అభిప్రాయం: ఆర్‌ఎస్ఎస్ విస్తృత సమావేశాల వ్యూహం ఏమిటి?

ఆర్ఎస్ఎస్ సమావేశాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శేషాద్రి చారి
    • హోదా, బీబీసీ కోసం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపితమైనప్పటి నుంచీ అది సమాజానికి రాజకీయ కార్యకలాపాలే ఆద్యంతాలు కాదని విశ్వసించింది. అయితే, బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఉన్నపుడు, లేదంటే బీజేపీ రాజకీయ అవకాశాలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్‌ మీదకు ప్రధానంగా దృష్టి మరలుతుంది.

తొంబై మూడేళ్ల చరిత్ర ఉన్న తనకు బాహ్య రాజకీయ సంస్థ ఏదీ లేదని.. 1980లో ఏర్పాటైన బీజేపీ తమ రాజకీయ సంస్థ కాదని ఆర్ఎస్ఎస్ ఎంత చెప్పినప్పటికీ.. ఈ రెండు సంస్థల ప్రయోజనాలు కలగలసి ఉన్నాయన్న భావన అనివార్యంగా కనిపిస్తోంది.

ఆర్ఎస్ఎస్ 1949 ఆగస్టు 1న ఆమోదించుకున్న తన రాజ్యాంగం ప్రకారం.. ఆ సంస్థ మీద నిషేధాన్ని బేషరతుగా ఎత్తివేసిన తర్వాత.. ఆ సంస్థ రాజకీయాలకు దూరంగా ఉంటూ.. సామాజిక, సాంస్కృతిక రంగాలకు చెందిన కార్యకలాపాలకే స్పష్టంగా అంకితమైంది.

అయితే.. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులకు (సభ్యులకు) ఏ రాజకీయ పార్టీలోనైనా చేరటానికి.. ‘జాతీయేతర విధేయతలున్నటువంటి, లేదంటే తమ లక్ష్యాలను సాధించటానికి హింస లేదా రహస్య మార్గాలను అనుసరించే సంస్థలు మినహా’.. ఏ సంస్థతో అయినా పనిచేయటానికి స్వేచ్ఛ ఉంది.

విషాదకరమైన దేశ విభజనకు దారితీసిన ఘటనలు.. విభజించి పాలించే బ్రిటిష్ విధానానికి తోడ్పడ్డ ఇండియన్ ముస్లిం లీగ్, కమ్యూనిస్టులు, దేశంలోని పలు ప్రాంతాల్లో గల ఇతర సంస్థల పాత్రను బట్టి చూస్తే.. అటువంటి సంస్థలు, పార్టీలతో సంబంధాలు కలిగివుండరాదని నిషేధించే ఆర్ఎస్ఎస్ నిబంధన చాలా హేతుబద్ధంగా సహజంగా కనిపిస్తుంది.

మోహన్ భాగవత్

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్ష ఉద్యమ నాయకులు.. మహాత్మా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ స్వాతంత్ర్య పోరాటంలో మత ధోరణుల పట్ల తమ ద్వేషాన్ని ఏమాత్రం దాచుకోలేదు.

1934 లోనే కమ్యూనిస్ట్ పార్టీ మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం ప్రారంభించి.. ‘గాంధీ బహిష్కరణ కమిటీ’ని ఏర్పాటు చేసి, దానిని తర్వాత ‘లీగ్ అగైన్స్ గాంధీయిజం (గాంధీతత్వానికి వ్యతిరేక కూటమి)’గా మార్చింది.

బ్రిటిష్ వారిపట్ల మహాత్మా గాంధీ మెత్తగా వ్యవహరిస్తున్నారని, రైతులు, కార్మికుల ప్రయోజనాలపై ఆయన రాజీ పడ్డారని, వలసవాదులకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభించటానికి మతాన్ని ఒక నమూనాగా వాడుకున్నారని కమ్యూనిస్టులు ఆరోపించారు.

మహాత్మా గాంధీ కూడా కమ్యూనిస్టులు ఉపయోగించే హింస, సూత్రబద్ధతలేని మార్గాల పట్ల తన అసౌకర్యాన్ని వ్యక్తంచేశారు. [‘‘కమ్యూనిస్టులకు తమ పార్టీని సజీవంగా ఉంచుకోవటం మినహా ఎటువంటి సూత్రాలూ లేవని, వారు తమ ప్రత్యర్థులను తమ చేతులకు ఏ కర్ర దొరికితే దానితో కొడతారని.. నిజాయితీపరులైన కాంగ్రెస్ వాదులు చాలా మంది నాకు చెప్పటమో.. లేఖలు రాయటమో చేశారు.’’ (లేఖ నం. 721, పేజి నం. 413). ‘‘ఆ (కమ్యూనిస్ట్) పార్టీ తన పద్ధతుల్లో విలువలు పాటించదని, చివరికి హింసకు కూడా తెగబడుతుందనే వార్తలు కాంగ్రెస్‌వాళ్లు దాదాపు రోజూ నా చెవుల్లో గుమ్మరించేవారు.’’ (లేఖ నం. 658. 1945 ఆగస్టు 21వ తేదీన పి.సి.జోషికి రాసిన లేఖ) http://www.gandhiserve.org/cwmg/VOL086.PDF]

ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీని అనుకరిస్తూ, ఆర్ఎస్ఎస్ అహింసా సూత్రాలతో తన సంస్థకు రూపాన్నిచ్చింది. హిందూ సమాజంలో సహజసిద్ధమైన మత స్వభావాన్ని గుర్తించింది. గాంధీ లాగానే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.బి.హెగ్డేవార్ కూడా.. హిందువులు కులం, ఇతర గుర్తింపులను అధిగమించి హిందువులుగా సమైక్యం కావలసి ఉందన్న ఆలోచనకు వచ్చారు. కులం, భాష, ప్రాంతీయ (రాష్ట్ర) గుర్తింపుల ప్రాధాన్యతను చిన్నచూపు చూడకుండానే, సవాలు చేయకుండానే.. ఆ తేడాలను చెరిపివేస్తూ ‘హిందూ గుర్తింపు’ను ఉద్ఘాటించటాన్ని.. ఆర్ఎస్ఎస్ రోజువారీ కార్యకలాపాల్లో.. అంటే శాఖలో వ్యూహాత్మకంగా సమ్మిళితం చేశారు.

