అయోధ్య కేసు: మధ్యవర్తుల కమిటీకి ఆగస్ట్ 15 వరకూ గడువు పెంచిన సుప్రీం కోర్టు

అయోధ్య

ఫొటో సోర్స్, Getty Images

అయోధ్య - బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించేందుకు నియమించిన కమిటీకి గడువును ఆగస్ట్ 15 వరకు పొడిగిస్తున్నట్లు సుప్రీం కోర్టు శుక్రవారం వెల్లడించింది.

త్రిసభ్య కమిటీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఈ కేసును విచారిస్తున్న అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు మధ్యవర్తుల కమిటీకి నేతృత్వం వహిస్తున్న సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా తమ నివేదికను కోర్టుకు సమర్పించారు.

మధ్యవర్తుల కమిటీ నుంచి తమకు నివేదిక అందిందని చెప్పిన జస్టిస్ రంజన్ గొగోయ్, "ఈ కేసులో ఇంతవరకూ సాధించిన పురోగతికి గురించి మేం వెల్లడి చేయదలచుకోలేదు. అది గోప్యంగా ఉంటుంది" అని అన్నారు.

జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్‌, జస్టిస్ అశోక్ భూషణ్‌, జస్టిస్ డివై చంద్రచూడ్‌లు సభ్యులుగా ఉన్నారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

అయోధ్య భూ వివాదానికి సామరస్య పరిష్కారం కనుగొనటం కోసం రాజ్యాంగ ధర్మాసనం మార్చి 8వ తేదీన కలీఫుల్లా నేతృత్వంలోని ఈ మధ్యవర్తుల కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీ శ్రీ రవిశంకర్, మద్రాస్ హైకోర్ట్ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు కమిటీ సభ్యులుగా ఉన్నారు.

మధ్యవర్తుల సంప్రదింపుల ప్రక్రియను ఎనిమిది వారాల్లోగా పూర్తిచేయాలని నాడు సుప్రీంకోర్టు నిర్దేశించింది.

శుక్రవారం ఈ అంశం విచారణకు వచ్చినపుడు కమిటీ అభ్యర్థన మేరకు అయోధ్య అంశానికి సామరస్య పరిష్కారం కనుగొనటానికి ఆగస్ట్ 15 వరకూ గడువు పొడిగిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

కమిటీ ప్రయత్నం సఫలమయ్యేలా చూడటానికి ఈ అంశంపై విచారణను అత్యంత గోప్యంగా నిర్వహించి తీరాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మధ్యవర్తుల సంప్రదింపులు ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో నిర్వహిస్తారని, మధ్యవర్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుందని కూడా ధర్మాసనం పేర్కొంది.

కమిటీలోకి అవసరమైతే ఇతర సభ్యులను తీసుకునే స్వేచ్ఛ కూడా మధ్యవర్తులకు ఉందని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయ సహాయం కూడా కోరవచ్చునని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)