ప్రెస్‌రివ్యూ: సీజేఐపై ఆరోపణలేంటి? అభిశంసన ఎలా జరుగుతుంది?

జస్టిస్ దీపక్ మిశ్రా

ఫొటో సోర్స్, NALSA.GOV.IN

ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా

భారతదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)పై అభిశంసన నోటీసులు. ఇప్పటివరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయినప్పటికీ అసాధారణరీతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీసులు ఇవ్వటం ఇదే తొలిసారి అని ‘సాక్షి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం... . కాంగ్రెస్‌ నేతృత్వంలో 6 విపక్ష పార్టీలు సీజేఐ దీపక్‌ మిశ్రాకు వ్యతిరేకంగా ఈ నోటీసులను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యకు శుక్రవారం అందజేశారు. ఈ అభిశంసన నోటీసులపై 64 మంది రాజ్యసభ సభ్యులు, ఏడుగురు మాజీ ఎంపీలు సంతకాలు చేశారు. సీజేఐ దుష్ప్రవర్తనతోపాటుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నోటీసులో విపక్ష నేతలు పేర్కొన్నారు. సీజేఐ తీరుపై 5 ఆరోపణలు చేశారు.

సీజేఐపై ఆరోపణలు ఇవే..

  • ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కేసు విషయంలో ముడుపులు తీసుకున్నారు. ఇదే కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వలేదు.
  • సుప్రీంకోర్టులో ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌పై విచారణకు సంబంధించిన పిటిషన్‌ను ముందు తేదీకి మార్చటం (ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామన్న కాంగ్రెస్‌)
  • రాజ్యాంగ ధర్మాసనానికి తనే నేతృత్వం వహిస్తున్నప్పటికీ ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు సంబంధించిన విచారణను తన బెంచీకే కేటాయించటం సంప్రదాయానికి విరుద్ధం.
  • న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తప్పుడు అఫిడవిట్‌తో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. 2012లో తను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినపుడు దీన్ని సరెండర్‌ చేశారు. అయితే 1985లోనే ప్లాట్‌ కేటాయింపు నిబంధనలు రద్దుచేశారు. అప్పటినుంచి వీటిని సీజేఐ ఉల్లంఘించారు.
  • తనకున్న మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారు.

సీజేఐపై అభిశంసన ప్రక్రియ ఇలా ఉంటుంది..

  • రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 124(4) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలు సహా ప్రధాన న్యాయమూర్తిని తొలగించవచ్చు.
  • ఈ ప్రక్రియను పార్లమెంట్‌లోని ఏ సభలోనైనా ప్రారంభించొచ్చు.
  • రాజ్యసభలో అయితే..ప్రతిపాదనపై 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి
  • లోక్‌సభలో అయితే.. 100 మంది సభ్యులు సంతకాలు చేయాలి
  • స్పీకర్‌ లేదా చైర్మన్‌ ఆ తీర్మానాన్ని ఆమోదించొచ్చు లేదా తిరస్కరించొచ్చు
  • ఒకవేళ తిరస్కరిస్తే ఆ ప్రతిపాదన వీగి పోయినట్లే

ఆమోదం పొందితే.. సీజేఐ తొలగింపు ఇలా

  • సుప్రీం జడ్జీ, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక న్యాయ నిపుణుడితో కూడిన కమిటీ ఏర్పాటవుతుంది
  • ఆ కమిటీయే అభియోగాలను నమోదు చేస్తుంది
  • అభిశంసన ఎదుర్కొంటున్న జడ్జీకి ఆ కాపీ పంపుతారు
  • తనను సమర్థించుకుంటూ జడ్జీ రాతపూర్వక వివరణ ఇవ్వాలి
  • విచారణ తుది నివేదికను కమిటీ స్పీకర్‌ లేదా చైర్మన్‌కు సమర్పిస్తుంది
  • పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంది
  • సాధారణ మెజారిటీతో లేదా అందుబాటులో ఉన్న సభ్యుల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో ప్రతిపాదన ఆమోదం పొందాలి
  • ఒక సభలో ఆమోదం పొందిన తరువాత మరో సభకు పంపుతారు
  • రెండింట్లోనూ ఆమోదం పొందిన తరువాత రాష్ట్రపతికి చేరుతుంది
  • సదరు జడ్జీని తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేస్తారు

గత 25 ఏళ్లలో మూడు అభిశంసన తీర్మానాలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలివ్వటం గత 25 ఏళ్లలో మూడుసార్లు జరిగింది. కానీ..సిట్టింగ్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసులు ఇవ్వటం మాత్రం ఇదే తొలిసారి.

