ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరినట్లేనా?

ఫొటో సోర్స్, facebook/INCAndhraPradesh
- రచయిత, అంజయ్య తవిటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్న పేరు ఉండేది. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో దేశమంతా ఓటర్లు కాంగ్రెస్‌పై కన్నెర్ర చేస్తే, తెలుగు ప్రజలు మాత్రం ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అలా దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించి, ఎంతో ప్రజాదరణ పొందిన ఆ పార్టీ నేడు రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడానికి కష్టపడుతోంది.
కొత్త రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో వరుసగా రెండు ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేని దుస్థితికి వచ్చింది. చాలాచోట్ల నోటా కంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా నోటాకు 1.28 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్ పార్టీకి 1.17 శాతం ఓట్లు వచ్చాయి.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని గతంలో ఎంతగానో ఆదరించేవారు. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
ఆ తర్వాత రెండేళ్లకు (1957లో) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది.
అలా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు దశాబ్దాల పాటు ఆ పార్టీ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది.

ఫొటో సోర్స్, JAIPALREDDY
దేశమంతా ప్రతికూలం, ఆంధ్రప్రదేశ్‌లో అనుకూలం
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1975-77 మధ్య దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దానిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం పూర్తి భిన్నమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 42 పార్లమెంట్ స్థానాల్లో 41 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
అంతేకాదు, 1978లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దేశమంతా ఇందిరను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ను ఓడిస్తే, తెలుగు ప్రజలు మాత్రం బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను, 290 చోట్ల కాంగ్రెస్ (ఇందిర కాంగ్రెస్) బరిలో నిలవగా 175 స్థానాలు గెలుచుకుంది.
అలాగే, 1980లో జరిగిన ఎన్నికల్లోనూ ఇందిరకు బహుమానం ఇచ్చారు. ఆ ఎన్నికల్లో ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని మెదక్ (ప్రస్తుతం తెలంగాణలో ఉంది) లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేశారు. రాయబరేలీలో ఆమెకు కేవలం ఏడు వేల ఓట్ల మెజార్టీ రాగా, మెదక్‌లో 2 లక్షలకు పైగా ఆధిక్యం వచ్చింది. ఇందిర రాయ్‌బరేలీని వదులుకుని మెదక్ నుంచే ప్రాతినిధ్యం వహించారు.
కాంగ్రెస్ ఎంపీల్లో ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీ సాధించింది కూడా తెలుగు వ్యక్తే. నంద్యాల లోక్‌సభ స్థానానికి 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు 5.8 లక్షల మెజార్టీతో అఖండ విజయం సాధించారు.
అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగు నేలపై ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పేందుకు ఆ ఫలితాలు చక్కని ఉదాహరణలు.

ఫొటో సోర్స్, fb/TDP.Official
ఎన్టీఆర్ రాకతో బ్రేక్
1983 సాధారణ ఎన్నికలు, 1985 మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ ప్రభంజనానికి బ్రేక్ పడింది. అయితే, 1989లో మళ్లీ ఆ పార్టీ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంది.
ఆ తర్వాత రెండు పర్యాయాల టీడీపీ పాలన అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ పదేళ్ల పాటు పాలించింది.
2004 ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలకు గాను, 234 చోట్ల మాత్రమే పోటీ చేసిన కాంగ్రెస్ ఏకంగా 185 సీట్లు కైవసం చేసుకుంది. 2009లో టీడీపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో ఏర్పడిన మహా కూటమిని సైతం ఢీ కొట్టి 156 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది.

ఫొటో సోర్స్, fb/ysrcpofficial
2014 ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్‌లో వచ్చిన సీట్ల వివరాలు
విభజన తెచ్చిన కష్టాలు
రాష్ట్ర విభజన అంశం సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బ కొట్టింది.
మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఘోరమైన పరాభవాన్ని 2014 ఎన్నికల్లో ఆ పార్టీ చవిచూసింది.
నవ్యాంధ్ర రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా సాధించకపోగా, 150 పైగా అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది.
ఎన్టీఆర్ ప్రభంజనం సమయంలోనూ కాంగ్రెస్‌కు ఇంతటి గడ్డు పరిస్థితి ఏర్పడలేదు.

ఫొటో సోర్స్, fb/panabakalakshmi.offical
విధేయులూ హ్యాండిచ్చారు
అనేక మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 2014 ఎన్నికలకు ముందే టీడీపీ, బీజేపీ, వైసీపీలలో చేరిపోయారు. వెళ్లిన నేతలను తిరిగి వెనక్కి రప్పించేందుకు అధినాయకత్వం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఒకరిద్దరు మాత్రమే వచ్చారు.
2019 ఎన్నికల్లోగా పార్టీ తిరిగి పుంజుకుంటుందన్న ఆశాభావం కొందరు సీనియర్ నాయకుల్లో ఉండేది. కానీ, ఇటీవలి పరిణామాలు చూస్తే వారిలోనూ నమ్మకం సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పేరున్న కిశోర్ చంద్రదేవ్, కోట్ల సుర్యప్రకాశ్ రెడ్డి, పనబాక లక్ష్మి, నాదెండ్ల మనోహర్ లాంటి సీనియర్ నేతలు కూడా ఇటీవల పార్టీని వీడటమే అందుకు నిదర్శనం.
తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి పేరుకు పార్టీలోనే ఉన్నా, చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశలేదు. కానీ, మరో అయిదు పదేళ్లలో మళ్లీ బలమైన పార్టీగా మారే అవకాశాలు చాలా ఉన్నాయని సీనియర్ జర్నలిస్టు అప్పరసు కృష్ణారావు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలకు ఇదే ముగింపా?
- తెలంగాణలో ‘నమో’ సునామీ: టీఆర్ఎస్ గుర్తించాల్సిన పాఠాలు
- ‘అమరావతి ఒక సంచలన కుంభకోణం.. భూముల కొనుగోళ్లపై విచారణ జరుపుతాం’
- తెలుగుదేశం పార్టీ: గత వైభవాన్ని తీసుకురాగల నాయకుడెవరు
- BBC Fact Check: ‘చంద్ర దోషము వీడేనయ.. రాజన్న రాజ్యంబు వచ్చేనయ’.. ఇది నిజమేనా?
- జనసేన పార్టీ వైఫల్యానికి, పవన్ కల్యాణ్ ఓటమికి కారణాలేంటి?
- ఎడిటర్స్ కామెంట్: చంద్రబాబు ‘వ్యూహ చతురత’ పై వైఎస్ ‘విశ్వసనీయత’ విజయం
- గూగుల్ యాప్స్ లేని మొబైల్ ఫోన్ల భవిష్యత్ ఎలా ఉంటుంది?
- ఎవరెస్టుపై మరణాలకు కారణాలేంటి
- ఈ కప్ప గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తుంది
- హెరాక్లియాన్: సముద్రగర్భంలో కలిసిన ఈజిఫ్టు ప్రాచీన నగరం కథ
- ‘అమ్మ కూరగాయలు అమ్మి ఇచ్చిన డబ్బు.. రూ.500లతో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








