ఆంధ్రప్రదేశ్‌లో ఆగని కోడి పందేలు

కోడి పందేలు

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాదీ పందెంకోళ్లు కత్తులు దూశాయి. విశాలమైన బరుల్లో మీడియా కెమెరాల సాక్షిగా కసితో తలపడ్డాయి.

సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మొదలైన కోళ్లపందేల జాతర ఇంకా సాగుతోంది.

కోడిపందేలను కొన్ని చానెల్‌లు లైవ్ టెలికాస్ట్ చేశాయి. హాజరైన ప్రేక్షకులకు పెద్ద పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లు పెట్టి మరీ చూపించారు.

వీడియో క్యాప్షన్, అవే పందేలు.. అవే కత్తులు

ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని పాలకొల్లు, కాకినాడ, భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, గుడివాడ ప్రాంతాల్లో జోరుగా కోడిపందేలు సాగుతున్నాయి.

కొన్నిచోట్ల డ్రోన్లతో కోడి పందేలను చిత్రీకరించారు.

line
వీడియో క్యాప్షన్, వీడియో: కోళ్ల పందేలను చూసేందుకు వచ్చిన జనం, నేతలు
line

కోడి పందేల కోసం ప్రత్యేక టెంట్లు వేసి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

సందర్శకుల వాహనాల పార్కింగ్ కోసం బరుల వద్ద ప్రత్యేకంగా విశాలమైన పార్కింగ్‌ ప్లేస్ సిద్ధం చేశారు.

మొదట కత్తులు లేకుండా పందేలు ప్రారంభించిన నిర్వహకులు ఆ తర్వాత కోళ్లకు కత్తికట్టారు.

కోడి పందేలు

పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు వేల మంది ఈ పందేలను తిలకించారు.

పలు పార్టీలకు చెందిన నేతలు కూడా దగ్గరుండి ఈ కోడి పందేలను జరిపించారు.

భోగి పండగైన ఆదివారం మొదలైన ఈ పందేలు ఇవాళ కూడా జోరుగా సాగుతున్నాయి.

కోడి పందేలు

ఈ పందేల సందర్భంగా రాష్ర్టంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు అంచనా.

ఇందులో ప్రజలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నట్లు చెబుతున్నారు.

నిజానికి కోడి పందేలను నిర్వహించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కోడిపందేలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కోడిపందేలను నిర్వహించకుండా చూడాలని గతంలో తాము జారీచేసిన ఉత్తర్వులను సరిగా అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.

ఈసారి తమ ఉత్తర్వుల అమలులో విఫలమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని కూడా కోర్టు హెచ్చరించింది.

హైకోర్టు ఆదేశాలతో పోలీసులు మొదట చర్యలు తీసుకున్నారు.

కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పందెం కోళ్లను సీజ్ చేశారు.

కోడిపందేలు నిర్వహిస్తారని అనుమానం ఉన్న కొందరిని ముందస్తుగా బైండోవర్ చేశారు.

కోడి పందేలు

ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను బీజేపీ నాయకుడు రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

కోళ్ల పందేలపై హైకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.

దాంతో కోడిపందెలకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టరాదని స్పష్టం చేసింది.

అలాగే కోళ్ల పందెంలో జూదం, డబ్బులు పెట్టడం లాంటివన్నీ కుదరదని తేల్చి చెప్పింది. అంతేకాదు, కోళ్లను హింసించే ఎలాంటి చర్యలనూ ఉపేక్షించేది లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు విస్పష్టంగా ఉన్నా.. అవి ఎక్కడా అమలు అవుతున్నట్లు కనిపించడం లేదు. సంక్రాంతి సందర్భంగా ఏపీలోని కోస్తా ప్రాంతంలో యథేచ్ఛగా కోడిపందెలు జరుగుతున్నాయి.

కోడి కాళ్లకు కత్తు కట్టి, డబ్బులు పెట్టి పందెం కాస్తున్నారు. మొదట్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలతో హడావుడి చేసిన పోలీసులు ఇప్పుడు కోళ్లపందెల బరుల దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు.

కోడి పందేలు

కోర్టు తీర్పు పాటిస్తామంటూనే.. సంప్రదాయాన్ని ఎలా వదులుకుంటామని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

కోడిపందేలు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అని, దాన్ని ఎలాగైనా కొనసాగిస్తామని చెబుతున్నారు.

అయితే, మొదట హడావుడి చేసిన పోలీసులు కోడిపందేలు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని కొందరు అడుగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)