షిరిడీ సాయి ఆలయం రేపటి నుంచి నిరవధికంగా మూసివేత :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/Shri Saibaba Sansthan Trust, Shirdi
జనవరి 19, ఆదివారం నుంచి షిరిడీలోని సాయిబాబా ఆలయాన్ని నిరవధికంగా మూసి వేయనున్నట్లు సాయిబాబా సంస్థాన్‌ట్రస్ట్ ప్రకటించినట్లు ఆంధ్రజ్యోతి ఒక వార్తా కథనం ప్రచురించింది.
ఆ మేరకు షిరిడీ ట్రస్ట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసిందని, తదుపరి కార్యాచరణపై చర్చించడానికి శనివారం సాయంత్రం షిరిడీ గ్రామస్థులంతా సమావేశం అవుతారని ఆ కథనంలో పేర్కొన్నారు.
షిర్డీలో సాయిబాబా ఆలయాన్ని ఆదివారం నుంచి నిరవధికంగా మూసివేస్తున్న విషయం వాస్తవమేనని ట్రస్టు సభ్యుడు భావుసాహెబ్ ధ్రువీకరించారు.
సాయి బాబా జన్మస్థలం పత్రి అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్‌ఠాక్రే ఇటీవల పర్భణీ జిల్లాలో అభివృద్ధి పనులపై చర్చించారు.
జిల్లాలోని 'పత్రి'ని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.
షిరిడీతో సమానంగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పారు. కానీ, సీఎం ఉద్ధవ్‌ఠాక్రే నిర్ణయంపై షిర్డీలోని సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పత్రిక రాసింది.
పత్రిని అభివృద్ధి చేస్తే షిర్డీ ప్రాముఖ్యం తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చింది.
షిర్డీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలన్నది రాష్ట్ర సర్కార్ కుయత్నమని ట్రస్ట్ ఆరోపించింది. తొలిసారిగా ఆదివారం బంద్‌కు పిలుపిచ్చింది.
సీఎం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలయం మూసివేత నిర్ణయం తీసుకుంది.
ఆ రోజునుంచే సాయి ఆలయంలో అన్ని కార్యక్రమాలూ నిలిపేస్తున్నట్లు ప్రకటించడంతో అనూహ్యమైన పరిస్థితి ఉత్పన్నమవుతోందని కథనంలో చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/Andhra Pradesh CM
జగన్ పిటిషన్లను కొట్టివేసిన సీబీఐ కోర్టు
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టివేసిందని ఈనాడు కథనం ప్రచురించింది.
5 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను కలిపి విచారించాలని, సీబీఐ ప్రధాన కేసుల్లో విచారణ పూర్తయ్యాక ఈడీ కేసుల విచారణ చేపట్టాలంటూ జగన్ వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసిందని చెప్పింది.
సీబీఐ దాఖలా చేసిన అభియోగపత్రాల్లో ఆరింట్లో ఉన్న డిశ్చార్జి పిటిషన్లను కలిపి విచారించడానికి గతంలో ఇదే కోర్టు అనుమతించిందని, అనంతరం దాఖలు చేసిన 5 అభియోగపత్రాల్లోని డిశ్చార్జి పిటిషన్లను కలిపి విచారించాలంటూ జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై గత వారం సీబీఐ కోర్టు న్యాయమూర్తి బి.ఆర్.మధుసూదన్‌రావు విచారణ చేపట్టి శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారని ఈనాడు రాసింది.
డిశ్చార్జి పిటిషన్లలో విచారణ సందర్భంగా తమకు రక్షణగా తాము వెల్లడించే అంశాలు మరో కేసులో ప్రతికూలంగా మారుతాయని జగన్ తరఫు న్యాయవాదులు తెలిపారు.
అందువల్ల ఒకేసారి విచారణ చేపట్టాలని కోరారు. ఈ వాదనతో సీబీఐ తరఫు న్యాయవాది విభేదించారని కథనంలో చెప్పారు.
విచారణలో జాప్యం కోసమే ఏదో ఒక పిటిషన్ దాఖలు చేస్తున్నారన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి అన్నింటిన కలిపి విచారించడానికి నిరాకరిస్తూ జగన్ పిటిషన్ కొట్టివేశారని పత్రికలో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2018లో మైనర్లపై నేరాలు పెరిగాయ్
2018 మైనర్లపై నేరాలు పెరిగిన సంవత్సరం అని జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్‌బీ)-2018 నివేదిక వెల్లడించిందని సాక్షి కథనం ప్రచురించింది.
ఆ నివేదిక ప్రకారం... 2016, 2017, 2018 సంవత్సరాల్లో 18 ఏళ్ల లోపు బాల బాలికలపై నేరాలు పెరుగుతూనే వచ్చాయి.
2017తో పోలిస్తే 2018లో నేరాలు ఏకంగా 33.5 శాతం పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసిందని కథనంలో చెప్పారు.
