్లో చేరడం అవసరం లేదని, ఆసుపత్రుల్లో పడకల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం మీడియా సమావేశంలో చెప్పింది. హోం ఐసోలేషన్‌కు సంబంధించి నియమనిబంధనలను కూడా సూచించింది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో ఇప్పుడు దాదాపు 7.14 లక్షల ఆసుపత్రి పడకలు ఉన్నాయి. 2009లో పడకల సంఖ్య 5.4 లక్షలు.

నాలుగు లాక్‌డౌన్‌ల ప్రభావం

దేశంలో మొదటి విడత లౌక్‌డౌన్ విధించినప్పుడు అందరూ దాన్ని స్వాగతించారు. దాని ద్వారా లభించే సమయం కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకునేందుకు సరిపోతుందని అప్పుడు నిపుణులు అభిప్రాయపడ్డారు.

కానీ, కేసులు వేగంగా పెరుగుతూ పోయాయి. దీంతో ఏర్పాట్లు ఇప్పటికీ తగిన స్థాయిలో లేవు.

భారత్‌లో కోవిడ్-19 కేసులు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ ఓ పరిశోధన పత్రం రాశారు.

సస్పెక్టెబుల్ ఇన్ఫెక్టెడ్ రివకర్డ్ మోడల్ (ఎస్ఐఆర్) డేటా ఆధారంగా, లాక్‌డౌన్ పరిమితి ఏప్రిల్ 14గా ఉన్నప్పడు దీన్ని రూపొందించారు.

దిల్లీ కాలేజ్ ఆఫ్ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ పరీక్షిత్ ఘోష్ కూడా ఈ పరిశోధన పత్రం రూపకల్పనలో పాలుపంచుకున్నారు.

కేవలం లాక్‌డౌన్‌తో అన్నీ సాధించలేమని ఆయన బీబీసీతో అన్నారు. దీనికి తోడుగా ఇతర విధానాలను కూడా పాటించాల్సి ఉంటుందని చెప్పారు.

‘‘కోవిడ్-19ను నివారించే చర్యల్లోకెల్లా కఠినమైంది లాక్‌డౌన్. కానీ దీన్ని చాలా రోజులు కొనసాగించడం కుదరదు. ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడవచ్చు’’ అని ఘోష్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు ఊరటను ఇస్తుందని, క్యాష్ ఫ్లోలో ఉన్న సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

కానీ, ప్రస్తుతం ప్రజల చేతుల్లో డబ్బులు లేవు. నేరుగా నగదు బదిలీ చేసే అంశం గురించి కూడా ఘోష్ ప్రస్తావించారు.

సింగపూర్ మోడల్‌ను ఇందుకు ఉదాహరణగా చూపారు.

‘‘సింగపూర్‌లో కరోనావైరస్ పరీక్షల్లో ఎవరైనా పాజిటివ్‌గా తేలితే, ప్రభుత్వం వారికి రూ.5 వేలు చొప్పున క్వారంటీన్‌లో ఉండేందుకు ఇస్తోంది. ఫలితంగా జనాలు పరీక్షలు చేయించుకునేందుకు భయపడటం లేదు. కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా సులభమవుతుంది. ఐసోలేషన్‌లో ఉండటానికి జనాలు ఇబ్బంది పడటం లేదు’’ అని ఘోష్ చెప్పారు.

భారత్‌లో కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణైతే 21 రోజులు క్వారంటీన్‌లో ఉండాలి. పేదలకు ఈ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. అందుకే పరీక్షలు చేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. భారత ప్రభుత్వం కూడా సింగపూర్‌లాంటి విధానం అమలు చేస్తే, జనాలు పరీక్షలకు ముందుకువస్తారు. ఇలా చేస్తే, లాక్‌డౌన్ లాంటి కఠినమైన పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉండదు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)