BeyondFakeNews: ‘నమ్మకమైన సమాచారం ప్రజలకు ఎంతో అవసరం’ - బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్

ఫేక్ న్యూస్ ఇప్పుడో పెద్ద సమస్యగా పరిణమించింది. దీనిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు బీబీసీ బియాండ్ ఫేక్ న్యూస్ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు ఈ రోజు ప్రారంభమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీలో #BeyondFakeNews సదస్సు జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో ఫేక్‌న్యూస్‌పై అవగాహన.. దాన్ని అడ్డుకునే మార్గాలపై మీడియా, సాంకేతిక రంగాల నిపుణులు చర్చించనున్నారు. ఆ వివరాలను Live అప్‌డేట్స్ రూపంలో ఇక్కడ చదవవచ్చు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 1
3.30
ఫేస్‌బుక్‌కు చెందిన మనీష్ ఖండూరీ దిల్లీలో మాట్లాడుతూ..
ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంగా ఫేస్‌బుక్ మంచి చేయాలని మాత్రమే అనుకుంటుంది.. తప్పుడు సమాచారం అనేది ఆ లక్ష్యానికి పూర్తి వ్యతిరేకమైనది. అందుకే తప్పుడు సమాచార నియంత్రణ కోసం జుకర్‌బర్గ్ చాలా బృందాలను నియమించారు.
బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ లండన్ నుంచి మాట్లాడుతూ..
3.15
అసలైన పాత్రికేయానికే విలువ ఉంటుంది.. పూర్తి విశ్వసనీయమైన సమాచారం లేకుంటే భవిష్యత్ గురించి నిర్ణయాలు తీసుకోలేం. మరీ ముఖ్యంగా మునుపెన్నడూ లేనంతగా ఆగ్రహం నిండిన ఈ ప్రపంచంలో నమ్మకమైన సమాచారం ప్రజలకు ఎంతో అవసరమని అన్నారు.

కె.శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ మాట్లాడుతూ...
1.30
రాజకీయ పార్టీలు ప్రత్యేకించి అధికార పార్టీలు సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నాయి. నియంత్రణ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో స్వేచ్ఛ గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
మీడియాలో పనిచేసే వారికి సున్నితత్వం ఉండాలి. అది లోపించినప్పుడు వచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో ప్రస్తుత మీడియాను చూసి అర్థం చేసుకోవచ్చు.
కొన్ని పూర్తిగా ద్వేషాన్ని ప్రచారం చేసే వెబ్‌సైట్లు ఉంటాయి. వాటిలోని కథనాల్లో రెండు వాక్యాలు చదవగానే వాటిని నమ్మకూడదని అర్థమవుతుంది.
మొత్తానికి మీడియాలో సున్నితత్వం, బాధ్యత తగ్గిపోతోంది. చాలా దయనీయమైన, విషాదమైన, దుర్మార్గమైన విషయాలను కూడా జోకుగా తీసుకోవడం, వాటితో ఆడుకోవడం, చమత్కారంగా శీర్షికలు పెట్టాలన్న అమానుషత్వం మీడియాలో పెరిగిపోయింది. మీడియా అలా మారడం వల్ల ప్రజలు సోషల్ మీడియా వైపు ఆసక్తి చూపిస్తున్నారని నా భావన.
పద్మజా షా, ఉస్మానియా విశ్వవిద్యాయలం రిటైర్డ్ ప్రొఫెసర్, జర్నలిజం మరియు కమ్యూనికేషన్ విభాగం
1. 20
ఓ పెద్ద సంస్థ వేలాది మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి వాటిని మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఉచితంగా పంపిణీ చేసింది. ఆ ఫోన్లలో ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించారు. అయితే, ఎన్నికలకు ముందు వాళ్లు ఫోన్లను ఎందుకు పంచుతున్నారని మాత్రం ఎవరూ ప్రశ్నించలేదు.
అలాంటి కార్యక్రమాలను నియంత్రించకపోతే, తప్పుడు సమాచారం వ్యాప్తి చెందేందుకు ఆ ఫోన్లు వేదికలుగా మారే ప్రమాదం ఉంటుంది.
ఆ ఫోన్లకు సందేశాలు, నకిలీ వార్తలు పంపుతూ ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం వార్తలు పూర్తిగా కొందరికి అనుకూలంగా మారుతున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

