'వేయి గొంతుల' నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

ఫొటో సోర్స్, Facebook/Nerella Venumadhav
ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం ఉదయం వరంగల్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. నేరెళ్ల 1932 డిసెంబరు 28న వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో జన్మించారు. ఆయనకు 85 సంవత్సరాలు.
తన అభిమాన నటుడు చిత్తూరు నాగయ్యను అనుకరిస్తూ మొదలైన ధ్వన్యనుకరణ విద్యను తనకు పర్యాయపదంగా మార్చుకున్న కళాకారుడు, గళాకారుడు ఆయన.
టీవీలు వీడియోలు లేని రోజుల్లో వేదికల మీదో, రేడియోలోనే వినపడిన గొంతులను ప్రాక్టీస్ చేసి ఆ నాయకులకే వినిపించి అబ్బురపరిచిన కళాకారుడు ఆయన.
ప్రఖ్యాత ఆంగ్ల సినిమా టెన్ కమాండ్మెంట్స్ ధ్వనుల అనుకరణ ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్.
నేరెళ్ల ఒకట్రెండు భాషలకే పరిమితం కాలేదు. ఆయన తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, తమిళం భాషల్లో ప్రదర్శనలిచ్చేవారు.
మిమిక్రీ కళను అంతెత్తుకు తీసికెళ్లి తెలుగు ప్రతిభకు అంతర్జాతీయంగా పట్టం కట్టిన వేణుమాధవ్‌ను తెలుగు సాంస్కృతిక ప్రపంచం ప్రేమగా, గౌరవంగా తల్చుకుంటోందని పలువురు కళాకారులు తెలిపారు.
ధ్వన్యనుకరణలో సుప్రసిద్ధులైన నేరెళ్ల 16 ఏళ్లకే కెరీర్ ప్రారంభించారు. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన దేశ, విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మిమిక్రీ ప్రదర్శన ఇచ్చిన తొలి కళాకారుడు ఆయనే.
2017లో నేరెళ్ల వేణుమాధవ్ పేరుతో పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 28వ తేదీని తెలుగు రాష్ట్రాల్లో 'మిమిక్రీ డే'గా జరుపుకుంటారు.

ఫొటో సోర్స్, Facebook/Nerella Venumadhav
''ఆయన తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య మిమిక్రీ కళాకారుడు. వేయిగొంతుల వేణుమాధవుడు ఆయన. ఆయన కొంత కాలంగా పార్కిన్సన్, వృద్ధాప్య సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు'' అని నేరెళ్ల కుటుంబ సభ్యులు మీడియాతో చెప్పారు.
నేరెళ్లకు నలుగురు సంతానం. వారిలో ఒకరైన లక్ష్మీతులసి తన తండ్రి నుంచి మిమిక్రీ కళను నేర్చుకున్నారు. ఆమె వైద్యురాలిగా స్థిరపడ్డారు.
భాషపై పట్టు ఉండాలన్న నేరెళ్ల
తాను చిన్న వయసులో ఉన్నప్పుడు తమ ఇంటికి వచ్చే స్నేహితులు, ఇరుగుపొరుగువారి గొంతులను అనుకరించేవాడినని నేరెళ్ల దాదాపు రెండేళ్ల క్రితం 'ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
''కెరీర్ ప్రారంభించిన కొన్నేళ్లలోనే నాకు అంత ప్రజాదరణ లభిస్తుందని కలలోనైనా అనుకోలేదు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి లాంటి చాలా మంది గొప్పవారిని కలుసుకొనే అవకాశం, వారి గొంతులను అనుకరించే అవకాశం నాకు లభించాయి'' అని ఆయన తెలిపారు.
భాషపై పట్టు సాధించాలని, నేర్చుకున్నది నిలుపుకోవాలని ఔత్సాహిక కళాకారులకు ఆయన సూచించారు. రాత్రి నిద్రలోంచి లేపినా ధ్వన్యనుకరణ చేయగలగాలని చెప్పారు.
