ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు

    • రచయిత, ఎన్గ్ల కిల్లియన్ షింటోమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనావైరస్ కారణంగా కాల్పుల విరమణను ప్రకటిస్తున్నట్టు మార్చి 29న కామెరూన్‌లోని ఇంగ్లిష్ మాట్లాడే భూభాగంలోని ప్రధాన వేర్పాటువాదుల బృందం వెల్లడించింది. దీంతో ఆ దేశంలోని ప్రముఖ మానవహక్కుల కార్యకర్త బియాట్రైస్ టిటాంజీ సంతోషంతో ఎగిరి గెంతేశారు. కానీ వారి ప్రకటన మాటలకే పరిమితమై యుద్ధం కొనసాగుతుండటంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి.

“ఇదో భయానకమైన పరిస్థితి వేలాది మంది అడవుల్లో చిక్కుకున్నారు. వాళ్లకు మేం కోవిడ్-19 గురించి ఎలా చెప్పగలం?” అని డాక్టర్ టిటాంజీ బీబీసీతో అన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌ను తరిమి కొట్టేందుకు అంతా కలిసి రావాలంటూ ఐక్య రాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇచ్చిన పిలుపు మేరకు ద సదరన్ కెమరూన్స్ డిఫెన్స్ ఫోర్సెస్(ఎస్‌సీడీఎఫ్) ఏక పక్షంగా కాల్పుల విరమణను ప్రకటించింది.

“యుద్ధం అనే మూర్ఖత్వంపై కూడా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. సాయుధపోరాటాన్ని లాక్ డౌన్‌లో పెట్టి మనల్ని మనం కాపాడుకునేందుకు అంతా కలిసి వైరస్‌తో నిజమైన యుద్ధం చెయ్యాల్సిన సమయం ఇది” అని గుటెరెస్ అన్నారు.

అయితే కెమెరూన్‌కి చెందిన 15 వేర్పాటవాద గ్రూపుల్లో ఏ ఒక్కటీ ఆయన మాట వినలేదు.

ఏకపక్ష కాల్పుల విరమణ వల్ల తమ భూభాగాన్ని పిలిచి మరీ ప్రభుత్వ బలగాల చేతుల్లో పెట్టినట్టు అవుతుందని వేర్పాట వాద గ్రూపుల్లో అతి పెద్దదైన అంబజోనియా గవర్నింగ్ కౌన్సిల్ వ్యాఖ్యానించింది.

ఓ వైపు ఆకలి మరోవైపు జబ్బులు

అయితే ఫ్రెంచ్ మాట్లాడే కామెరూన్ అధ్యక్షుడు పాల్ బియా యుద్ధ విరమణ ప్రకటించలేదు. పైగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలకు మరిన్ని చిక్కులు తెచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. కమర్షియల్ విమానాలతో పాటు మానవతా సాయాన్ని అందించే విమానాలను కూడా రద్దు చేశారు.

“కష్టాల్లో ఉన్న ప్రజలకు అవసరమైన ఆహార పదార్ధాలు, మందులు అందించకపోతే మేం వారి దగ్గరకు వెళ్లడంలో అర్థం లేదు. వాళ్లు ఆకలితోనూ, జబ్బులతోనూ ప్రాణాలు కోల్పోతారు” అని డాక్టర్ టిటాంజీ అన్నారు. ఆమె ఉమెన్స్ గిల్డ్ ఫర్ ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్‌ అనే స్వచ్ఛంద సంస్థకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ కామెరూన్‌లో శాంతి కోసం ప్రయత్నిస్తోంది.

కామెరూన్‌లో ఇంగ్లీష్, ఫ్రెంచ్ రెండూ అధికార భాషలే. అయితే సంక్లిష్టమైన వలస చరిత్ర కారణంగా ఫ్రెంచ్ మాట్లాడేవారి ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో తమపై వివక్ష చూపిస్తున్నారన్నది ఇంగ్లిష్ భాష మాట్లాడే మైనార్టీల ప్రధాన ఆరోపణ.

వాయువ్య, నైరుతి ప్రాంతాల్లోని ఇంగ్లీష్ మాట్లాడే ప్రాంతాల్లోని పాఠశాలలు, న్యాయస్థానాల్లో బలవంతంగా ఫ్రెంచ్ వాడకాన్ని చొప్పించడాన్ని నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి. 2017లో అది తీవ్ర హింసకు దారి తీసింది కూడా. ఆ ఆందోళనల కారణంగా ఇప్పటి వరకు సుమారు 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

సుమారు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే తమ నగరాలు ప్రస్తుతం యుద్ధ క్షేత్రాలుగా మారిపోవడంతో వాళ్లంతా అడవుల బాట పట్టారు. అక్కడే చిన్న చిన్న ఇళ్లు, ఊళ్లు నిర్మించుకొని కొత్త జీవితాల్ని మొదలు పెట్టారు.