రాకేష్ రెడ్డి, Factly.in వ్యవస్థాపకులు మాట్లాడుతూ..
11.50 ఈ ఫేక్ న్యూస్‌ను ఎంత తొందరగా గుర్తించగలిగితే సమాజానికి అంత ఎక్కువ మేలు.
ఈ నకిలీ వార్తలకు వేదికలుగా నిలుస్తున్న వాట్సాప్ లాంటి సంస్థలు దీనికి బాధ్యత తీసుకుని, వాటిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలి.
ప్రస్తుతం ఫేక్ న్యూస్‌ను రిపోర్ట్ చేసేందుకు ఫేస్‌బుక్‌లో సదుపాయం ఉంది. అలాగే వాట్సాప్‌లోనూ ఉండాలి.
భారత్‌లో బీబీసీ చేయించిన సర్వేనే అతిపెద్దది. అలాగే, ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాలి. సమాజంలో ఫేక్ న్యూస్ పట్ల అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టాలి.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 2
11.40
ఫేక్ న్యూస్ విషయంలో ప్రధాన స్రవంతి మీడియా, డిజిటల్ మీడియా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కూడా పాత్రధారులే.
ప్రధాన స్రవంతి మీడియా మీద నమ్మకం పోవడం ఫేక్ న్యూస్ పెరగడానికి ప్రధాన కారణం.
ప్రధాన స్రవంతి మీడియా మీద నమ్మకం లేదు కాబట్టి, సోషల్ మీడియా మీద ఆధారపడాల్సి వస్తోందని మా పరిశోధనలో తేలింది.
నిరక్షరాస్యులు, 20 ఏళ్లకంటే తక్కువ వయసు ఉన్నవారు, 50 ఏళ్లకు పైబడిన వారు నకిలీ వార్తల ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నారు.

అంతకుముందు కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు ఏమన్నారంటే..
11.15 ఏది వాస్తవ వార్త, ఏది అవాస్తవ వార్త అనేది ఎలా గుర్తించాలో అర్థం చేసుకునేందుకు వీలుగా పాఠ్యాంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.
11.10 జర్మనీలో ఉన్న ఓ చట్టం ప్రకారం... సోషల్ మీడియాలో ఒక ఫేక్ న్యూస్ వచ్చిందని తేలితే ఆ సోషల్ మీడియా గ్రూపునకు మీద భారీ జరిమానా విధించాలని ఉంది. కానీ, అది ఫేక్ న్యూస్ అని పూర్తిస్థాయిలో గుర్తించడం అంత సులువు కాదు.

11.05 2014 ఎన్నికల ముందు సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఒక పార్టీని, నేతను పతనం చేసేందుకు సోషల్ మీడియాలో వేలాది ఖాతాలు, పేజీలు ఉన్నాయి. వాటిలో ప్రత్యర్థి పార్టీల నేతల మీద దుష్ప్రచారం చేసేందుకు జనాల మెదళ్లను మార్చి, ప్రేరేపించేలా పోస్టులు పెడుతున్నారు.
10.55 అవాస్తవ వార్తలపై యుద్ధం ప్రకటించిన బీబీసీకి అభినందనలు చెబుతున్నాను. ఫేక్ న్యూస్ ఎక్కడి నుంచి మొదలైందన్నది తెలుసుకునేందుకు నేను కాస్త పరిశోధించాను. నాకు మహాభారతంలో ఓ ఉదాహరణ దొరికింది.
మనకు అందిన విషయాలను ఇతరులకు పంపే ముందు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా చేయనప్పుడు మనం చదువుకోవడం ఎందుకు? ఈ విజ్ఞానం ఎందుకు? ఈ టెక్నాలజీ ఎందుకు?

ఫేక్ న్యూస్ వల్ల భారత్‌లో కనీసం 31 మంది మృతి చెందారని బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ అన్నారు. ఆయన ఈ సదస్సులో మాట్లాడుతున్నారు. బీబీసీ పరిశోధనలో వెల్లడైన వాస్తవాలను వివరించారు. వాటిలో కొన్ని ముఖ్యాంశాలు..
10.40 భారత దేశ కీర్తి పేరిట, హైందవ శక్తి పేరిట హైందవ కీర్తి పునరుద్ధరణ పేరిట ఫేక్ న్యూస్‌ను కొందరు ఏమాత్రం నిజానిజాల నిర్థరణ లేకుండా షేర్ చేసుకుంటున్నారు. ఈ సందేశాలను షేర్ చేస్తున్నపుడు వారు తాము జాతి నిర్మాణంలో భాగం పంచుకోవడం అనే కర్తవ్యం నిర్వహిస్తున్నామని భావిస్తున్నారు.
10.38 తమ నమ్మకాలకు దగ్గరగా ఉండే సందేశాలను చాలామంది మరోమారు ఆలోచించకుండా ఫార్వడ్ చేస్తుంటారు. డిజిటల్ మీడియా వేదికలు ఇలాంటి ఫేక్ న్యూస్‌కి వాహకాలుగా మారుతున్నాయి. తాను నమ్మే వ్యక్తి పంపిన వార్తలు నకిలీవి కావు అని చాలామంది అనుకుంటారు. దాంతో వారు ఆ వార్తల్లో నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయడంలేదు.

