రేషన్ షాపుల్లో చికెన్, మటన్, చేపలు, గుడ్లు.. నీతి ఆయోగ్ ప్రతిపాదన - ప్రెస్ రివ్యూ

రేషన్ షాప్‌ల్లో చికెన్, గుడ్లు, మటన్, చేపలను అందించే ప్రతిపాదనను నీతి ఆయోగ్ పరిశీలిస్తున్నట్లు సాక్షి దినపత్రిక ఓ కథనం రాసింది.
'పుష్టికర భారత్' నిర్మాణంలో భాగంగా నీతి ఆయోగ్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తోంది.
బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలతో పాటు ప్రొటీన్ సహిత ఆహారపదార్థాలను కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా దేశంలోని పేదలకు అందజేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
పౌష్టికాహార లోపం సమస్యను నివారించడంలో భాగంగా గుడ్లు, చికెన్, మటన్, చేపలు లాంటి ప్రొటీన్ సహిత ఆహార పదార్థాలను పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే వ్యవస్థను రూపొందించడంపై నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోంది. ఈ ప్రతిపాదనను నీతి ఆయోగ్ 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్‌లో పెట్టే అవకాశాలున్నాయి.
నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్‌చంద్ ఈ విషయమై మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న ఆదాయం ద్వారా పౌష్టికాహారం పొందాల్సింది పోయి దురదృష్టవశాత్తు ఎక్కువ మంది నూనె, చక్కెర, మసాల సహిత పదార్థాలపై ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ప్రజలతో పాటు చట్టసభల సభ్యుల్లో కూడా అవగాహన కల్పించేలా విజన్ డాక్యుమెంట్‌లో ప్రస్తావిస్తామని వెల్లడించారు. 'పీడీఎస్ ద్వారా ఇప్పటికే సబ్సిడీ ఆహార పదార్థాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నాయి.
మాంసాహారం పంపిణీ అమలు భారమయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే పంపిణీ చేస్తున్న పదార్థాల్లో కొన్నింటిని తగ్గించి మా ప్రతిపాదనల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలను పంపిణీ చేస్తే బాగుంటుందని రమేశ్‌చంద్ సూచించారు.
యూనిసెఫ్ లెక్కల ప్రకారం దేశంలోని 20 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిపోతున్నారు. ప్రపంచంలోనే ఇలా బక్కచిక్కుతున్న చిన్నారుల్లో మూడోవంతు పిల్లలు భారతదేశంలోనే ఉన్నారు.

