ఇండియా జీడీపీ: తాజా గణాంకాలపై మీద లాక్‌డౌన్ ప్రభావం నామమాత్రంగానే ఉందా?

జీడీపీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆలోక్ జోషి
    • హోదా, బీబీసీ కోసం

మాంద్యం గుమ్మం దగ్గరే నిలబడి లేదు. ఇంట్లోకి కూడా చేరుకుంది. అది కనిపించడం లేదు, దానిని ప్రకటించలేదు అంతే... జీడీపీ గణాంకాలు వచ్చేశాయి. కోర్ సెక్టార్ గణాంకాలు కూడా వస్తున్నాయి.

ఈ రెండు గణాంకాలు కలిపి చూస్తే కనిపించే ఆ చిత్రం చాలా భయానకంగా ఉంది.

నాలుగో త్రైమాసికంలో భారత్ వృద్ధి 3.1 శాతం ఉంది. గత ఏడాది మొత్తం అంటే 2019-20లో ఈ గణాంకాలు 4.2 శాతంగా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. వచ్చే గణాంకాలు దారుణంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయినా, భారత జీడీపీ గణాంకాల కోసం ఎదురుచూశారు. అందరి దృష్టీ వాటిపైనే ఉండడం వెనుక కారణమేంటి?

అదేంటి అంటే, ఇక్కడ గత ఏడాది ఆర్థిక సంవత్సరం మొత్తం వృద్ధి అంటే జీడీపీ గ్రోత్ గణాంకాలు కూడా వస్తున్నాయి. వాటి ద్వారా కరోనా సంక్షోభం రావడానికి ముందే మనం ఎంత మునిగిపోయి ఉన్నామో, కరోనా తర్వాత మనకు ఈదడానికి ఎంత వరకూ అవకాశాలు ఉంటాయో కనిపిస్తుంది.

అయితే, కరోనా మహమ్మారి దేశంలో వ్యాపించింది. జనం కర్ఫ్యూ కూడా రుచిచూశారు. కొన్నిరాష్ట్రాలు లాక్‌డౌన్ కూడా అమలు చేసేశాయి. కానీ దేశంలో మొదటి లాక్‌డౌన్ మార్చి 24న విధించారు. అంటే ఈ జీడీపీ గణాంకాలు కేవలం ఏడు రోజులు వ్యాపార కార్యకలాపాలు ఆగిపోయిన సమయంలోవి మాత్రమే.

కేంద్ర గణాంకాల కార్యాలయం జారీ చేసిన జీడీపీ గణాంకాలలో నాలుగో త్రైమాసికం, అంటే జనవరి నుంచి మార్చి వరకూ, మొత్తం ఆర్థిక సంవత్సరం అంటే 2019 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకూ అంచనాలను మన ముందు ఉంచారు. ముందు ముందు లెక్కలు వేయడానికి ఈ రెండు గణాంకాలు చాలా కీలకం. కానీ ఏ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

మొట్టమొదట చూస్తే, నాలుగో త్రైమాసికంలో, మొత్తం ఏడాది జీడీపీ గ్రోత్ గణాంకాల్లో గ్రోత్ అంటే వృద్ధి ఎంతో చూడాలి. సులభంగా చెప్పుకోవాలంటే అది జీరోకు ఎంత దగ్గరగా ఉందో చూడాలి.

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, EPA

మాద్యం భయం కమ్మేసిన చోట బాగానే ఉంటుంది

గణాంకాలు రాగానే నాలుగో త్రైమాసికంలో భారత్ 3.1 శాతం వృద్ధి నమోదు చేసిందని జనం ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారు. తర్వాత కాసేపట్లోనే మొత్తం ఏడాది అంచనాలు కూడా వచ్చాయి. వాటిలో ఆ వృద్ధి 4.2 శాతంగా ఉంది. అంటే మాంద్యం వస్తుందనే భయం కమ్మేసిన చోట, వృద్ధి జరిగిందని చెప్పుకోవడం బాగానే ఉంటుంది అనేది సుస్పష్టం.

కానీ, దానితోపాటు అంతకు ముందు ఏడాది భారత ఆర్థికవ్యవస్థ 6.1 శాతం వేగంతో ముందుకెళ్లింది అనేది చూడడం కూడా అవసరమే. డబుల్ డిజిట్ గ్రోత్ అంటే జీడీపీ 10 శాతం వేగంతో ముందుకు వెళ్లాలని దాదాపు పది, పన్నెండేళ్లుగా దేశం కలలు కంటోంది. గత ఏడాది వెల్లడించిన అంచనా గణాంకాలు, గత 11 ఏళ్లలో అత్యంత దారుణమైన గణాంకాలు.

అయితే, ఇదే సమయంలో మనం ప్రపంచంలోని మిగతా దేశాల గణాంకాలతో పోల్చి చూసి ఉపశమనం పొందవచ్చు. అక్కడ గ్రోత్ రేట్ ఆగిపోయి ఎకానమీ కుదించుకుపోవడం మొదలైంది. కానీ మనం మనం మన దేశంలోని పేదరికంలోకే తొంగి చూడాలని అనుకుంటే అది ఆందోళనకు ఆరంభమే అవుతుంది. ముందు ముందు ఏ విపత్తు రాబోతోంది లేదా వచ్చేసింది అనడానికి అది చిన్న ఉదాహరణ మాత్రమే. కానీ అది గణాంకాల పుస్తకం వరకూ చేరుకోలేదు.

అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య జీడీపీ 4.48 శాతం వృద్ధి జరిగింది. అయితే అక్కడ కూడా దాదాపు రెండేళ్ల నుంచీ వరసగా పతనం నమోదైంది. ఈ త్రైమాసిక గణాంకాలు కూడా గత ఏడేళ్లలో అత్యంత దారుణంగా ఉన్నాయి.

కానీ జనవరి నుంచి మార్చి మధ్య ఈ వేగం ఒకటిన్నర శాతానికి పైగా పతనమై 3.1 శాతానికి చేరుకుంది. కేవలం ఒక వారం లాక్‌డౌన్ ప్రభావంతో మొత్తం మూడు నెలల గణాంకాలు నాశనం అయ్యాయి. అదే ఏప్రిల్, మే, జూన్ గణాంకాలు వస్తే, అవి ఇంకెంత దారుణంగా ఉంటాయో మీరు ఆలోచించండి. ఈ మూడు నెలల్లో రెండు నెలలు దాదాపు అన్నీ స్తంభించిపోగా, వచ్చే నెలలో ఎన్ని పనులు మొదలవుతాయి అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. ఏం జరగచ్చు అనేదానికి ఈరోజు వచ్చిన కోర్ సెక్టార్ గణాంకాలను మనం చిన్న ఉదాహరణగా చూడచ్చు.

కరోనావైరస్

ఫొటో సోర్స్, Getty Images

కోర్ సెక్టార్ గణాంకాలు ఏం చెప్పాయి?

కోర్ సెక్టార్ అంటే ఆర్థికవ్యవస్థకు వెన్నెముకగా బావించే 8 రంగాలు. ఏప్రిల్ నెలలో వీటి ఇండెక్స్ లో 38.1 శాతం పతనం నమోదైంది. మార్చిలో కూడా ఇక్కడ 9 శాతం పతనం వచ్చింది. అంటే రెండు నెలల్లో వాటి కార్యకలాపాలు దాదాపు సగం అయ్యాయి. మన ముందున్న పరిస్థితి మీకు తెలిసిందే. అయితే, గణాంకాల కార్యాలయం కూడా ఈసారీ తన అంచనాలు మార్చింది. జీడీపీ గణాంకాలతోపాటూ ఇప్పటివరకూ ఎప్పుడూ ప్రస్తావించని ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది.

ఉదాహరణకు విమానాశ్రయాల వల్ల ఎన్ని లభాలు వచ్చాయి. ఎన్ని వస్తువులు వచ్చాయి, ఎల్ఐసీ ప్రీమియం, బ్యాంకుల్లో డిపాజిట్లు-రుణాలు, వాణిజ్య వాహనాల అమ్మకాలు ఇంకా చాలా విషయాల గురించి వివరాలు ఇచ్చారు. వాటి ఆధారంగా జీడీపీని లెక్కగట్టామని తెలిపారు.

సరే, లెక్కలు ఇలా కట్టాలా, ఎలా కట్టాలి అనేది మరోసారి చర్చిద్దాం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, దానిని తిరిగి పట్టాలెక్కించడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం స్పష్టమైంది.

వచ్చే త్రైమాసికం గణాంకాలు ఆగస్టులో వస్తాయి. కానీ ఆ జీడీపీలో భారీ పతనం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే, ఇప్పుడు కేవలం వారం రోజుల లాక్‌డౌన్ ప్రభావంతోనే ఇలా ఉంటే, అప్పటికి నెల లేదా అంతకంటే ఎక్కువ మూసివేత ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోడానికి అందరూ ఆర్థికవేత్తలు కావాల్సిన అవసరం లేదు.

జీడీపీ

ఫొటో సోర్స్, EPA

కానీ వాటిని లెక్కలు వేస్తున్న ఆర్థికవేత్తల చెబుతున్నదాని ప్రకారం వచ్చే త్రైమాసికంలో భారత ఆర్థికవ్యవస్థలో 40 శాతం వరకూ పతనం నమోదవుతుందని అంచనా.

కానీ, ఆ దారుణమైన గణాంకాలు కనిపించక ముందే వాటిని చెరిపేసే ప్రయత్నాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. అందుకు మార్కెట్లు, పరిశ్రమలు తెరవడం చాలా అవసరం. అప్పుడే మళ్లీ పనులు మొదలవడం, జీడీపీ ఏర్పడడం జరుగుతుంది.

అంటే నేను ఖర్చు చేసింది షాపు వారి ఆదాయం అయితే, షాపు ఓనర్ ఖర్చు చేసేది అతడికి వస్తువులు అమ్మే పెద్ద కంపెనీకి ఆదాయం అవుతుంది. ఆ పెద్ద కంపెనీ ఖర్చు దానికి వస్తువులు సప్లై చేసే కంపెనీలకు ఆదాయం అవుతుంది. దానివల్ల కార్మికుల వేతనాలు వస్తాయి. వారి సంపాదనపై వేసే పన్నులతో ప్రభుత్వానికి ఆదాయం అవుతుంది. అవన్నీ కలిసే జీడీపీ ఏర్పడుతుంది.

లావాదేవీలు, వ్యాపారాలు నడుస్తున్నప్పుడే జీడీపీ ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం, ప్రజలు ఆ వ్యాపారాలను పట్టాలెక్కించే మార్గాలు వెతికాల్సుంటుంది.

ఆదివారం ప్రధానమంత్రి 'మన్‌కీ బాత్'‌లో ఈసారీ ఆ మార్గాలు కనిపిస్తాయనే ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)