అభినందన్ కోసం ఫేస్‌బుక్ కొత్త ఫీచర్‌ను ప్రారంభించిందనే ప్రచారంలో నిజమెంత ? :Fact Check

- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ గౌరవిస్తూ ఫేస్‌బుక్ ఒక కొత్త ఫీచర్ ప్రారంభించిందని సోషల్ మీడియాలో చాలా మంది చెబుతున్నారు
వేల మంది అలాంటి పోస్టును ఫేస్‌బుక్‌లో షేర్ కూడా చేశారు. అందులో "ఫేస్‌బుక్ పైలెట్ అభినందన్‌కు గౌరవం ఇచ్చింది. మీరు ఫేస్‌బుక్‌లో ఎక్కడ 'అభినందన్' అని టైప్ చేసినా, దాని రంగు కాషాయం రంగులోకి మారుతుంది. దానిపై క్లిక్ చేస్తే బెలూన్లు పగులుతాయి".. అని రాస్తున్నారు.
మితవాద వైఖరి ఉన్న చాలా పెద్ద ఫేస్‌బుక్ గ్రూప్స్‌లోనే కాకుండా షేర్ చాట్, వాట్సాప్‌లో కూడా ఈ మెసేజును వ్యాప్తి చేశారు.

ఫొటో సోర్స్, SM VIRAL POSTS
శుక్రవారం రాత్రి పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత భారత్ చేరుకున్న పైలెట్ అభినందన్ కోసం ఫేస్‌బుక్ ఈ కొత్త ఫీచర్ ప్రారంభించిందని వారంతా భావిస్తున్నారు.
వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ వైమానిక దళం ఫైటర్ విమానాలకు జవాబివ్వడానికి గత వారం ఎల్ఓసీ దాటి వెళ్లారు. అక్కడ ఆయన మిగ్-21 బైసన్ విమానం ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో అభినందన్‌ను అరెస్ట్ చేశారు.
ఇప్పుడు ఆయన సురక్షితంగా ఉన్నారు. దిల్లీలో ఉన్న ఆర్మీ హాస్పిటల్‌లో ఆయనకు గత రెండు రోజులుగా చికిత్స చేస్తున్నారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం వీలైనంత త్వరగా ఫైటర్ విమానం కాక్‌పిట్‌లో కూచోవాలని అభినందన్ తహతహలాడుతున్నారు.
కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేస్‌బుక్, అభినందన్‌కు సంబంధించిన వార్తలు నిజం కాదు.