ఫొటో సోర్స్, Facebook/ActorPrabhas/urstrulyMahesh
ఫోర్బ్స్ ఇండియా జాబితాలో ప్రభాస్‌కు 44వ స్థానం, మహేశ్ బాబుకు 54వ స్థానం
ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో భారత్‌లోని టాప్-100 సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
ఆదాయ అర్జనతోపాటు ప్రింట్, సోషల్‌మీడియాలో సెలబ్రిటీలకున్న ఆదరణ ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది.
తెలుగు సెలబ్రెటీల్లో ప్రభాస్ (ఆదాయం : రూ.35 కోట్ల) అత్యుత్తమంగా 44వ స్థానం దక్కించుకున్నారు.
మహేశ్‌బాబు ఈసారి (రూ.35కోట్లు) 54వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఆయన 33వ స్థానంలో ఉన్నారు. సినీ దర్శకుడు త్రివిక్రమ్ (రూ.21.5కోట్లు)కు ఈసారి 77వ స్థానం దక్కింది.
మొత్తం జాబితాలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (రూ.252.72 కోట్లు) మొదటి స్థానంలో నిలవగా, 293.25 కోట్ల ఆదాయంతో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.
పోయిన ఏడాది మొదటి స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్(రూ.229.5కోట్లు) ఈ సారి మూడో స్థానంలోకి వచ్చారు.
అమితాబ్ బచ్చన్ (రూ.239.2కోట్లు), మహేంద్ర సింగ్ ధోని (రూ.135.93కోట్లు), షారుఖ్‌ఖాన్ (రూ.124.38కోట్లు), రణవీర్ సింగ్(రూ.118.2కోట్లు), అలియా భట్ (రూ.59.21కోట్లు), సచిన్ (రూ.76.96కోట్లు), దీపిక పడుకోన్ (రూ.48కోట్లు) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అజయ్‌దేవగణ్(12), రజనీకాంత్(13), ప్రియాంక చోప్రా(14), ఆమీర్‌ఖాన్ (15), ఏఆర్ రెహమాన్(16), హృతిక్ రోషన్ (18) టాప్ ట్వంటీలో ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP
ఎలుగుబంటి నుంచి రైతును కాపాడిన పెంపుడు కుక్కలు
ఎలుగుబంటి దాడి నుంచి ఓ రైతును పెంపుడు కుక్కులు కాపాడినట్లు ఈనాడు దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గంగదేవిపల్లి గ్రామంలో ఎలుగుబంటి దాడి నుంచి కాలం బక్కయ్య అనే రైతు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
బక్కయ్యపై దాడి చేసిన ఎలుగుబంటిని ఆయన పెంచుకుంటున్న కుక్కలు ప్రతిఘటించాయి.
రోజూలాగే బక్కయ్య గురువారం తన పెంపుడు కుక్కలను వెంట తీసుకుని పార్కలగండి సమీపంలోని ఉలవ పంటకు కాపలాకు వెళ్లారు.
బాగా పొగమంచు అలుముకుని ఉన్న ఆ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి పొంచి ఉంది. ఇది గమనించని బక్కయ్య కోతులను తరుముకుంటూ అటు వైపు వెళ్లగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసింది.
యజమాని కేకలు విన్న రెండు పెంపుడు కుక్కలు ఎలుగుబంటిపై తిరగబడ్డాయి. దీంతో కొద్దిసేపటికి అది అడవిలోకి వెళ్లిపోయింది.
తల, ముఖం భాగంలో తీవ్రగాయాలతో రక్తస్రావం కావడంతో బక్కయ్య చేనులోనే స్పృహ తప్పి పడిపోయారు. ఇంతలో ఓ కుక్క అరుచుకుంటూ ఇంటికెళ్లగా, మరొకటి యజమానికి రక్షణగా అక్కడే నిల్చుంది.
ఇంటికి వెళ్లిన కుక్క ప్రవర్తనతో అనుమానం వచ్చిన కుటుంబీకులు చేను దగ్గరికి వెళ్లారు. తీవ్రగాయాలతో పడి ఉన్న బక్కయ్యను చూసి పాల్వంచ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
తన పెంపుడు కుక్కల సాహసం వల్లే ప్రాణాలతో బయటపడ్డానని బక్కయ్య చెప్పారు.

ఫొటో సోర్స్, hyderabadpolice.gov.in
'గ్రామాల్లోనూ షీ టీంలు'
తెలంగాణలో గ్రామాల్లోనూ షీం టీంలను తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారని నమస్తే తెలంగాణ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.
మహిళలపై అరాచకాలను పూర్తిగా నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధంచేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.
ఇందుకోసం తనతోపాటు హోంమంత్రి మహమూద్ అలీ, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిపి కమిటీ వేశారని అన్నారు. మహిళా సంఘాల సభ్యులతోనే షీ టీంలు ఉంటాయని, వారి ఆధ్వర్యంలోనే పనిచేస్తాయని చెప్పారు.
ఆకతాయిలు, తాగుబోతులు, మహిళలపై అరాచకాలకు పాల్పడేవారిని మహిళాసంఘాలు గుర్తించి, పోలీసులకు రిపోర్టు చేసేలా పూర్తి స్వేచ్ఛ కల్పిస్తామని తెలిపారు.
ఎలాంటి చిన్న అఘాయిత్యం జరిగినా మహిళాసంఘాలే చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి, వాటిని సంఘాలకు అప్పగిస్తున్నారని చెప్పారు. స్త్రీనిధి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నదని తెలిపారు. స్త్రీనిధి, సెర్ప్, మెప్మాలు నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి"- పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
- 'హైదరాబాద్ ఎన్కౌంటర్' బూటకం, పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. సుప్రీం కోర్టులో నిందితుల కుటుంబ సభ్యుల పిటిషన్
- YouTube: ఎనిమిదేళ్ల ఈ అబ్బాయి ఏడాదిలో రూ. 184 కోట్లు సంపాదించాడు
- సనా గంగూలీ ‘The End of India’పై చర్చ.. ‘ఆ పోస్ట్ వాస్తవం కాదు’ - సౌరవ్ గంగూలీ
- ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి...
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