1993లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామస్వామిపై అవినీతి ఆరోపణలు రావటంతో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇది పార్లమెంటులో ఓటింగ్‌ వరకు చేరుకుంది. అయితే లోక్‌సభలో ఓటింగ్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవటంతో తీర్మానం వీగిపోయింది.

2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్‌పై ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది రాజ్యసభలో ఆమోదం పొంది.. లోక్‌సభకు ఓటింగ్‌ కోసం వచ్చింది. ఫలితాన్ని ముందుగానే ఊహించిన జస్టిస్‌ సౌమిత్ర సేన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

2011లోనే సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ పీడీ దినకరన్‌పై అవినీతి ఆరోపణలొచ్చాయి. ప్రాథమిక విచారణలోనే అవి వాస్తవమేనని తేలింది. సెలవుపై వెళ్లాలని ఆదేశించినా వినకపోవటంతో కర్ణాటక హైకోర్టుకు ఆయన్ను బదిలీ చేశారు. అయితే అభిశంసన ప్రక్రియకు పావులు కదులుతుండగానే ఆయన రాజీనామా చేశారు.

2016లో.. తన అధికారాలను దుర్వినియోగంచేసి ఓ దళిత జూనియర్‌ సివిల్‌ జడ్జిని బెదిరింపులకు గురిచేశారన్న ఆరోపణలపై జస్టిస్‌ నాగార్జున్‌రెడ్డిపై అభిశంసన తీర్మానాన్ని పెట్టారు. అయితే దీన్ని బలపరిచిన వారిలో 19 మంది తమ సంతకాలను వెనక్కు తీసుకోవటంతో ఈ అభిశంసన వీగిపోయింది అని ‘సాక్షి’ పేర్కొంది.

సీతారాం ఏచూరి

ఫొటో సోర్స్, cpim.telangana/facebook

ఫొటో క్యాప్షన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి

కాంగ్రెస్‌తో పొత్తు లేదు..అవగాహన ఉంది

సీపీఐ(ఎం) 22వ పార్టీ మహాసభలో భాగంగా శుక్రవారం జరిగిన సమావేశంలో ప్రధాన రాజకీయ తీర్మానాన్ని ఆమోదించారు. కేంద్రంలో బీజేపీని గద్దెదించాలని కాంగ్రెస్‌తో రాజకీయపొత్తు ఉండబోదని మహాసభ స్పష్టం చేసింది. స్టీరింగ్‌ కమిటీ ప్రతిపాదించిన సవరణలకు మహాసభకు హాజరైన పార్టీ ప్రతినిధుల నుంచి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి మాట్లాడుతూ.. పార్టీ ఐక్యతకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లామని చెప్పేందుకు సీపీఐ(ఎం) గర్విస్తుందని ఏచూరి అన్నారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడమనే ప్రధాన లక్ష్యానికి పార్టీ సభ్యులంతా ఆమోదం తెలిపారని ఆయన వివరించారు.

తీర్మానంపై జరిగిన చర్చ గురించి పార్టీ సీనియర్‌ నేత ప్రకాశ్‌కరత్‌ సంక్షిప్తంగా వివరించారు. కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ కూటమి ప్రతిపాదనను సీపీఐ(ఎం) నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. పాలక వర్గాలకు చెందిన ఓ ప్రధాన పార్టీయైన కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడమనేది తప్పుడు సంకేతాలను ఇస్తుందని మహాసభ స్పష్టం చేసింది. పాలక వర్గాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలను సమీకరించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాతిపదికనే భవిష్యత్‌ ఎన్నికల ఎత్తుగడలుంటాయని తెలిపింది.

అయితే, అవగాహన, కూటమి అనే పదాల విషయంలో మహాసభ స్పష్టతనిచ్చింది. ఈమేరకు సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అంశాలవారీగా లౌకిక పార్టీల మధ్య అవగాహనలో భాగంగా పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీతోనూ కలిసి పని చేసేందుకు మహాసభ అంగీకరించింది. పార్లమెంట్‌ వెలుపల కూడా ఇదే ప్రాతిపదికన ప్రజలను సమీకరించేందుకు మహాసభ ఆమోదం తెలిపింది.

మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కలిసి పని చేయాలంటూ విశాఖపట్నంలో జరిగిన మహాసభలో ఆమోదించిన తీర్మానాన్ని ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించింది. తీర్మానంపై చర్చలో మొత్తం 47మంది ప్రతినిధులు 373 సవరణలను ప్రతిపాదించగా, 37 సవరణలకు మహాసభ ఆమోదం తెలిపింది.

పార్టీ మహాసభ మూడు నినాదాలిచ్చింది.మతోన్మాద బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం కోసం జరిగే పోరాటాలను ముందుకు తీసుకుపోయేందుకు సీపీఐ(ఎం)ను బలోపేతం చేయాలని నిర్ణయించింది. దేశంలో బలమైన వామపక్ష, ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలని పిలుపునిచ్చింది.

స్టీరింగ్‌ కమిటీ ప్రతిపాదించిన సవరణలు ఇవే..

తీర్మానంలోని పేరా 2.90ని తొలగించారు. పేరా 2.115(2)లోని రెండో వాక్యాన్ని తొలగించి, కొత్త క్లాజ్‌(3)ను చేర్చారు.

కాంగ్రెస్‌ పార్టీతో ఎన్నికల్లో పొత్తు లేదా కూటమి ఉండదని స్పష్టం చేశారు. అయితే, పార్లమెంట్‌ లోపలా, బయటా లౌకిక శక్తులతో కలిసి పని చేయడంలో భాగంగా అంశాలవారీగా కాంగ్రెస్‌ పార్టీతోనూ అవగాహనకు మహాసభ ఆమోదం తెలిపింది.

ఢిల్లీలోని ఎయిమ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఢిల్లీలోని ఎయిమ్స్ ప్రాంగణం

తెలంగాణకు ఎయిమ్స్‌.. అనుమతిస్తూ కేంద్రం లేఖ

ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) తరహా ఆసుపత్రి రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం అధికారికంగా లేఖ పంపించిందని ‘ఈనాడు’ ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం... ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద 2018-19 సంవత్సరానికిగాను రూ.3825 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిన నేపథ్యంలో.. ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రికి అనుమతిస్తున్నట్లుగా లేఖలో స్పష్టంగా పేర్కొంది. అవసరమైన స్థల సేకరణపై సత్వరమే దృష్టిపెట్టాలనీ.. ఆసుపత్రికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీపీఆర్‌ రూపకల్పనకు ఉత్తమ ప్రమాణాలు పాటించే సంస్థను ఎంపిక చేసుకోవాలని లేఖలో సూచించింది. సాధ్యమైనంత త్వరగా సమగ్ర ప్రతిపాదనలతో వివరాలను పంపించాల్సిందిగా కోరింది.

బీబీనగర్‌లోనా? హైదరాబాద్‌లోనా?

కేంద్రం నుంచి లేఖ అందడంతో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎయిమ్స్‌ ఏర్పాటుకు గతంలో రాష్ట్రం నుంచి పంపించిన ప్రతిపాదనల నమూనాలను సమూలంగా పరిశీలించారు. రాష్ట్రంలో ఎయిమ్స్‌ కోసం బీబీనగర్‌ వద్ద నిమ్స్‌ భవనాన్ని, అందుకనుగుణంగా స్థలాన్ని ఎంపికచేసినట్లు మూడేళ్ల కిందటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అయితే మూడేళ్లుగా ఎయిమ్స్‌పై ఎలాంటి పురోగతి లేకపోవడంతో.. సుమారు రూ.120 కోట్లతో నిర్మించిన బీబీనగర్‌ నిమ్స్‌ భవనాన్ని తాత్కాలికంగా ఓపీ సేవల కోసం వినియోగిస్తున్నారు. త్వరలోనే ఐపీ సేవలను కూడా ప్రారంభించడానికి సుమారు 450 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసింది. అయితే తాజాగా కేంద్రం నుంచి ఎయిమ్స్‌కు అనుమతి లభించడంతో.. తిరిగి బీబీనగర్‌ వద్దే ఎయిమ్స్‌కు ఏర్పాటు చేయాలా? అనే విషయంపై అధికారులు చర్చించారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయి ఉండడం.. అధునాతన వసతులతో భవనం నిర్మితమై ఉన్న నేపథ్యంలో ఎయిమ్స్‌కు ఇదే సరైన ప్రదేశమనీ, ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు.