ఫొటో సోర్స్, FACEBOOK
ఇదే 'టెక్ట్స్ డిలైట్'
ఫేస్‌బుక్‌లో ఈ ఫీచర్ భారత్, పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలకు కీలకంగా నిలిచిన వింగ్ కమాండర్ అభినందన్‌కు సంబంధించినదిగా భావించడం సరికాదు. ఎందుకంటే ఫేస్‌బుక్ 'టెక్ట్స్ డిలైట్' అనే పేరున్న ఈ ఫీచర్‌ను 2017 నుంచీ అందిస్తోంది.
'టెక్ట్స్ డిలైట్' ఫీచర్ ప్రకారం ఫేస్‌బుక్ 15కు పైగా భాషల్లోని ఎంపిక చేసిన మాటలు, వాక్యాలతో ఒక లిస్ట్ తయారు చేసింది.
వాటిని ఫేస్‌బుక్‌లో టైప్ చేస్తే, అవి మిగతా అక్షరాలకంటే పెద్దవిగా కనిపిస్తాయి. వాటి రంగు కూడా మారిపోతుంది. ఆ అక్షరాలను క్లిక్ చేస్తే ఫేస్‌బుక్ ఒక యానిమేషన్ ప్లే చేస్తుంది.
2018లో ఫిఫా వరల్డ్ కప్ సమయంలో కూడా ఫేస్‌బుక్ ఇలాంటి ఫీచర్ కింద ఒక యానిమేషన్ లాంచ్ చేసింది.
వరల్డ్ కప్ సమయంలో మన జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ జనం 'GOAL' అని టైప్ చేసినపుడు స్క్రీన్‌పై సంతోషంతో డ్యాన్స్ చేస్తున్న జనాల చేతులు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, FACEBOOK
ఈరోజు కూడా మనం ఫేస్‌బుక్‌లో ఇంగ్లీషులో కంగ్రాచులేషన్స్ అని టైప్ చేస్తే బెలూన్లు వచ్చినట్టే రకరకాల భాషల్లో కొన్ని పదాలకు చాలా రకాల యానిమేషన్లు కనిపిస్తాయి.
అలాగే హిందీలో చాలా పదాలకు రకరకాల పదాలకు ఇలాంటివి ఉన్నాయి.
అలాగే 'అభినందన్'( హిందీలో శుభాకాంక్షలు లేదా స్వాగతం) అనే పదాన్ని కూడా ఫేస్‌బుక్ రెండేళ్ల క్రితమే తమ వర్డ్ లిస్ట్‌లో చేర్చింది. హిందీలో 'అభినందన్' అని రాసి క్లిక్ చేస్తే బెలూన్లు కనిపిస్తాయి.
అలాగే తెలుగులో 'అభినందనలు' అని టైప్ చేసినా అది కాషాయంలోకి మారుతుంది. దానిపై క్లిక్ చేస్తే బెలూన్లు వస్తాయి.
నిజానికి, ఈ పదం టైప్ చేస్తే బెలూన్లు రావడానికి, వింగ్ కమాండర్ అభినందన్‌కు ఎలాంటి సంబంధం లేదు.
గత ఏడాది ఫేస్‌బుక్ 'టెక్ట్స్ డిలైట్' ఫీచర్ వల్ల ఒక వదంతి కూడా వ్యాపించింది.

ఫొటో సోర్స్, SM VIRAL POST
అప్పట్లో చాలా మంది ఫేస్‌బుక్‌లో BFF అని టైప్ చేసినపుడు దాని రంగు ఆకుపచ్చగా అయితే యూజర్ ఫేస్‌బుక్ అకౌంట్ సేఫ్ అనుకోవాలని కూడా ప్రచారం చేశారు.
BFF यानी Best Friend Forever ( ఎప్పటికీ మంచి స్నేహితుడు) కూడా ఒక 'టెక్ట్స్ డిలైట్' ఫీచర్‌లో ఒక మాటే. దానిని టైప్ చేయడం వల్ల దాని రంగు ఆకుపచ్చగా మారేది. దాన్ని క్లిక్ చేస్తే యానిమేషన్ ప్లే అయ్యేది. అందులో రెండు చేతులు చప్పట్లు కొడుతూ కనిపించేవి.
(ఇలాంటి వార్తలు, వీడియోలు, ఫొటోలు లేదా వాదనలు మీకు కూడా చేరి ఉండచ్చు. వాటిపై మీకు సందేహం ఉంటే వాటి వాస్తవాలు తెలుసుకోడానికి మీరు +91-9811520111 వాట్సాప్‌కు వాటిని BBC Newsకు పంపించవచ్చు లేదా ఇక్కడ క్లిక్ చేయండి)
ఇవి కూడా చదవండి.
- నరేంద్ర మోదీ వర్సెస్ ఇమ్రాన్ ఖాన్: ఇంతకీ ఈ ప్రచార యుద్ధంలో గెలిచిందెవరు...
- బిన్ లాడెన్: ఒసామా కొడుకు హమ్జా సమాచారం ఇస్తే 10 లక్షల డాలర్ల రివార్డు
- అభినందన్: విమానం నుంచి పడగానే ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షి కథనం - BBC EXCLUSIVE
- యుద్ధం వస్తే తెరపైకి అణు బాంబులు వస్తాయి : అభిప్రాయం
- ట్రంప్-కిమ్ సమావేశం ఎందుకు విఫలమైంది?
- విశాఖ రైల్వేజోన్: కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అసంతృప్తి ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








