ఎల్‌వోసీ: పాకిస్తాన్ పేల్చిన మోర్టార్ షెల్స్‌తో అక్కడి పిల్లలు ఆడుకుంటారు

షెల్ భాగం
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేను వేసుకున్న సేఫ్టీ జాకెట్‌ను చేత్తో నెమ్మదిగా తాకుతూ.. మరో చేతిని ముందుకు చాచి ''ఇందులో ఏముందో చూడు'' అంది ఆ పాప.

పాకిస్తాన్ వైపు నుంచి వచ్చిపడిన మోర్టార్ షెల్‌ శకలం అది. నల్ల రంగులో ఉండి ఇనుము వాసన వస్తోంది.

ఆ బాలిక దాన్ని ఏదో విజయం సాధించినంత ఆనందంతో నాకు చూపిస్తోంది.

ఆమె ముఖంపై చిరునవ్వు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ రోజు ఆమెకు ఇలాంటివి చాలా దొరకడంతో సంతోషం పట్టలేకపోతోంది.

ఇలాంటి బాంబులు, మోర్టార్ల ముక్కులు సేకరించే ఆటలో ఆ రోజు మిగతా అందరు పిల్లల కంటే తానే ముందున్నానన్న విజయగర్వం ఆమెలో కనిపిస్తోంది.

అవన్నీ పక్కకు విసిరేసి, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోమని నేను తనకు చెప్పాను. ఈ ముక్కల నుంచి రసాయన వాయువు విడుదలవుతుందని.. అది ప్రమాదకరమని ఒక పోలీసు అధికారి నాతో చెప్పడంతో అదే మాట ఆ పాపకు చెప్పాను. ఆ అమ్మాయి మాత్రం ముక్కలు పడేయకుండా, గుప్పిట్లో దాచుకుంది.

''నీకు భయమేయట్లేదా'' అని అడిగితే, ''నేను పెద్దయ్యాక పోలీసును అవుతా. అప్పుడు ధైర్యంగా ఉంటాను. నాకు భయమెందుకు'' అని బదులిచ్చింది.

కశ్మీర్‌లో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)కి సమీపాన కలాసియా గ్రామంలో పిల్లలకు తూటాలు, గన్‌పౌడర్‌ తరచూ కనిపిస్తుంటాయి. వాటిని వాడే వ్యక్తులు కూడా తారసపడుతుంటారు.

వీడియో క్యాప్షన్, వీడియో: ‘పిల్లలు పేలుడు పదార్థాల శకలాలతో ఆడుకొనే రోజులు పోవాలి... పుస్తకాలతో ఆడుకొనే రోజులు రావాలి’

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ఎల్‌వోసీ సమీపంలోని పాఠశాలలు, కళాశాలలు మూసేస్తుంటారు. చదువులు పూర్తయ్యాక వ్యవసాయ రంగాన్ని మినహాయిస్తే మరే రంగంలోనూ ఉపాధి, ఉద్యోగం లభించే అవకాశాలు అంతగా ఉండవు. అందువల్ల ఎక్కువ మంది యువత పోలీసు శాఖలో లేదా సైన్యంలో ఉండే ఉద్యోగాల్లో చేరాలనుకుంటారు.

మేం రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్‌లో ఉండే జీరో పాయింట్ వద్దకు వెళ్లాం. ఇక్కడి నుంచి ఎల్‌వోసీ వద్ద ఉండే భారత సైనిక శిబరాలు కనిపిస్తాయి.

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతటా ముప్పు పొంచి ఉంది. రెండు దేశాల మధ్య కాల్పుల్లో చాలా మంది ఆత్మీయులను కోల్పోయారు. ఈ బాధితుల్లో రతన్ లాల్ ఒకరు. కలాసియా గ్రామానికి చెందిన ఆయన భార్య ఇలాంటి కాల్పుల్లోనే చనిపోయారు.

రతన్ లాల్
ఫొటో క్యాప్షన్, రతన్ లాల్

యుద్ధం ఖరీదు?

కొందరు పొలంలో పనిచేస్తారని, మరికొందరు ఇతర పనులు చేసుకుంటారని, బాంబులు పడ్డప్పుడు పనుల్లో ఉన్నవారు సురక్షిత ప్రదేశాలకు వెంటనే చేరుకోలేరని రతన్ లాల్ ప్రస్తావించారు.

''నా భార్య నీళ్లు తేవడానికి బావి వద్దకు వెళ్లింది. అక్కడో బాంబు పడింది. తను అక్కడికక్కడే చనిపోయింది'' అంటూ ఆయన తన బాధను పంచుకున్నారు.

రతన్ లాల్ కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నారు.