ఎయిమ్స్‌ నిర్మాణానికి కొన్ని కచ్చితమైన భవన నిర్మాణ నమూనాలను కేంద్రం అనుసరిస్తోంది. ఇలాంటప్పుడు ఇప్పటికే నిర్మించిన బీబీనగర్‌ నిమ్స్‌ భవనాన్ని కేంద్రం అంగీకరిస్తుందా? అనేది కూడా ప్రశ్నార్థకమే. ఒకవేళ కేంద్రం బీబీనగర్‌ నిమ్స్‌ను ఒప్పుకోకపోతే.. హైదరాబాద్‌ పరిసరాల్లోనే మరోచోట స్థల సేకరణను వేగంగా జరపాలని కూడా యోచిస్తున్నారు. ఎయిమ్స్‌ తరహా ఆసుపత్రి స్థాపనకు సుమారు 200 ఎకరాల స్థలంతోపాటు విద్యుత్తు, నీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంటుంది. ఆసుపత్రి నిర్మాణానికి, నిర్వహణకయ్యే సుమారు రూ.820 కోట్ల వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది. ఏటా సుమారు రూ.300-350 కోట్ల నిర్వహణ నిధులు కూడా కేంద్రమే ఇస్తుంది. సూపర్‌స్పెషాలిటీ నిర్వహణ భారం రాష్ట్ర ప్రభుత్వంపై తగ్గుతుంది.

కంటిచూపు పరీక్ష

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో కంటి పరీక్షలకు 100 కోట్లు

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలకు ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేయనుందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. ఒక్క కళ్లద్దాల కోసమే ఇందులో రూ.40 కోట్లు వెచ్చించనుంది. కంటి పరీక్షల పరికరాల కోసం రూ.50 కోట్ల వరకు అవుతుందని అంచనా. మరో పది కోట్లు నిర్వహణ వ్యయం ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా వంద కోట్లు సర్కారు ఖర్చు పెడుతోంది. అంతకు మించి వ్యయమైనా భరించాలనే ఉద్దేశంతో ఉంది. ప్రగతి భవన్‌లో ఇటీవల కంటి పరీక్షలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. కంటి పరీక్షల నిర్వహణకు ఎంత ఖర్చయినా భరిద్దామని ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అన్నారు. కాగా రాష్ట్రంలో ఏటా 3 లక్షల కేటరాక్ట్‌ ఆపరేషన్లు జరుగుతాయి. ప్రస్తుతం వీటికి ప్రైవేటు కంటి దవాఖానల్లో రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. అవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగడం వల్ల ప్రజలకు దాదాపు రూ.600 కోట్లు ఆదా అవుతుందని కేసీఆర్‌ సర్కారు భావిస్తోంది.

పరీక్షలు నిర్వహించేది ఎప్పుడు?

కంటి అద్దాల ధరలు ఖరారయ్యాయి. ఉచిత పంపిణీకి దాదాపు 40 లక్షల కళ్లద్దాలు అవసరమవుతాయని అంచనా. ఇందుకు ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు పిలిచింది. ప్రముఖ కంపెనీలు పోటీపడ్డాయి. వాటిలో ఎస్సెల్లార్‌ అనే కంపెనీ టెండర్‌ను దక్కించుకుంది. రీడింగ్‌, బైఫోకల్‌, ఆర్‌ఎక్స్‌ గ్లాసులకు వరుసగా రూ.89, రూ.99, రూ.275 ధరలను ఎస్‌ఎల్‌ఆర్‌ కోట్‌ చేసింది. కాగా, కంటి పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంతవరకు ఖరారు కాలేదు. క్షేత్రస్థాయిలో వీటిని ఎలా నిర్వహించాలన్న దానిపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. వాస్తవానికి, ఈ వేసవిలోనే పరీక్షలు నిర్వహించాలని తొలుత భావించినా, పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధం చేయలేదని సమాచారం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)