వరంగల్: బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడుకు కారణాలివే

ఫొటో సోర్స్, బందెల రాజేంద్ర ప్రసాద్
వరంగల్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న టపాసుల తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో ఎనిమిది మంది చనిపోయారు.
ముగ్గురు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మరో 9 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
గీసుకొండ మండలం కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్‌లో బుధవారం ఈ పేలుడు జరిగింది.
పేలుడుకు దారి తీసిన కారణాలను తెలుసుకునేందుకు బందెల రాజేంద్ర ప్రసాద్ బీబీసీ కోసం క్షేత్రస్థాయికి వెళ్లారు.
అక్కడ స్థానికులు, అధికారులతో మాట్లాడారు. వారు చెప్పిన వివరాల మేరకు ప్రమాదానికి దారి తీసిన కారణాలివీ.

ఫొటో సోర్స్, బందెల రాజేంద్ర ప్రసాద్
1. టపాసులు తయారు చేయడం
పేలుడు జరిగిన భధ్రకాళి ఫైర్ వర్క్స్‌కి టపాసులు తయారు చేసేందుకు అనుమతి లేదు. 'దీనికి కేవలం టపాసులను తీసుకొచ్చి అమ్ముకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ తయారు చేయడానికి అనుమతి లేదు.' అని జిల్లా అగ్నిమాపక శాఖ ఇంఛార్జ్ జి.భగవాన్ రెడ్డి చెప్పారు. కార్మికులకు మాస్కులు, సరైన రక్షణ కవచాలు లేవన్నారు.
2.గతంలో జరిగినా పట్టించుకోలేదు
ఈ టపాసుల తయారీ కేంద్రంలో గతంలోనూ పలుమార్లు పేలుళ్లు జరిగాయి. కార్మికులు గాయపడ్డారు. ఆ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఈ అంశంపై పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు స్థానికులు మాట్లాడుతూ.. '2010లోనూ పేలుడు జరిగింది. కొందరు గాయపడ్డారు కూడా. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు' అని వివరించారు.

ఫొటో సోర్స్, బందెల రాజేంద్ర ప్రసాద్
3.అగ్నిమాపక వ్యవస్థ లేదు
ఈ కర్మాగారంలో పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నా సరైన అగ్నిమాపక వ్యవస్థ లేదు. అగ్నిమాపక వ్యవస్థ ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని జి.భగవాన్ రెడ్డి వెల్లడించారు. అగ్నిప్రమాదం జరిగితే మంటలు అదుపుచేసేందుకు నీళ్లు వచ్చేలా ఇక్కడ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని వివరించారు.
4.పక్కా నిర్మాణమూ కాదు
బాణాసంచా తయారీ కేంద్రం రేకుల షెడ్డులో నడుస్తోంది. ఇది కూడా ప్రాణ నష్టానికి ఓ కారణమై ఉండొచ్చని అగ్నిమాపక దళ అధికారులు వివరించారు. నిర్మాణం భారీగా.. నిబంధనలకు అనుగుణంగా ఉంటే.. మంటలు అంత త్వరగా వ్యాప్తిచెందకపోయేవని, ఇంత భారీ పేలుడు జరిగి ఉండేది కాదని వారు చెబుతున్నారు. అలాగే ఇక్కడ విద్యుత్తు వైరింగ్ కూడా సరిగ్గా లేదని వారు చెప్పారు.

ఫొటో సోర్స్, బందెల రాజేంద్ర ప్రసాద్
5.పెద్ద బాంబుల తయారీ
ఇక్కడ చిన్న స్థాయి టపాసులు కాకుండా.. భారీ స్థాయిలో బాంబులను కూడా తయారు చేస్తున్నారని, అది కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి ఓ కారణమై ఉండొచ్చని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాద తీవ్రత అయిదు జిలెటెన్ స్టిక్కులు పేలినంత స్థాయిలో ఉందని వివరించారు. అందువల్లే రెండు కిలోమీటర్ల దూరంలోని ఇళ్లకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయని వివరించారు.
6.రాజకీయ సంబంధాలు
తాజా ప్రమాదానికి పరోక్షంగా రాజకీయాలు కూడా ఒక కారణమని స్థానికులు చెబుతున్నారు. తయారీ కేంద్ర యజమానికి రాజకీయ నాయకులతో సత్సంబంధాలున్నాయని, అందువల్లే గతంలో ప్రమాదాలు జరిగినా ఎవరూ పట్టించుకోలేదన్న వాదనా వినిపిస్తోంది. ఏళ్ల తరబడి ఇక్కడ టపాసులు తయారు చేస్తున్నారంటే దానికి ఆయన రాజకీయ పలుకుబడి కూడా ఓ కారణమే అని అగ్ని మాపక శాఖ అధికారి భగవాన్‌రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, బందెల రాజేంద్ర ప్రసాద్
చనిపోయింది 8 మందా? లేక 11 మందా?
స్థానిక మీడియా మొత్తం 11 మంది చనిపోయినట్లు చెబుతోంది. కాని 8 మంది చనిపోయారు మరో ముగ్గురిని గాయాలతో ఆస్పత్రికి తరలించామని ప్రభుత్వం చెబుతోంది. స్థానికుల సమాచారం మేరకు ఇక్కడ 25 మంది పని చేస్తున్నారు. వీరిలో అయిదుగురు బుధవారం పనికి రాలేదు. 20 మంది పనికి వచ్చారు. వీరిలో 8 మంది చనిపోగా మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. 9 మంది ఆచూకీ లభ్యం కాలేదు.

ఫొటో సోర్స్, బందెల రాజేంద్ర ప్రసాద్
అసలేం జరిగింది?
రోజూలాగే కూలీలంతా బుధవారం ఉదయం వారి పిల్లాపాపల్ని స్కూలుకు పంపించి భద్రకాళి ఫైర్ వర్క్స్ షాపులో విధులకు హాజరయ్యారు. ఎప్పటిలాగే విధులు నిర్వహిస్తున్నారు. టపాసుల తయారీలో నిమగ్నమయ్యారు. ఉదయం 11 గంటలకు అనుకోకుండా భారీ శబ్దం వచ్చింది. ఓ గంటపాటు ఆ ప్రాంతంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియని పరిస్థితి. సుమారు 2 కిలో మీటర్ల వరకు పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు, పరుగులు తీసి కేకలు పెట్టారు. ఆకాశమెత్తు పొగలు, మంటలు చెలరేగడంతో ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించి ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని ఎంజీఎంకు తరలించారు. ముక్కలై పడివున్న మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి పంపించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, డబుల్ బెడ్ రూం ఇల్లు పరిహారంగా ప్రకటించారు.
భద్రకాళి ఫైర్ వర్క్స్ షాపులో పేలుడు ఘటన జరిగిన వెంటనే పరారీలో వున్నయజమాని గుండ్లపల్లి రాజుకుమార్‌ను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్, వరంగల్ జిల్లా రూరల్ కలెక్టర్ హరిత చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