  • 1884లో జర్మనీ ఈ వలస రాజ్యాన్ని స్థాపించింది.
  • 1916లో బ్రిటిష్, ఫ్రెంచ్ దళాలు జర్మనీని అక్కడ నుంచి తరిమేశాయి.
  • ఆ తర్వాత కామెరూన్ రెండుగా విడిపోయింది. 80% ఫ్రాన్స్ లో కలిసిపోగా 20% బ్రిటన్‌తో కలిసిపోయారు.
  • ఫ్రాన్స్‌ నేతృత్వంలో ఉన్న కామెరూన్లకు 1960లో స్వతంత్రం లభించింది.
  • ఆ తరువాత జరిగిన అభిప్రాయ సేకరణలో దక్షిణ కామెరూన్లు కామెరూన్‌తో కలిసిపోగా, ఉత్తర కామెరూన్లు ఇంగ్లిష్ మాట్లాడే నైజీరియాలో కలసిపోయారు.

కామెరూన్‌లో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా వాయువ్య, నైరుతి ప్రాంతాల్లో ఉన్న 7,421 ఆరోగ్య కేంద్రాల్లో 34శాతం లేదా 255 ఆరోగ్య కేంద్రాలు పూర్తిగా పని చేయకపోవడం లేదా పాక్షికంగా మాత్రమే పని చేస్తున్నాయన్నది యూనిసెఫ్ అంచనా.

కొన్ని చోట్ల వాటిపై దాడి చేసి తగులబెట్టేశారు. వైద్య సిబ్బందిని అక్కడ నుంచి బలవంతంగా తరిమేశారు.

మరింత భయపెడుతున్న కోవిడ్-19 మహమ్మారి

ఈ పరిస్థితుల్లో కోవిడ్-19 మహమ్మారి తలెత్తడం అక్కడ మరింత భయాన్ని పెంచుతోంది.

మార్చి నుంచి ఇప్పటి వరకు కామెరూన్‌లో సుమారు 2200 కరోనావైరస్ కేసులు నమోదు కాగా సుమారు 100 చనిపోయారు. ఇది మధ్య ఆఫ్రికాలోనే అత్యధికం.

వాటిలో కొన్ని కేసులు వాయువ్య, నైరుతి ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి ప్రధాన కారణం కోవిడ్-19 టెస్టులు పరిమిత సంఖ్యలో జరగడం. అలాగే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రజల రాకపోకలపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. చాలా పట్టణ, గ్రామీణ ప్రాంతాలు ఈ మహమ్మారి ప్రతాపం చూపించక ముందు నుంచే లాక్ డౌన్‌లో ఉండటం కూడా కేసులు తక్కువగా నమోదు కావడానికి మరో కారణం.

ప్రస్తుతం చాలా మంది పౌరులు, సైనికులు ఎక్కడ చూసినా మాస్కులు వేసుకొని కనిపిస్తున్నారు. వాయువ్య, నైరుతి ప్రాంతాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గస్తీ కాసే సమయాల్లో సైనికులు శానిటైజర్లను ఉపయోగిస్తున్నారు.

అయితే సాయుధులైన మిలిషీయాలు కరోనావైరస్ తమకు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అలాగే అంటు వ్యాధుల్ని ఎదుర్కొనేందుకు తమ రహస్య ప్రాంతాల్లో వైద్య పరంగా తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కొన్ని సార్లు ప్రభుత్వ అధికారుల్ని అపహరించి ఈ రహస్య ప్రాంతాల్లో ఉంచుతుంటారు.

గత నెల చివర్లో సుమారు 300 మంది ప్రభుత్వ బలగాలు వేర్పాటు వాదులే లక్ష్యంగా ఆరు రోజుల పాటు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించాయి. సుమారు 15 మంది సాయుధుల్ని మట్టుబెట్టామని మిలటరీ చెప్పింది. అలాగే వాయువ్య ప్రాంతంలోని బఫుట్ పట్టణంలో వారికి చెందిన 2 సైనిక శిబిరాలను కూడా ధ్వంసం చేశామని ప్రకటించింది.

ప్రస్తుతం ప్రభుత్వ భద్రతా బలగాలు ఓ కోర్టు రిజిస్ట్రార్‌తో సహా ముగ్గురు ప్రభుత్వ అధికారుల కోసం గాలిస్తున్నాయి. వేర్పాటు వాదులు వారిని గత నెలలో వాయువ్య ప్రాంతంలో ఉన్న బొయొ నగరంలో అపహరించారు.

ఇక్కడ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం గొప్ప సవాల్‌తో కూడుకున్న పని అని అన్నారు డాక్టర్ టిటాంజీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రజల ప్రాణాలను తియ్యడానికి యుద్ధం అవసరం లేదు. ఈ కోవిడ్-19 సంక్షోభం చాలు అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)