కేసీఆర్: ‘మోదీ అట్టర్ ఫ్లాప్..’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, KalvakuntlaChandrashekarRao/fb
'ఈ ఐదేండ్ల కాలంలో మోదీ అట్టర్ ఫ్లాప్' అని కేసీఆర్ వ్యాఖ్యానించారంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
'దేశ ప్రజలకు ప్రధాని మోదీపై కొంత ఆశలుండేవి. సంపూర్ణమైన మెజార్టీ ఉన్నా.. ఈ ఐదేండ్ల కాలంలో ఆయన అట్టర్‌ఫ్లాప్ అయ్యారు. డెబ్బై ఏండ్ల నుంచి కాంగ్రెస్, బీజేపీలే పాలించినా దేశం అభివృద్ధి చెందలేదు. కచ్చితంగా వారికి దేశాన్ని బాగు చేయాలని లేదు' అని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
మెదక్ జిల్లా అల్లాదుర్గం చౌరస్తా, నర్సాపూర్‌లో బుధవారం నిర్వహించిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ప్రచార సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదన్నారు.
మమ్మల్ని గెలిపిస్తే నల్లధనాన్ని వెలికి తీసి ఒక్కో పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన నరేంద్ర మోదీ, అమిత్ షా రూపాయి కూడా వేయలేదని విమర్శించారు.
రూ.20లక్షల కోట్ల ప్రజాధనం రిజర్వు బ్యాంకు, మహారత్న కంపెనీకి చెందిన పలువురు వ్యాపారుల వద్ద మూలుగుతోందని, ఆ డబ్బును వినియోగంలోకి తేవడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయని అన్నారు.
నిన్న చాయ్‌వాలాగా ఉన్న మోదీ నేడు చౌకీదార్‌గా మారారని, కొత్త స్లోగన్లతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి డైలాగుల రాజ్యం మనకెందుకని కేసీఆర్ అన్నారంటూ నవతెలంగాణ పత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
వాట్సాప్ కొత్త ఆప్షన్! 3 రోజుల్లో స్పందించకుంటే...
కేంద్ర ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో 'వాట్సాప్' బుధవారం ఓ కీలక ఆప్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
ఇకపై ఏదైనా గ్రూప్‌లో ఎవరి పేరు చేర్చాలన్నా వారి అనుమతి అవసరం. లేదంటే యాడ్ చేసుకోవడం కుదరదు. వాట్సాప్ బుధవారం నుంచి అమల్లోకి తెచ్చిన తాజా ఆప్షన్ కోసం వినియోగదారుడు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ సెట్టింగ్స్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.
సెట్టింగ్స్‌లో 'నోబడీ, మై కాంటాక్ట్స్, ఎవ్రీఒన్' అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో 'నోబడీ'ని ఎంచుకుంటే మీ అనుమతి లేనిదే మిమ్మల్ని ఎవ్వరూ గ్రూప్‌లో చేర్చలేరు. 'మైకాంటాక్ట్స్'ను ఎంపిక చేసుకుంటే మీ ఫోన్ అడ్రస్‌బుక్‌లో ఉన్నవారు మాత్రమే గ్రూప్‌లో యాడ్ చేయగలరు.
ఈ రెండు ఆప్షన్లలో ఏది ఎంపిక చేసుకున్నా మిమ్మల్ని గ్రూప్‌లో చేర్చాలనుకునేవారి నుంచి మీకో సందేశం వస్తుంది. మూడురోజుల్లోగా దానికి 'ఓకే' చెబితేనే గ్రూప్‌లో చేరినట్లు. లేదంటే గ్రూప్‌లో చేర్చడం కుదరదు.
వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఉపయోగించేవారికి బుధవారం నుంచి ఈ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని, ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావాలంటే మరికొన్ని వారాలు పడుతుందని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపినట్లు ఈనాడు పేర్కొంది.

ఫొటో సోర్స్, ysrcongress.com
‘నా బిడ్డ ఎవరికీ భయపడడు..’
ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ అప్పట్లో సోనియా గాంధీనే ఎదిరించాడంటూ వైఎస్ విజయమ్మ అన్నారని సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
అక్రమ కేసులతో జైల్లో పెట్టినప్పుడే జగన్ భయపడలేదని, తను ఎవరి కాళ్లూ పట్టుకోడు.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోడని ఆమె వెల్లడించారు. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడని.. ఆయనది నీచమైన వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు.
బుధవారం విజయనగరం జిల్లాలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
‘‘చంద్రబాబు బీజేపీతో ఉన్నప్పుడు.. జగన్‌ను తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నాడు. ఇప్పుడు రాహుల్‌గాంధీ వెనకతిరుగుతూ.. జగన్‌ను బీజేపీ, కేసీఆర్ అంటున్నాడు. ప్రజలు ఒకసారి గమనించాలి.
25 మంది ఎంపీలను మనం గెలిపించుకుంటే.. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే జగన్ మద్దతిస్తాడు. అంతేగానీ ఎవ్వరితోనూ జగన్ పొత్తు పెట్టుకోడు. ఒకవేళ జగన్‌కు పొత్తు ఉందంటే అది ప్రజలతోనే’’ అని విజయమ్మ ప్రసంగించారంటూ సాక్షి పత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, fB/bsnlcorporate
54 వేల మంది ఉద్యోగులకు బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్వాసన!
54 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని బీఎస్ఎన్‌ఎల్ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. ఆ కథనంలో..
అప్పుల్లో కూరుకుపోయి సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి సైతం కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్.. మొత్తం ఉద్యోగుల్లో మూడో వంతు మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.
సంస్థ మనుగడను కాపాడేందుకు ఏర్పాటైన ప్రభుత్వ నిపుణుల కమిటీ చేసిన 10 ప్రతిపాదనల్లో మూడింటిని సంస్థ బోర్డు ఆమోదించింది.
వాటిలో ప్రధానమైనది 60 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయసును 58 ఏళ్లకు కుదించడం. దీనివల్ల 33,568 మంది ఉద్యోగాలు కోల్పోతారు. రాబోయే ఆరేళ్లలో సంస్థకు రూ.13,895 కోట్లు ఆదా అవుతాయి.
మరోటి 50 ఏళ్లు దాటిన ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) కల్పించడం. దీనివల్ల ఏటా రూ.1,921.24 కోట్లు మిగులుతాయి.
మూడోది ప్రైవేటు ఆపరేటర్లను ఎదుర్కొనడానికి, మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి వీలైనంత వేగంగా ఈ సంస్థకు 4జీ స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తారు.
ప్రస్తుతం బీఎస్ఎన్‌ఎల్‌లో 1,74,312 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. తాజా ప్రతిపాదనలతో 31 శాతం మంది.. అంటే, 54,451 ఉద్యోగాలు కోల్పోతారు. ఈ మూడింటిపై సార్వత్రిక ఎన్నికలు ముగిశాక టెలికం శాఖ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
- ఎవరిని చూసి జనం ఓటు వేస్తారు..? పార్టీయా, ముఖ్యమంత్రి అభ్యర్థా, స్థానిక అభ్యర్థా - ఏడీఆర్ సర్వేలో ఏం తెలిసింది?
- ఏపీ ఎన్నికల బరిలో ఇద్దరు హీరోయిన్లు
- నెలలు నిండకుండానే పిల్లలు ఎందుకు పుడతారు?
- Reality Check: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా...
- గూగుల్ ప్లస్ ఎందుకు మూతపడింది
- మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఎలా జరిగింది?
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
- అబార్షన్ పిల్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా రోజూ 10 మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








