ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ: ఎమ్మెల్యేల్లో 96మందిపై క్రిమినల్ కేసులు, ధనిక ఎమ్మెల్యేలు చంద్రబాబు, జగన్, బాలకృష్ణ- ఏడీఆర్ నివేదిక

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 96 మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
వారు ఎన్నికల సంఘానికి సమర్పించిన స్వీయ ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్న వివరాలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించినట్లు ఏడీఆర్ తెలిపింది.
రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 174 మంది అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించింది. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ (వైసీపీ) సమర్పించిన పూర్తి అఫిడవిట్ ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో లేకపోవడంతో ఆయన వివరాలను ఈ నివేదికలో చేర్చలేదు.
ఆ నివేదిక ప్రకారం, 174 మంది ఎమ్మెల్యేలలో 96 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. 55 మంది తమ మీద తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అఫిడవిట్లలో స్వయంగా పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Adr
పార్టీల వారీగా చూస్తే...
150 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో 86 మంది, 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో 9 మంది, జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా తమ మీద క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించారు.
తీవ్రమైన క్రిమినల్ కేసులున్న వారిలో 50 మంది వైసీపీ, నలుగురు టీడీపీ, ఒకరు జనసేనకు చెందినవారు ఉన్నారని ఏడీఆర్ తెలిపింది.
మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసులు (ఐపీసీ 354, ఐపీసీ 509 సెక్షన్ల కింద నమోదైన కేసులు) ఉన్నట్లు ఆరుగురు ప్రకటించారు.
తన మీద హత్యకు సంబంధించిన కేసు (ఐపీసీ 302 సెక్షన్) ఉన్నట్లు వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
10 మంది హత్యాయత్నానికి సంబంధించిన కేసులు (ఐపీసీ 307 సెక్షన్), ఏడుగురు తమ మీద కిడ్నాప్‌కు సంబంధించిన కేసులు ఉన్నట్లు ప్రకటించారు.

ఫొటో సోర్స్, TDP.NCBN.OFFICIAL/FB
ధనిక ఎమ్మెల్యే చంద్రబాబు
ఎన్నికైన ఎమ్మెల్యేలలో 163 మంది (94 శాతం) కోటీశ్వరులున్నారు. సగటున ఒక్కో ఎమ్మెల్యే రూ.27. 87 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.
పార్టీల వారీగా చూస్తే 140 మంది వైసీపీ, 22 మంది టీడీపీ, జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే తమకు కోటి రూపాయలకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.
150 మంది వైసీపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ.22.41 కోట్లుగా ఉంది. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సగటున 64. 61 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.
174 మంది ఎమ్మెల్యేలలో అత్యంత ధనవంతుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. చంద్రబాబు తనకు చర, స్థిరాస్థులు కలిపి రూ.668 కోట్ల (రూ.6,68,57,50,975) విలువైన ఆస్తులున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబు తర్వాత స్థానంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన రూ. 510 కోట్లకు పైగా (రూ.5,10,38,16,566) విలువైన ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు.
అత్యధిక ఆస్తులున్న మూడో ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ నిలిచారు. ఆయన తనకు రూ. 274 కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నాయని తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అందరికంటే తక్కువ ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఆమె తనకు 6 లక్షల 75 వేల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.
ఆస్తులు 60 శాతం పెరిగాయి
2014లో గెలిచి, 2019లో మళ్లీ ఎన్నికైన 55 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ సగటున 60 శాతం పెరిగినట్లు ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడైంది. ఆ 55 మంది సగటు ఆస్తుల విలువ 2014లో రూ.29.97 కోట్లు ఉండగా, ఇప్పుడు రూ.47.99 కోట్లకు పెరిగింది.
ఐటీ రిటర్న్‌లలో పేర్కొన్న వివరాల ప్రకారం, అత్యధిక వార్షిక ఆదాయం కలిగిన ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2017- 18 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 25,89,38,290 (రూ.25 కోట్లు)గా చూపించారు.
చంద్రబాబు నాయుడు తన వార్షిక ఆదాయం రూ. 64,73,208 (రూ.64.7 లక్షలు)గా చూపించారు.
ఒకరు నిరక్షరాస్యులు
59 మంది ఎమ్మెల్యేలు తమ విద్యార్హతలను 5 నుంచి 12 తరగతి వరకు ఉన్నట్లు పేర్కొన్నారు. 112 మంది తాము డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదివినట్లు తెలిపారు. ఒక ఎమ్మెల్యే తాను ఏమీ చదువుకోలేదని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
- ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- కేఏ పాల్‌కు వచ్చిన ఓట్లు ఎన్ని?
- కొత్త వారసుల్లో గెలిచిందెవరు... ఓడిందెవరు...
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే
- చిరంజీవి ప్రజారాజ్యం నుంచి పవన్ కల్యాణ్ జనసేన వరకు...
- జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్కడు రాపాక వరప్రసాద్
- మోదీ ఎన్నికల మంత్రం: ‘దేశ భద్రత - హిందుత్వ సమ్మేళనం’తో... సామాజిక, ఆర్థిక సమస్యలు బలాదూర్
- జాకీర్ మూసా: ఇండియాలో 'మోస్ట్ వాంటెడ్' మిలిటెంట్ కశ్మీర్లో కాల్చివేత
- నరేంద్ర మోదీ ఘన విజయాన్ని ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి...
- నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం
- తెలుగు నేలపై మరో యంగ్ సీఎం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








