భారత్ -పాకిస్తాన్: కంభంపాటి నచికేత పాకిస్తాన్‌కు పట్టుబడినపుడు ఏం జరిగింది?

నచికేత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పటి ప్రధాని వాజ్‌పేయితో కె.నచికేత

"దేశ రక్షణ కోసం ఎప్పుడు అవసరమైనా తిరిగి ఆకాశంలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటానని" గ్రూప్ కెప్టెన్(రిటైర్డ్) నచికేత చెప్పారు.

1999 కార్గిల్ యుద్ధం జరిగినపుడు పాక్ దళాలకు చిక్కిన పైలట్ తర్వాత విడుదలయ్యారు.

అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాక్ ప్రకటించడానికి ముందు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ లెఫ్టినెంట్ కె.నచికేత బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తినితో మాట్లాడారు.

కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు బతాలిక్ సెక్టార్‌లో ఉన్న లక్ష్యాలపై బాంబులు వేయాలని నచికేతకు ఆదేశాలు అందాయి.

దాంతో వెంటనే ఆయన మిగ్ 27లో లక్ష్యాలవైపు దూసుకెళ్లారు. మధ్యలో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్‌తో ఆయన ఉన్న విమానాన్ని పాక్ దళాలు కూల్చేశాయి.

ఆ తర్వాత నచికేత 8 రోజులు పాకిస్తాన్ ఆర్మీ కస్టడీలో ఉన్నారు.

ప్రస్తుతం పాక్ దళాల కస్టడీలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్‌తో ఆ దేశం సైన్యం ఒక అధికారిలాగే ప్రవర్తించాలని నచికేత అన్నారు.

అభినందన్

ఫొటో సోర్స్, iSpr

ఫొటో క్యాప్షన్, వింగ్ కమాండర్ అభినందన్

జెనీవా ఒప్పందం ప్రకారం గౌరవించాలి

"అభినందన్ తన విధుల్లో ఉన్నప్పుడు యుద్ధ ఖైదీగా పట్టుబడ్డారు కాబట్టి, భారత్, పాక్ జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన్ను అధికారిగా గౌరవించాలని" తెలిపారు.

"సైన్యంలో ఉన్న ఎవరైనా తమ కమాండర్స్ నుంచి వచ్చిన దేశాలను వీలైనంత సమర్థంగా పూర్తి చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది".

ప్రస్తుతం పాక్ కస్టడీలో ఉన్న అభినందన్ సాహసాన్ని ప్రశంసించిన నచికేత ఆయన ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ వారియర్‌లాగే వ్యవహరించారని చెప్పారు.

పాక్ దళాలకు పట్టుబడిన వెంటనే అభినందన్ ఆలోచన ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు "ఎయిర్ ఫోర్స్ అధికారులందరికీ ఇలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇస్తారు. " అని తెలిపారు.

అయినా "ఒక పైలెట్ మనసు ఎప్పుడూ కాక్‌పిట్‌లోనే ఉంటుంది" అన్న నచికేత, వింగ్ కమాండర్ అభినందన్ వర్దమాన్ కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.

పాక్ సైన్యం తనను కస్టడీలోకి తీసుకున్నప్పుడు, తన అనుభవాలను చెప్పడానికి మాత్రం నచికేత నిరాకరించారు.

అభినందన్

ఫొటో సోర్స్, DGISPR

మీడియా ఉంటే కుదరదు

కానీ కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా ఉన్న జి.పార్థసారధి అప్పుడు నచికేతను ఎలా తిరిగి భారత్ తీసుకొచ్చారో చెప్పారు.

"కార్గిల్ యుద్ధ సమయంలో ఫ్లైట్ లెప్ఠినెంట్ నచికేత మిగ్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఉన్నారు. ఆయనను నియంత్రణ రేఖను దాటవద్దని ఆదేశించారు. యుద్ధం జరుగుతున్న సమయంలో నచికేత మిగ్‌తో దాడులు చేశారు. కానీ కిందకు వచ్చినపుడు మిసైల్ ట్రాక్ ద్వారా ఆయన్ను కిందికి దించారు. పాకిస్తాన్ సైన్యం ఆయన్ను అదుపులోకి తీసుకుంది.

కొన్ని రోజుల తర్వాత నాకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి సందేశం వచ్చింది. ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ నచికేతను విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.

"మేం ఆయన్ను విడుదల చేయాలని అనుకుంటున్నాం అన్నారు. నేను సరే, ఆయన్ను ఎక్కడ కలవాలి అన్నాను. దానికి నవాజ్ షరీఫ్ జిన్నా హాల్‌కు రండి అన్నారు".

"జిన్నా హాల్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్నట్టు నాకు తెలిసింది. దాంతో నేను ఆయన్ను మీరు నచికేతను తిరిగి అప్పగిస్తున్నప్పుడు అక్కడ మీడియా ఉంటుంది అన్నాను.

దానికి ఆయన 'అవును' అన్నారు. దానికి నేను అది కుదరదని చెప్పాను. యుద్ధ ఖైదీలను విడుదల చేస్తున్న సమయంలో మీడియా ఉండడాన్ని నేను ఎప్పటికీ అంగీకరించను అని చెప్పాను.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఫొటో క్యాప్షన్, మిరాజ్ 2000 యుద్ధ విమానం

ఇంటర్నేషనల్ మీడియా ముందు అతడిని అప్పగించడం కుదరదు అన్నాను. మీరు ఆయన్ను మాకు ప్రైవేటుగా అప్పగించాలని చెప్పాను. నేను దిల్లీకి కూడా ఈ విషయం చెప్పాను. అక్కడి నుంచి మీరు సరిగ్గానే చేశారని చెప్పారు.

"నాకు పాకిస్తాన్ వైపు నుంచి మళ్లీ ఫోన్ వచ్చింది. ఆయన్ను ఎలా విడుదల చేయాలో మీరే చెప్పండి అన్నారు. నేను చూడండి మీపై మాకు నమ్మకం పోయింది అన్నాను. మీరు నచికేతను రాయబార కార్యాలయంలో వదిలేయండి. తర్వాత నేను ఆయన చార్జ్ తీసుకుంటాను అని చెప్పాను. తర్వాత నచికేతను ఏంబసీకి తీసుకొచ్చారు. అక్కడ నేను ఆయన చార్జ్ తీసుకున్నాను.

"రాత్రి నచికేతను ఎయిర్ కమాండర్ జశ్వాల్ ఇంట్లో ఉంచారు. తర్వాత రోజు నేను మీరు విమానంలో వెళ్లడం లేదు అని ఆయనకు చెప్పాను. నేను నచికేతను ఒక ఎయిర్ అటాచీ, ఒక నావీ అటాచీ( దౌత్య అంశాల్లో భాగంగా ఉండే వైమానిక దళం, నౌకాదళం అధికారులు)తో ఒక వాహనంలో పంపించాను.

వాఘా దగ్గర మన సైన్యానికి అప్పగించమని చెప్పాను. నచికేత ఒకటి రెండు వారాలు పాకిస్తాన్ అదుపులో ఉన్నారు" అని పార్థసారధి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)