బీహార్: దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు మూడున్నరేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా

ఫొటో సోర్స్, Niraj Sinha
పశుదాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా నిర్ధారించింది. ఆయనకు మూడున్నరేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది.
1991 నుంచి 1994 మధ్య దేవ్‌ఘర్ ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 89 లక్షలు కాజేశారన్న కేసులో లాలూను కోర్టు దోషిగా తేల్చింది.
ఈ కేసులో కోర్టు మొత్తం 15 మందిని దోషులుగా నిర్ధారించినట్టు స్థానిక జర్నలిస్టు నీరజ్ సిన్హా తెలిపారు. మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా కూడా ఉన్నారు.
బిహార్ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా లాలూ యాదవ్ ఈ కుంభకోణంలో కుట్రదారులపై విచారణకు సంబంధించిన ఫైల్‌లను తన వద్దే దాచి పెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
సీబీఐ న్యాయస్థానం లాలూను దోషిగా నిర్ధారించిన 2017 డిసెంబర్ 23వ తేదీన పోలీసులు ఆయన్ను తమ కస్టడీలోకి తీసుకుని జార్ఖండ్ రాజధాని నగరం రాంచీలోని ‘బిరసా ముండా’ సెంట్రల్ జైలుకు తరలించారు.
దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాలూకు ఈ జైలుశిక్ష తీర్పును వెల్లడించారని నీరజ్ సిన్హా తెలిపారు.
కాగా, కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తామని లాలూ ప్రసాద్ తరపున ఆయన ప్రతినిధి ప్రభాత్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అధికారులు అభ్యంతరం చెబుతున్నప్పటికీ ముగ్గురు అధికారులకు ఎక్స్‌టెన్షన్ ఇచ్చారన్న ఆరోపణలు కూడా లాలూపై ఉన్నాయి.
ఈ కుంభకోణం గురించి తెలిసినప్పటికీ ఈ దోపిడీని అడ్డుకోలేదనే ఆరోపణలను కూడా లాలూ ఎదుర్కొన్నారు.
లాలూ యాదవ్‌తో పాటు బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా, మరో 19 మంది ఈ కేసులో నిందితులుగా ఉండగా కోర్టు జగన్నాథ్ మిశ్రాను నిర్దోషిగా ప్రకటించింది.
మొదట్లో 34 మందిపై ఆరోపణలు ఖరారు చేయగా వారిలో 11 మంది కేసు విచారణ క్రమంలో వేర్వేరు సమయాల్లో మృతి చెందారు.
13 డిసెంబర్‌న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి శివపాల్ సింగ్ కేసు విచారణ ముగించారు.
2013 అక్టోబర్‌లో లాలూ ప్రసాద్‌ను ఒక కేసులో దోషిగా ఖరారు చేశారు.

ఫొటో సోర్స్, NEERAJ SINHA
అది రూ. 37 కోట్ల కుంభకోణానికి సంబంధించినది. ఆ తీర్పు కారణంగా లాలూను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించారు.
ఆ కేసులో లాలూ రెండు నెలలు జైలులో ఉన్న తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2014లో జార్ఖండ్ హైకోర్టు లాలూ యాదవ్ తదితరులకు ఊరటనిస్తూ నేరపూరిత కుట్ర ఆరోపణలను కొట్టివేసింది.
ఒక వ్యక్తిని ఒక కేసులో దోషిగా నిర్ధారించినప్పుడు మళ్లీ అదే కేసులో, ఆ సాక్షులు, ప్రత్యక్ష సాక్షులతోనే మళ్లీ విచారణ జరిపించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కుంభకోణానికి సంబంధించిన ఇతర కేసుల్లోనూ లాలూ యాదవ్ నిందితుడిగా ఉన్నారు. నకిలీ మందులు, పశు దాణాలో రూ. 900 కోట్లు దిగమింగారన్న ఆరోపణలు మోపారు. సీబీఐ ఈ ఆరోపణలపై 1996లోనే దర్యాప్తు ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Niraj Sinha/BBC
1990 నుంచి 1997 మధ్యకాలంలో బీహార్ రాష్ట్రానికి లాలూ ప్రసాద్ యాదవ్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం 1997 నుంచి 2005 మధ్యకాలంలో లాలూ ప్రసాద్ భార్య రబ్రీదేవి బీహార్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు.
ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ ప్రస్తుతం బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో బీహార్ మంత్రిగా పనిచేశారు.
2017 డిసెంబర్ 23వ తేదీన కోర్టు దోషిగా ప్రకటించిన నేపథ్యంలో కోర్టు ఆవరణలోనే లాలూను పోలీసు కస్టడీకి తీసుకున్నారు.
చిన్న కుమారుడు, బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి లాలూ ప్రసాద్ కోర్టుకు చేరుకున్నారు. శాంతిని కాపాడాలని ఆయన తన మద్దతుదారులను కోరారు.
ఆ రోజు తీర్పు సమయంలో లాలూ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో కోర్టు బయట గుమిగూడారు.
తీర్పు వెలువడడానికి ముందు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) చీఫ్ లాలూ విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం తనను అపఖ్యాతి పాలు చేయాలని చూస్తోందని అన్నారు.
ఇతర కథనాలు:
- వీరు నోరు జారారా.. పారేసుకున్నారా?!
- ఇది దెయ్యాల దిబ్బకాదు.. పూర్వీకుల పరిశోధనశాల
- 'ఆ గోరక్షక దళాలపై మోదీ చర్యలెందుకు తీసుకోరు?'
- సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు
- పెద్ద నోట్ల రద్దు: ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ జూదం
- సంపన్నులు తప్పించుకుంటే సామాన్యులకే దెబ్బ
- ప్యారడైజ్ పేపర్స్‌లో వైఎస్ జగన్ పేరు!
- బీడువారిన నేలను మాగాణంలా మార్చారు!
- BBC SPECIAL: ‘భారత్ ఒత్తిడితోనే మాపై చర్యలు’
- థాయ్‌లాండ్‌లో పురుషాంగాన్ని తెల్లగా మార్చే చికిత్స
- ‘హలో కిమ్.. నా న్యూక్లియర్ బటన్ నీకన్నా పెద్దది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