వందల మంది ఔత్సాహికులకు మిమిక్రీ కళను నేర్పించిన నేరెళ్ల వినమ్రత, నిజాయతీ కలిగిన ఆచార్యుడని ప్రముఖ రచయిత 'అంపశయ్య' నవీన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Facebook/Nerella Venumadhav
'ఆయన మహోన్నత కళాకారుడు.. మహోన్నత వ్యక్తి'
''నేరెళ్ల ఎంత మహోన్నత కళాకారుడో అంత మహోన్నత వ్యక్తి'' అని మిమిక్రీ కళాకారుడు జనార్దన్ బీబీసీతో చెప్పారు. భారత్‌లో మిమిక్రీ కళకు ఆయన ఆద్యులని, ఎంతో మంది ప్రముఖులు సహా కనీసం 100 మంది గొంతులను యథాతథంగా అనుకరించేవారని తెలిపారు. చాలా శబ్దాలనూ అనుకరించేవారని చెప్పారు.
భారత్‌లో అనుకరించి నవ్వించే కళగా మాత్రమే ఉన్న మిమిక్రీని ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత నేరెళ్లదేనని జనార్దన్ ప్రస్తావించారు. ''ఆయన చిన్నప్పుడు ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నారు. అయినా ఆయన అమెరికా, బ్రిటన్ ఇంగ్లిష్ ఉచ్చారణలతో కూడా గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన సొంతంగా ఈ కళను సాధన చేశారు. స్వీయ పరిశీలన, అధ్యయనంతో తనను తాను మెరుగుపరచుకుంటూ అత్యున్నత స్థాయిని అందుకున్నారు'' అని వివరించారు.
తోటి కళాకారులను స్థాయీ భేదం లేకుండా సమానంగా చూడటం నేరెళ్ల గొప్పతనమని జనార్దన్ తెలిపారు. శిష్యులను ఎంతగానో ప్రోత్సహించేవారని నేరెళ్లతో దాదాపు రెండున్నర దశాబ్దాల సాన్నిహిత్యమున్న ఆయన చెప్పారు.
తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ కోర్సు పెట్టించారు
ఈ కళను భావితరాలకు అందించాలనే సంకల్పంతో మిమిక్రీ శిక్షణకు నేరెళ్ల సిలబస్‌ను రూపొందించారు. ప్రత్యేకంగా చొరవ తీసుకొని మిమిక్రీపై హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో డిప్లొమా కోర్సును పెట్టించారు. కోర్సు ప్రారంభించాక మొదటి రెండేళ్లు ఆయన పాఠాలు చెప్పారు.
కోర్సు నిర్వహణ కోసం విశ్వవిద్యాలయానికి నేరెళ్ల డబ్బు కూడా అందించారని జనార్దన్ తెలిపారు. నేరెళ్ల చొరవతో వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ మిమిక్రీపై సాయంత్రం తరగతులు నిర్వహించేవారని చెప్పారు. ఎనిమిదో తరగతిలో ఒక పాఠ్యపుస్తకంలో ఆయన పేరిట 'సౌండ్' అనే పాఠం కూడా ఉందని ప్రస్తావించారు. 'మిమిక్రీ కళ-వికాసం' పేరుతో ఆంథోనీ రాజ్ అనే వ్యక్తి నేరెళ్ల మిమిక్రీ ప్రధానాంశంగా పీహెచ్‌డీ చేశారని తెలిపారు.
అవిభాజ్య ఆంధ్ర్రప్రదేశ్‌కు పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేరెళ్ల శాసనమండలి సభ్యుడిగా నామినేట్ అయ్యారు. 1972-78 మధ్య ఆయన ఎంఎల్‌సీగా ఉన్నారు.
ప్రముఖ నిర్మాత బీఎన్ రెడ్డి ప్రోత్సాహంతో నేరెళ్ల సినిమాల్లో నటించారు. ఆయన్ను 2001లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆయన ఆంధ్ర, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి, ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
వరంగల్‌లో ఒక వీధికి నేరెళ్ల గౌరవార్థం ''డాక్టర్ నేరెళ్ల వేణు మాధవ్ మార్గ్'' అని పేరు పెట్టారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
నేరెళ్ల మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. ఆయనో గొప్ప కళాకారుడని కొనియాడారు. నేరెళ్ల భౌతికకాయానికి పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