10.34 గేట్ కీపింగ్ లేని వ్యవస్థ డిజిటల్ మీడియం. తనిఖీలు లేకపోవడం వల్లే ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందుతోంది. ప్రజలకు వెంటనే తెలియజేయాలన్న బాధ్యత, సమూహాలకు చెందిన వారు తమ గుర్తింపు కోసం వచ్చిన ఫేక్ న్యూస్‌ను తనిఖీ చేయకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు.
10.28 ఫేక్ న్యూస్ సమాజంలో ఎన్ని అలజడులు సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నకిలీ వార్తల వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు దేశంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
రకరకాలుగా ఫేక్ న్యూస్ వ్యాపిస్తున్నాయి. ఫలానా లింకు క్లిక్ చేస్తే మీ ఫోన్ హాక్ అవుతుంది అనే సందేశం నుంచి, చంద్రుడిలో ఫలానా వ్యక్తి, లేదా దేవుడు, దేవత బొమ్మ కనిపిస్తోందంటూ వచ్చే చిన్నచిన్న మెసేజ్‌ల నుంచి... ప్రజల్లో అలజడి సృష్టించి అమాయకుల ప్రాణాలు తీయగల స్థాయి వరకు ఫేక్ న్యూస్ వ్యాపిస్తున్నాయి.

ఫేక్ న్యూస్‌ను అడ్డుకోకుంటే ఏమవుతుంది?
‘‘తప్పుడు సమాచారాన్ని అడ్డుకోకపోతే అది సమాజానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. నిజానిజాలను నిర్ధరించుకొని, సమగ్ర పరిశోధన, పరిశీలన జరిపిన తర్వాతే వార్తలు అందించే మీడియా సంస్థలపైనా ప్రజల్లో నమ్మకం సడలిపోయేలా చేస్తుంది.
ఫేక్ న్యూస్ సమస్యకు పరిష్కారం కేవలం ఒక్క కంపెనీతోనో, ఒక్క పరిశ్రమతోనో సాధ్యం కాదు.
అన్ని పక్షాలూ కలసికట్టుగా పనిచేస్తేనే ఈ సమస్యను ఎదుర్కోగలం.
అందుకే ఈ పోరాటంలో ప్రజలు, టెక్ కంపెనీలు, ఇతర మీడియా సంస్థలతో కలిసి సాగాలని బీబీసీ భావిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంస్థలు, విద్యాసంస్థలతో కలిసి పనిచేయడంపై దృష్టి సారించాం.
ఫేక్ న్యూస్‌ను కట్టడి చేసే విషయంలో విద్యార్థులు, యువతలో మీడియా గురించి అవగాహన పెంచడం తొలి అడుగు. ఇదో ముఖ్యమైన చర్య కూడా.
ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం బీబీసీకి గర్వకారణం. 'రియల్ న్యూస్'పై చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైంది.’’
- రూపా ఝా, హెడ్, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్

ఫేక్ న్యూస్‌ను ఎవరు సృష్టిస్తున్నారు? వాటిని ఎలా గుర్తించాలి?
ఫేక్ న్యూస్‌ను షేర్ చేసేవారిలో చాలా మంది దాని వల్ల తలెత్తే పరిణామాల గురించి ఆలోచించడం లేదు. వాళ్లు సదభిప్రాయంతోనే అలాంటి వార్తలను షేర్ చేస్తున్నా దాని వల్ల చాలా తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ఫేక్ న్యూస్ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారంటే ఫేక్ న్యూస్ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రండి.. ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి బీబీసీ చేస్తున్న కృషిలో భాగస్వాములు కండి.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది, 3
ఫేక్ న్యూస్‌కి సంబంధించిన మరింత సమాచారం అవగాహన కోసం కింది వార్తలను చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