మైనర్లపై నేరాలకు సంబంధించి 2016లో 1,847 కేసులు, 2017లో 2,397, 2018లో 2,672 కేసులు నమోదయ్యాయి. 2018లో 2,672 ఘోరాల్లో 2,804 మంది మైనర్లు బాధితులుగా ఉన్నారని ఇందులో చెప్పారు.
ఏపీలో 2018లో 40 ఘటనల్లో 52 మంది బాలలు హత్యకు గురికాగా, ఒక బాలిక అత్యాచారం అనంతరం హత్యకు గురైంది.
14 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాల కార్మిక నిరోధక చట్టం కింద 143 కేసులు నమోదయ్యాయని పత్రిక రాసింది.
బాలలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలో ఒక సైబర్ కేసు నమోదైంది.
వ్యభిచారం రొంపిలో దించేందుకు 22 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రాస్టిట్యూషన్‌అండర్‌ఇమ్మోరల్‌ట్రాఫిక్(ప్రివెన్షన్) యాక్ట్-1956 కింద 14 కేసులు నమోదు చేశారు.
19 మంది బాలికలకు వివాహాలు చేయడంపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదయ్యాయని నివేదిక చెబుతోందని తెలిపారు.
జువైనల్‌జస్టిస్(కేర్‌అండ్‌ప్రొటెక్షన్‌ఆఫ్‌చిల్డ్రన్) యాక్ట్‌కింద కేసుల నమోదు పెరిగింది. 49 ఘటనల్లో 50 మంది బాధిత బాలికలున్నారు.
ఏపీలో బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచార నిరోధక చట్టం(పోక్సో యాక్ట్) కింద 261 కేసులు నమోదు కాగా, 366 మంది బాధితులుగా ఉన్నారు.
2018లో బాలలపై జరిగిన నేరాల్లో ఏపీ పోలీసులు 81.06 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు.
చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నింధితులుగా ఉన్న 2,805 మంది పురుషులు, 136 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారని ఈ కథనంలో చెప్పారు.

ఫొటో సోర్స్, facebook/Kalvakuntla Taraka Rama Rao - KTR
బీజేపీకి కేటీఆర్ సవాల్
ఎన్ని నగరాలను బీజేపీ స్మార్ట్ సిటీలుగా మార్చిందో చెప్పాలని బీజేపీకి కేటీఆర్ సవాల్ విసిరినట్లు నవ తెలంగాణ కథనం ప్రచురించింది.
తెలంగాణభవన్‌లో శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా ముచ్చటించిన కేటీఆర్ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారని పత్రికలో చెప్పారు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో చేపట్టిన ఇండ్ల నిర్మాణం కన్నా, ఒక్క తెలంగాణ ఎక్కువ చేపట్టిందని గుర్తు చేశారు.
కిషన్‌రెడ్డి తనతో వస్తే డబుల్ బెడ్‌రూం ఇండ్లు చూపించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరాని కథనంలో రాశారు.
స్థానికంగా చేసిందేమి లేకనే బీజేపీ పౌరసత్వం సవరణ చట్టం లాంటి జాతీయ అంశాలను మున్సిపల్‌ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నదని విమర్శించారు.
చట్టబద్ధంగా రాష్ట్రానికి రావాల్సినవే తప్ప బీజేపీ తెలంగాణకు అదనంగా చేసిందేమి లేదని తెలిపారు.
టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో ఒకటే ట్యాంక్‌బండ్ ఉండేదనీ, ప్రస్తుతం 90 ఉన్నాయనీ, అలాగే 25 అర్బన్ లాన్స్‌స్పేసెస్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారని నవ తెలంగాణ రాసింది.
ఎదురు డబ్బులు ఇస్తామన్నా అభ్యర్థులు దొరకని పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలాడుతూ.. టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయికారీ పొత్తుతో ముందుకెళ్లాయని కేటీఆర్ అన్నట్లు పత్రిక రాసింది.
ఇవి కూడా చదవండి:
- నిర్భయ దోషులకు కొత్త డెత్ వారెంట్, ఫిబ్రవరి 1న ఉరిశిక్ష
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...
- సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో అర్ధ రాత్రి వరకు మహిళల ఆందోళన
- విరసం @50: వర్గ పోరాట స్పృహతో అయిదు దశాబ్దాల సాహితీ ప్రస్థానం
- కేరళలో రెండు ఎత్తయిన భవనాలు క్షణాల్లో నేలమట్టం
- అమిత్ షా ర్యాలీలో CAA వ్యతిరేక బ్యానర్ పట్టుకున్న అమ్మాయి ఏమన్నారు...
- జేఎన్‌యూలో దాడి నిందితుల్లో విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్
- NRC ఎన్డీఏ కూటమిలో చీలికలు తీసుకొచ్చిందా
- భారత్‌లో ప్రతి 20 మంది చిన్నారుల్లో ఒకరు అయిదేళ్లలోపే చనిపోతున్నారు...
- ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అలాంటి పిటిషన్లతో ఉపయోగం లేదు’- చీఫ్ జస్టిస్ బోబ్డే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








