సుప్రీంకోర్టు: ప్రియా ప్రకాశ్ వారియర్ దైవ దూషణకు పాల్పడలేదు.. ‘పాటపై కేసు పెట్టడం తప్ప మీకేమీ పనిలేదా?’

ప్రియా ప్రకాశ్

ఫొటో సోర్స్, Muzik247/video grab

ఒక సినిమా సన్నివేశంలో ప్రియా ప్రకాశ్ వారియర్ దైవ దూషణకు పాల్పడ్డారంటూ ఓ ముస్లిం సంస్థ చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రియా వారియర్‌పై దాఖలైన కేసును కొట్టేసింది.

కేరళకు చెందిన వర్థమాన నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్ కన్ను కొట్టిన ఒక పాట ఈ ఏడాది వైరల్ అయిన సంగతి తెలిసిందే.

మహ్మద్ ప్రవక్త భార్యను ప్రస్తావిస్తున్న 'పవిత్రమైన పాట'లో కన్ను గీటడం, ముసిముసి నవ్వులు రువ్వటం దైవ దూషణ చర్యే అవుతుందని పిటిషనర్లు ఆరోపించారు.

దీనికి ప్రియా వారియర్ సమాధానం ఇస్తూ.. పిటిషనర్లు పాటను అపార్థం చేసుకున్నారని తెలిపారు.

చిత్రంలో నుంచి ఈ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తూ కొందరు ఫిర్యాదు చేయగా.. ప్రియా ప్రకాశ్‌ వారియర్, చిత్ర నిర్మాత, దర్శకుడిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ప్రియా ప్రకాశ్‌ వారియర్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇలాంటి పాటలో ఒక పాఠశాల విద్యార్థి, విద్యార్థిని ఒకరినొకరు చూస్తూ.. ముసిముసి నవ్వులు రువ్వటం, కనుబొమలు ఎగరేయటం, కన్ను కొట్టడం దైవ దూషణ చర్యలే అవుతాయని పిటిషనర్లు తెలిపారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరిపింది. ''ఒక సినిమాలో ఎవరో పాట పాడితే దానిపై కేసు పెట్టడం మినహా మీకేమీ పనిలేదా?'' అని ప్రశ్నిస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా ఈ కేసును కొట్టేశారు.

వీడియో క్యాప్షన్, వీడియో: అందం అంటే బాహ్య సౌందర్యమే కాదు

చిలిపితనాన్నీ, అమాయకత్వాన్నీ, ప్రేమనూ ఒకేసారి.. అదీ కేవలం 26 సెకన్ల నిడివిలో కలబోసి చూపే ఓ వీడియో క్లిప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వైరల్ కావడంతో కేరళకు చెందిన ప్రియా ప్రకాశ్ రాత్రికి రాత్రే కోట్లాది యువకుల కలలరాణి అయ్యారు.

'ఒరు అదర లవ్' అనే మలయాళ సినిమాలోని 'మాణిక్య మలరయ పూవి' పాటలోని క్లిప్ అది.

ఈ క్లిప్‌లో ఆమె హావభావాలతో.. ముఖ్యంగా కన్నుగీటే కొన్ని సెకండ్ల క్లిప్‌తో రకరకాల వీడియోలు, జిఫ్‌లు, స్పూఫ్‌లు తయారు చేసిన యూజర్లు సోషల్ మీడియాను ముంచెత్తారు. ప్రియా ప్రకాశ్ వారియర్‌ను భారతదేశ 'జాతీయ కలల రాణి'గా అభివర్ణించారు.

'ఒరు అదర లవ్' చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక విద్యార్థినిగా నటించారు.

కేసులు, న్యాయ వివాదం కారణంగా ఈ సినిమా విడుదల సెప్టెంబర్‌కు వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)