సరైన విద్య లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలు సైన్యంలో చేరుతున్నారని రతన్ లాల్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ వైపు నుంచి నిరంతరం జరిగే కాల్పులు పిల్లల మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ''ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు పరీక్షలకు సరిగా సన్నద్ధం కాలేకపోతున్నారు. దిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల్లో చదువుకున్న పిల్లలతో ఈ పిల్లలు ఎలా పోటీపడగలరు. వీళ్లు వాళ్లతో ఎప్పటికీ పోటీపడలేరు'' అని ఆయన విచారం వ్యక్తంచేశారు.

సుదేశ్ కుమారి
ఫొటో క్యాప్షన్, సుదేశ్ కుమారి

గనేహా అనే మరో గ్రామానికి చెందిన సుదేశ్ కుమారి కొడుకు కూడా సైన్యంలో పనిచేస్తున్నారు. ఆయన ప్రస్తుతం శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

గనేహాలో సుదేశ్ కుమారి లాంటి స్థానికులకు తాము ఎప్పుడూ యుద్ధ క్షేత్రంలో ఉన్నట్లే ఉంటుంది.

ఆమె ఇంటికి చాలా చోట్ల రంధ్రాలు పడ్డాయి. అవి కాల్పుల వల్ల పడినవే. చుట్టూ అద్దాల ముక్కలు, శిథిలాలు కనిపించాయి.

మేము అక్కడి స్థానికులను కలవడానికి ముందు రోజు సాయంత్రం రెండు దేశాల మధ్య ఆరు గంటలపాటు కాల్పులు సాగాయి. ఆ షాక్ నుంచి వాళ్లెవరూ ఇంకా తేరుకోలేదు.

''కాల్పుల ధాటికి మా బంకర్ కూడా కంపించింది. పిల్లలు, పెద్దలు అందరం ఏడ్చాం. భయంతో వణికిపోయాం. మాకు అన్ని వైపులా కాల్పులు జరుగుతున్నాయి. పక్కకు కదల్లేకపోయాం'' అని సుదేశ్ కుమారి ఆందోళన నిండిన స్వరంతో చెప్పారు.

ఈ పరిస్థితుల వల్ల ఎటూ వెళ్లలేక సొంత ఇంట్లోనే బందీ అయినట్లు తనకు అనిపిస్తుందని సుదేశ్ కుమారి వ్యాఖ్యానించారు.

మహిళ

చాలామంది మహిళలు ఉద్రిక్తతలు పెరిగినా ఇళ్లను వీడటానికి ఇష్టపడరు. అక్కడి నుంచి వెళ్లిపోతే పిల్లల బాగోగులు, పశువుల ఆలనాపాలనా చూసుకోవడం కష్టమని వారు అనుకుంటారు.

పాఠశాలల్లో ఏర్పాటు చేసే తాత్కాలిక శిబిరాల్లో కొత్తవారితో కలసి ఉండటం కూడా ఇక్కడి మహిళలకు ఇబ్బందిగా అనిపిస్తుంది.

తమ గ్రామంలో బంకర్లు నిర్మించడం తమ అదృష్టమని సుదేశ్ కుమారి అనుకుంటారు. రతన్ లాల్ సహా అనేక మంది గ్రామీణులకు ఈ అవకాశం లేదు. వారి గ్రామాల్లో బంకర్లు లేవు.

సరిహద్దు గ్రామాల్లో 14 వేల బంకర్లు నిర్మిస్తామని నిరుడు ఆగస్టులో కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం 1,500 బంకర్లే నిర్మితమయ్యాయి.

రానున్న మూడు నెలల్లో మిగతా బంకర్ల నిర్మాణం పూర్తవుతుందని జమ్ము డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ చెప్పారు.

బంకర్లు ఉంటే భద్రత లభిస్తుంది. కానీ వాటిలో ఎక్కువసేపు ఉండాలంటే కష్టమే. ఒక్కో బంకర్లో 12 మందికి పైగా ఉంటారు.

బంకర్లో నీరు నిలిచిపోతే తేమ వల్ల ఊపిరి ఆడటం కష్టమవుతుంది. సుదేశ్ కుమారి ఇంటికి సమీపంలోని ఒక బంకర్లో ఓసారి ఇలాగే జరిగింది.

పెళ్లయ్యాక సుదేశ్ కుమారి గనేహాకు వచ్చారు. నియంత్రణ రేఖ సమీపంలో ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తుండటంపై ఆమెకు బాధ లేదు. అయితే ఈ పరిస్థితులతో ఆమె విసిగిపోయారు.

శాంతి సాకారమయ్యే రోజు కోసం తాను ఎదురుచూస్తున్నానని సుదేశ్ కుమారి చెప్పారు. ''శాంతి రావాలి. మేము ప్రాణాలు కాపాడుకొనేందుకు పరుగులు తీసే పరిస్థితులు పోవాలి. పిల్లలు షెల్ ముక్కలతో కాకుండా పుస్తకాలతో ఆడుకొనే రోజులు రావాలి'' అని ఆమె ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)