ఆర్టికల్ 370: ఏయే రాష్ట్రాల్లో బయటివారు భూములు కొనేందుకు వీల్లేదు... ఎందుకు?

కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జమ్మూకశ్మీర్‌ శాశ్వత నివాసులకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు, హక్కులను కల్పించిన ఆర్టికల్ 370 పరిధిలో ఆర్టికల్ 35ఎ ఉండేది. ఆ ఆర్టికల్‌లోని నిబంధనల కారణంగా ఇన్నాళ్లూ జమ్మూకశ్మీర్‌లో స్థానికేతరులు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉండేది కాదు.

ఇప్పుడు దానిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంటే, ఇకనుంచి దేశంలోని ఎక్కడివారైనా ప్రతిపాదిత కేంద్రపాలిత ప్రాంతాలు లద్దాఖ్, జమ్మూకశ్మీర్‌లలో స్థిరాస్తులు కొనుగోలు చేయొచ్చు, అక్కడే స్థిరపడొచ్చు.

అయితే, స్థానికేతరులు స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు వీళ్లేని రాష్ట్రం జమ్మూకశ్మీర్‌ మాత్రమే కాదు, ఇంకా చాలానే ఉన్నాయి. అవి అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, సిక్కిం. ఈ రాష్ట్రాలలో స్థానికేతరులు నివాసం ఉండొచ్చు, కానీ భూములు కొనుగోలు చేయడం కుదరదు.

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇలాంటి నిబంధనలు అమలులో ఉన్నాయి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల్లోనూ బయటివారు స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు వీళ్లేదు.

ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు పరిధిలోకి వస్తాయి, ఈశాన్య రాష్ట్రాలు మాత్రం షెడ్యూలు 6 కిందకు వస్తాయి.

కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

మొదట రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు గురించి చూద్దాం.

గిరిజనుల అస్థిత్వాన్ని పరిరక్షించేందుకు ఆయా ప్రాంతాలను ప్రభుత్వం 5వ షెడ్యూలులో చేర్చుతుంది. స్థానిక రాష్ట్రాల గవర్నర్లు గిరిజన్ హక్కుల 'పరిరక్షుడి'గా వ్యవహరిస్తారు. ఈ షెడ్యూలులోని నిబంధనల ప్రకారం, గిరిజన ప్రాంతాల్లో స్థానికేతరులు స్థిరపడకుండా గవర్నర్ చూడాల్సి ఉంటుంది. అంటే, సొంత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలవారు కూడా ఆయా గిరిజన ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసేందుకు వీల్లేదు.

ఈ షెడ్యూల్డు ప్రాంతాలున్న రాష్ట్రాల ప్రభుత్వాలు తప్పనిసరిగా గిరిజన సలహా మండళ్లను ఏర్పాటు చేయాలి. ఆ సలహా మండలి చేసే సిఫార్సుల మేరకు మాత్రమే ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది.

ఉదాహరణకు, ఒక ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఒక వ్యాపారవేత్త అనుకుంటే, ముందుగా గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత గిరిజన సలహా మండలి నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా మినహా.. మిగతా రాష్ట్రాలలో గిరిజన లేదా కొండ ప్రాంతాల అభివృద్ధి మండళ్లు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాలలో స్థానికేతరులు భూములు కొనేందుకు వీలుండదు.

"రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, పురోభివృద్ధికి సంబంధించిన విషయాలపై సలహాలు ఇవ్వడం గిరిజన సలహా మండలి ప్రధాన విధి" అని రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు చెబుతోంది.

ఇప్పటివరకు షెడ్యూల్డు ప్రాంతాల విషయానికొస్తే, రాజ్యాంగపరంగా గవర్నర్లకు విశేషాధికారాలు ఉంటాయి.

భూ యాజమాన్య హక్కుల బదిలీని కూడా షెడ్యూల్డు ప్రాంతాల చట్టం అనుమతించదు.

కశ్మీర్

ఫొటో సోర్స్, Getty Images

6వ షెడ్యూలు

ఈ షెడ్యూల్ ప్రధానంగా ఏడు ఈశాన్య రాష్ట్రాలకు వర్తిస్తుంది. "ఏదైనా ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన జిల్లాల్లో వేర్వేరు షెడ్యూల్డ్ తెగలు ఉంటే, గవర్నర్లు ఒక ఉత్తర్వు ద్వారా ఆ ప్రాంతాన్ని ఆయా గిరిజన సముదాయాలకు అనుగుణంగా విభజించవచ్చు" అని ఈ షెడ్యూలు చెబుతోంది.

అలాగే, గవర్నర్ ఒక నోటిఫికేషన్ ద్వారా ఏదైనా షెడ్యూల్డు ప్రాంతాన్ని స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాలో చేర్చవచ్చు, తొలగించవచ్చు. కొత్త స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లాను ఏర్పాటు చేయవచ్చు. ఆయా జిల్లాల పరిధిలో మార్పులు చేయవచ్చు.

నాగాలాండ్ విషయానికొస్తే, రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి కల్పించాలంటూ చాలాకాలంగా పోరాటాలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎ కింద, రాష్ట్రాలకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. రాష్ట్రాలు స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుకు పరిపాలన, న్యాపరమైన వెసులుబాట్లు ఉంటాయి. కానీ, నాగాలాండ్‌లో మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలను కూడా తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉంటుంది.

ఇతర రాష్ట్రాల వారు ఈ రాష్ట్రంలో భూముల కొనుగోలు చేయడం కుదరదు.

మేఘాలయలోనూ అదే పరిస్థితి. ఎంత డబ్బు ఉన్నా సరే, ఇక్కడ స్థానికేతరులు భూములు, ఇళ్లు కొనేందుకు వీళ్లేదు. అందుకే, ఇక్కడ పెద్దఎత్తున వ్యాపారాలు చేసేవారు కూడా అద్దె ఇళ్లలో ఉండాల్సిందే.

కశ్మీర్ అంశం

ఫొటో సోర్స్, EPA

జమ్మూకశ్మీర్ విషయంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన రాజకీయ వేత్తలను కూడా కలవరపెడుతున్నాయి. జమ్మూకశ్మీర్ తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని క్రిషక్ ముక్తీ సంగ్రామ్ సమితి(కెయంఎస్‌ఎస్) సలహాదారుడు, ఆర్టీఐ ఉద్యమకారుడు అఖిల్ గోగోయ్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ వ్యవహారం లాంటి రాజకీయపరమైన చర్యలు తీసుకునేముందు ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానాలను, సంస్కృతులను గౌరవించాల్సిన అవసరం ఉందని మణిపూర్ గిరిజన ఫోరానికి చెందిన ఒనిల్ క్షేత్రియుం బీబీసీతో అన్నారు.

మిజోరాం రాష్ట్రంలోనూ బయటి వ్యక్తులు స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు వీళ్లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు లాల్ థన్వాలా కూడా మిజోరాం భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

"ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఇదొక రెడ్ అలర్ట్. రాజ్యాంగపరమైన రక్షణ కలిగిన మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఇది ముప్పుగా మారింది. ఆర్టికల్ 35ఎ, ఆర్టికల్ 370లను రద్దు చేస్తే, మిజోరాం గిరిజనులకు రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్ 371జీ ప్రమాదంలో పడినట్లే" అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)