#Sisterhood: మహిళా జర్నలిస్టులకు అండగా ట్విటర్ క్యాంపైన్
ఆడవాళ్ల సమస్యలు ఆడవాళ్లకే తెలుస్తాయంటారు. రితుపర్ణ ఛటర్జీ అనే మహిళ కూడా అదే మాట నమ్ముతున్నారు. అందుకే మహిళా పాత్రికేయుల కోసం ‘సిస్టర్‌హుడ్’ పేరుతో ఆమె ఓ క్యాంపైన్ నిర్వహిస్తున్నారు.
రితుపర్ణ కూడా వృత్తి రీత్యా పాత్రికేయురాలే. దిల్లీలోని ఓ ప్రముఖ మీడియా సంస్థలో ఆమె పనిచేస్తున్నారు.
‘అమ్మాయిలకు ఉద్యోగాలు కాదు, వాళ్లతో మనసు విప్పి మాట్లాడే మనుషులు కావాలి. కెరీర్‌కు సంబంధించిన సలహాలు ఇచ్చే వ్యక్తులు కావాలి. అలాంటి వేదిక కల్పించే ఉద్దేశంతోనే ట్విటర్‌లో #Sisterhood పేరుతో ఓ క్యాంపైన్ మొదలుపెట్టా. అక్కడ మహిళా పాత్రికేయులు ఏ విషయాన్నైనా చర్చించొచ్చు. వాళ్లకు అనువైన సలహాలు ఇవ్వడానికి నాలాంటి చాలామంది అనుభవజ్ఙులు అక్కడ అందుబాటులో ఉన్నారు’ అని తన క్యాంపైన్ వెనకున్న కారణాలను వివరిస్తారు రితుపర్ణ.
ఆ క్యాంపైన్ ద్వారా లాభపడిన వాళ్లలో దీప్షిక అనే జర్నలిస్ట్ కూడా ఉన్నారు.

‘ఐదారేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా. ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలా లేక ప్రింట్ నుంచి ఆన్‌లైన్ మీడియాకు మారాలా అని ఆలోచిస్తున్నా. కెరీర్‌కు సంబంధించిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలు నన్ను వేధిస్తున్నాయి. వాటన్నింటి గురించి చర్చించడానికి సిస్టర్‌హుడ్ రూపంలో ఓ మంచి వేదిక దొరికింది’ అంటారు దీప్షిక.
దీప్షిక లానే రాజేశ్వరీ గణేశన్ అనే ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కూడా #sisterhood క్యాంపైన్ మహిళలకు చాలా ఉపయోగకరమని చెబుతారు.
‘చాలాసార్లు ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అమ్మాయిలకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి క్యాంపైన్‌లు మాలాంటి వాళ్లకు కొత్త మార్గాలు చూపిస్తాయి’ అంటారామె.
‘జీవితంలో నాకు ఎప్పుడు ఏ సలహా కావాలన్నా, సహాయం అవసరమైనా మహిళలనే ఆశ్రయించా. ఓ మహిళ మరో మహిళకు ఎప్పుడూ సహాయం చేస్తుందన్నది నా నమ్మకం. ‘సిస్టర్‌హుడ్’ క్యాంపైన్ వెనకున్న స్ఫూర్తి కూడా ఆ నమ్మకమే’ అని రితుపర్ణ వివరిస్తారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