ఆర్ఎస్ఎస్ సమావేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుతం దేశంలో ఇటువంటి రోజువారీ సమావేశాలు (శాఖలు) 50 వేలకు పైగా జరుగుతున్నాయి. మరో 30 వేల పైచిలుకు వార సమావేశాలు, ఇతర తరహా బృంద సమావేశాలు జరుగుతున్నాయి. అన్నీ కలిపితే ప్రతి రోజూ.. భావసారూప్యం గల పది లక్షల మందికి పైగా పౌరులు.. ఆర్ఎస్ఎస్ అజెండాను ముందుకు తీసుకెళ్లటానికి సమైక్యంగా పనిచేస్తున్నారు.

అదీగాక.. ఆర్ఎస్ఎస్ వేలాది మంది పౌరులకు స్ఫూర్తినిచ్చింది. సమాజంలోని ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉందని.. ప్రతి వ్యక్తీ ఏదో ఒక సమస్యకు పరిష్కారమనే ఆర్ఎస్ఎస్ విశ్వాసానికి అనుగుణంగా.. వారు సమాజంలోని ప్రతి రంగంలోనూ.. గ్రామీణ, గిరిజన సంక్షేమం మొదలుకుని శాస్త్ర, సాంకేతికతలను వ్యాప్తిచేయటం వరకూ.. వందలాది స్వచ్ఛంద సంస్థలను ప్రారంభించారు.

ఆర్ఎస్ఎస్ దేశం వెలుపల కూడా తన వ్యవస్థను విస్తరించింది. ప్రపంచంలో వందకు పైగా దేశాల్లో ఆర్ఎస్ఎస్ ఉనికి ఉంది. ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకత్వం తరచుగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తుంటుంది. అయా దేశాల్లో స్థిరపడ్డ వారిని.. వసుధైక కుటుంబం అనే వేద వాక్యం నిజస్ఫూర్తితో.. ఆ దేశానికీ, తమ మాతృదేశానికి సానుకూలంగా దోహదపడేలా స్ఫూర్తినిస్తుంటారు.

సేవాతత్పరతతో రగిలే అంకితభావం గల, నిస్వార్థపరులైన.. సంప్రదాయాలు, విలువలు, సూత్రాలతో బలంగా లోతుగా వేళ్లూనుకున్న కార్యకర్తలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆర్ఎస్ఎస్ శక్తి.. తన ప్రణాళికను రాజకీయ తీర్పు ద్వారా సాకారం చేయగల మలచగల ఎటువంటి సంస్థకైనా నిశ్చయమైన ఆస్తే అవుతుంది.

ఆర్ఎస్ఎస్ సమావేశాలు

ఫొటో సోర్స్, Getty Images

అయినప్పటికీ.. ఆర్ఎస్ఎస్ తనకు తానుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంది. అయితే.. రాజకీయ పార్టీలు కానీ, సమాజానికి మేలు చేయటానికి సంస్థ శక్తిని ఉపయోగించాలని భావించే ఎవరికైనా తన శక్తిని పంచివ్వటానికి విముఖంగా లేదు.

తన ఆలోచనలు, ఆకాంక్షలను సమాజంలోని విస్తృత భాగంతో పంచుకోవటానికి.. ఆర్ఎస్ఎస్ నాయకత్వం తరచుగా.. ఆర్ఎస్‌ఎస్‌ అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ ఉండే ఆసక్తిగల పౌరులు, ఆలోచనాపరులు, కార్యకర్తలు, సంస్థలతో సమావేశాలు నిర్వహిస్తోంది.

ఈ నేపథ్యంలోనే.. సమాజంలో కొందరు ప్రభావవంతులతో ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మూడు రోజుల పాటు బహిరంగ ఉపన్యాస కార్యక్రమం నిర్వహిస్తోంది వారి అభిప్రాయాలు, ఆలోచనలు ముఖ్యమైనవే కాదు.. అవి సమాజ సంక్షేమం మీద గణనీయమైన ప్రభావం చూపుతాయి. మంచి మార్పు దిశగా మళ్లించగల సామర్థ్యం ఉన్నవి.

తన శక్తి, విస్తరణలను కేవలం పెరుగుతున్న తన శాఖలు, వాటిలో హాజరు సంఖ్యలతో మాత్రమే లెక్కించగలమన్న వాస్తవం మీద ఆర్ఎస్‌ఎస్‌కు పూర్తి అవగాహన ఉంది. అయినప్పటికీ.. అపార్థాలను తొలగించటానికి, మద్దతు పునాదిని విస్తరించుకోవటానికి.. ఆర్ఎస్ఎస్ ఇటువంటి సమావేశాల ద్వారా విస్తృత, విభిన్న శ్రోతలను చేరుకోవాల్సిన అవసరం ఉంది.

(రచయిత సీనియర్ ఆర్ఎస్ఎస్ సభ్యుడు, ఆర్ఎస్ఎస్ ఇంగ్లిష్ వారపత్రిక ‘ఆర్గనైజర్’ మాజీ సంపాదకుడు.)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)