తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు: లక్నో - దిల్లీ మధ్య ప్రైవేట్ రైలు సర్వీస్ షురూ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, @IRCTCofficial
దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు 'తేజస్ ఎక్స్‌ప్రెస్' శుక్రవారం పట్టాలపై పరుగులు తీసిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.
లక్నో - న్యూదిల్లీ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తోంది.
తేజస్ రైలుతో లక్నో- దిల్లీ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న వేగవంతమైన స్వర్ణ శతాబ్ది రైలు 6.40 గంటల్లో లక్నో నుంచి న్యూ దిల్లీకి చేరుకుంటోంది. తేజస్ ఎక్స్‌ప్రెస్ మాత్రం 6.15 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కేటగిరీకి చెందిన తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక వసతులున్నాయి. ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున పరిహారం చెల్లిస్తారు.
ఇందులో ప్రయాణించేవారు రూ. 25 లక్షల ఉచిత బీమా సౌకర్యం పొందొచ్చు. తేజస్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్ కారుకు రూ. 1,280, ఎగ్జిక్యూటివ్ చైర్ కారుకు రూ. 2,450 చెల్లించాలి.
ఈ ఎక్స్‌ప్రెస్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఇలాంటివి ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దిల్లీ-ముంబై, దిల్లీ-హౌరా లాంటి 50 ప్రధాన మార్గాల్లో ప్రైవేట్ రైళ్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని రైల్వే బోర్డు ఇప్పటికే జోనల్ రైల్వే విభాగాలకు సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధానమంత్రికీ తప్పని ’ఉల్లిపాయ’ కష్టాలు
భారతదేశంలో నెలకొన్న ఉల్లిపాయల కొరత పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌నూ తాకిందని.. ఈ సమస్యలపై ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా స్పందించారని ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం శుక్రవారం దిల్లీలో నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్‌లో ఆమె మాట్లాడారు. భారతదేశం ఉల్లి ఎగుమతులను నిషేధిస్తూ సెప్టెంబర్‌లో నోటీసులు జారీచేయటం మీద స్పందించారు.
‘‘మాకు ఉల్లిపాయలు దొరకటం చాలా కష్టంగా మారింది. మీరు ఎగుమతులు ఎందుకు ఆపేశారో మాకు తెలియదు. మా వంట మనిషిని ఉల్లిపాయలు లేకుండానే వంటలు చేయాలని చెప్పా’’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో సదస్సులో ఉన్నవారందరూ ఒక్కసారిగా నవ్వారు.
దేశంలో ఉల్లి కొరత నెలకొనడం.. క్వింటా ఉల్లి ధర ఆరేళ్ల గరిష్ఠ స్థాయికి రూ. 4,500 కు పెరగటంతో.. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై గత నెల 29న నిషేధం విధించింది.
‘‘నోటీసులు ఇవ్వటం సరే కానీ ఉన్నపళంగా ఉల్లి సరఫరా నిలిపివేయటం మాత్రం మాకు కష్టంగా ఉంది. మరోసారి ఇలా చేస్తే కాస్త ముందుగా నోటీసులు జారీ చేస్తే మంచిది’’ అని హసీనా నవ్వుతూ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
35 ఏళ్ల తర్వాత పాక్ మహిళకు భారత పౌరసత్వం
పాకిస్థాన్‌కు చెందిన జుబేదా (55) భారత పౌరసత్వం కోసం సుదీర్ఘ కాలం నిరీక్షించిందని.. 35 ఏళ్ల అనంతరం ఎట్టకేలకు ఆమెకు మన దేశ పౌరసత్వం లభించిందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని యోగేంద్రపూర్‌కు చెందిన మహమ్మద్ జావేద్‌ను 35 సంవత్సరాల క్రితం జుబేదా పెళ్లాడింది.
అనంతరం మన దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా.. తిరస్కరణకు గురైంది.
1994 నుంచి దీర్ఘకాలిక వీసాతో దేశంలో నివాసముంటోంది. ఇపుడు ఆమెకు భారత పౌరసత్వం లభించింది.
ఇవి కూడా చదవండి
- ‘80 రూపాయలకే ఇల్లు పథకం’
- తెలంగాణ ఆర్టీసీ: సమ్మెకు సై అంటున్న కార్మికులు... విధుల నుంచి తొలగిస్తామంటున్న యాజమాన్యం
- 'ఐఫోన్ నన్ను 'గే'గా మార్చింది' అంటూ యాపిల్ కంపెనీపై కేసు వేసిన రష్యన్
- ‘జీవితంలో మొదటిసారి నన్ను నేను ముస్లింగా భావించుకోవాల్సి వస్తోంది‘
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- కాలేజీలు మీ సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వకపోతే ఏం చేయాలి?
- ‘80 రూపాయలకే ఇల్లు పథకం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








