ఎన్నికలు 2019: VVPAT వల్ల ఈసారి ఆలస్యం కానున్న ఎన్నికల ఫలితాలు

ఫొటో సోర్స్, Getty Images
17వ లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ మే 23న జరగనుంది.
ఈ ఎన్నికల్లో మొదటిసారి దేశవ్యాప్తంగా వీవీప్యాట్(ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్)ను ఉపయోగించారు. దాంతో ఫలితాలు వెలువడడానికి కొన్ని గంటలు ఆలస్యం కానుంది.
చివరి ఫలితం రావడానికి కనీసం అయిదు నుంచి ఆరు గంటలు ఆలస్యం అవుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉమేష్ సిన్హా రాజ్యసభ టీవీలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో "ఈవీఎం కౌంటింగ్ పూర్తైన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీవీప్యాట్ రిజల్ట్ దానితో మ్యాచ్ చేసి చూస్తారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఈసారీ ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి అయిదు వీవీప్యాట్ మెషిన్లను, ఈవీఎం ఫలితాలను మ్యాచ్ చేసి చూస్తారు. ఇంతకు ముందు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక వీవీప్యాట్ మెషిన్ ఉపయోగించేవారు.
రాజకీయ పార్టీలు గత కొన్ని రోజులుగా ఓటింగ్ మెషిన్ల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఓటరు ఈవీఎంలో ఒక పార్టీకి ఓటు వేసినప్పుడు, అది పక్కాగా వారికే పడిందా, లేదా అనేది వీవీప్యాట్‌లో వచ్చిన స్లిప్‌ను చూసి తెలుసుకోవచ్చు. ఆ స్లిప్ తర్వాత సీల్డ్ బాక్స్‌లో పడిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
సగం ఓట్లను వీవీప్యాట్‌తో మ్యాచ్ చేయాలంటున్న విపక్షాలు
వీవీప్యాట్‌ను మొట్టమొదట నాగాలాండ్ నక్సన్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికలో ఉపయోగించారు. ఆ తర్వాత 2014లో పార్లమెంటు ఎన్నికల్లో ఈ మెషిన్‌ను లక్నో, గాంధీనగర్, దక్షిణ బెంగళూరు, మధ్య చెన్నై, జాదవ్‌పూర్, పట్నా సాహిబ్, మిజోరాంలో ఉపయోగించారు.
ఆ తర్వాత 2017లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీవీప్యాట్ మెషిన్లను ఉపయోగించారు.
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో మొదటిసారి ఈ మెషిన్లను దేశమంతా ఉపయోగించారు.
దాంతో, ఒక్కో నియోజకవర్గం నుంచి 50 శాతం ఓట్లను వీవీప్యాట్లతో మ్యాచ్ చేసి చూడాలని కోరుతూ 21 ప్రతిపక్ష పార్టీలు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాయి.
కానీ, 50 శాతం ఓట్లను వీవీప్యాట్లతో మ్యాచ్ చేసి చూడాలంటే కనీసం ఐదు రోజులుపడుతుందని, దానివల్ల ఫలితాలు ఆలస్యం అవుతాయని ఎన్నికల సంఘం చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టు తన తీర్పులో "ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచీ అయిదు ఈవీఎంలు, వీవీప్యాట్లలో పడిన ఓట్లను మ్యాచ్ చేసి చూడాలని" ఆదేశించింది.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయిదేసి వీవీప్యాట్లను రాండమ్‌గా అంటే ఒక క్రమం లేకుండా ఎంపిక చేస్తామని, ఆ ఈవీఎంలు, వీవీప్యాట్ల ఫలితాలను మ్యాచ్ చేసి చూస్తామని ఎన్నికల సంఘం చెబుతోంది.
ఈ పని కోసం కౌంటింగ్ హాల్‌లో వీవీప్యాట్ల కోసం బూత్ ఏర్పాటు చేశారు.
ఈవీఎంల కౌంటింగ్‌తోపాటు ఈసారీ వీవీప్యాట్లు కూడా మ్యాచ్ చేయాల్సి రావడంతో ఎన్నికల ఫలితాలు ఆలస్యం కానున్నాయి.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబు నాయుడు మరో హరికిషన్ సింగ్ సూర్జిత్ అవుతారా?
- స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలకు భద్రత ఎంత...
- రాహుల్ గాంధీకి ఈ ఎన్నికలే అంతిమ పోరాటమా...
- గాంధీ హత్యకు పది రోజుల ముందు గాడ్సే, ఆప్టే ఏం చేశారు...
- కేంద్రంలో ఎవరి ప్రభుత్వం వచ్చినా.. ఈ సమస్య ఎదుర్కోవాల్సిందే
- భారత లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పాకిస్తాన్లో ఉత్కంఠ ఎందుకు
- ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ ఏపీ, తెలంగాణల్లో ఎలా ఉన్నాయంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








