జస్టిస్ లోయా మృతి కేసు స్వతంత్ర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

ఫొటో సోర్స్, CARAVAN MAGAZINE
జస్టిస్ బ్రిజ్‌మోహన్ హరికిషన్ లోయా మరణంపై స్వతంత్ర విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ కన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది.
జస్టిస్ లోయా మృతిపై సమగ్ర, స్వతంత్ర విచారణ జరపాలని కోరుతూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
‘‘జస్టిస్ లోయాను ఆస్పత్రికి తీసుకెళ్లేప్పుడు ఆయనతోపాటు ఉన్న నలుగురు న్యాయమూర్తులు ఇచ్చిన వాంగ్మూలాలపై అనుమానాలు, అపనమ్మకాలకు తావిచ్చే సహేతుక కారణాలేమీ లేవు. ఈ నలుగురు న్యాయమూర్తులూ జస్టిస్ లోయాతో పాటు (నాగ్‌పూర్‌లో జరిగిన) న్యాయాధికారుల కుటుంబ పెళ్లికి వెళ్లారు. రోజంతా ఆయనతోనే ఉన్నారు. జస్టిస్ లోయాది సహజ మరణమేనని వారు తమ వాంగ్మూలాల్లో స్థిరంగా చెప్పుకొచ్చారు’’ అని సుప్రీంకోర్టు ప్రధాన ధర్మాసనం పేర్కొంది.
‘‘న్యాయాధికారులు ఒక హత్యకు కుట్రదారులు అన్న రీతిలో వారి గౌరవానికి భంగం కలిగించే రీతిలో పిటిషనర్లు వాదనలు వినిపించటం దురదృష్టకరం. ఈ కోర్టు(సుప్రీంకోర్టు)కు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల్ని కూడా ఈ పరోక్ష నేరారోపణల నుంచి వదిలిపెట్టలేదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ముసుగులో న్యాయ వ్యవస్థలకు కళంకం తేవాలని, వాటి ప్రతిష్ట దిగజార్చాలని పిటిషనర్ ప్రయత్నించారు’’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
‘‘ఆయన (జస్టిస్ లోయా) సహజంగానే మరణించారు. అందులో సందేహం లేదు’’ అంటూ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ జస్టిస్ లోయా?
ముంబయిలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ బ్రిజ్‌మోహన్ హరికిషన్ లోయా. 2014 డిసెంబర్ 1న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ వివాహ వేడుకలో పాల్గొనడానికి వెళ్లి గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్)తో మృతి చెందారు.
జస్టిస్ లోయా ఆ సమయంలో సోహ్రాబుద్దీన్ 'ఎన్‌కౌంటర్' కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉన్నారు.
ఇప్పుడు ఆ కేసును మూసేశారు. అమిత్‌షాను నిర్దోషిగా తేల్చారు.
లోయా మరణించిన మూడేళ్ల తర్వాత.. అంటే 2017లో పలువురు సందేహాలు లేవనెత్తారు. లోయా కుటుంబీకులతో జరిపిన సంభాషణల ఆధారంగా 'ద కారవాన్' పత్రిక ప్రచురించిన కథనంలో ఆయన మృతికి దారితీసిన పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు.
సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బ్రిజ్‌మోహన్ హరికిషన్ లోయా మృతికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలని దిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా డిమాండ్ చేశారు.
లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గానీ నిర్ణయం తీసుకోవాలని 'ద వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ షా అన్నారు.
ఈ ఆరోపణలపై విచారణ జరిపించని పక్షంలో అది న్యాయవ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP
సుప్రీంకోర్టులో పిటిషన్లు
జస్టిస్ లోయా మృతిపై విచారణ కోరుతూ బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.
వాటిలో ఒకటి బాంబే లాయర్స్ అసోసియేషన్ తరపున బాంబే హైకోర్టులో దాఖలు కాగా, సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
సుప్రీంకోర్టులో ఒక కేసు కాంగ్రెస్ నేత తహసీన్ పూనావాలా దాఖలు చేయగా, మరో కేసు మహారాష్ట్ర జర్నలిస్టు బంధు రాజ్‌లోనే దాఖలు చేశారు.
‘స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయడం విచారకరం. ఈ అంశాన్ని విస్తృత దర్మాసనానికి నివేదించాలని కోరుతున్నాం’ అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








