సఫ్దర్ హాష్మీని మీరైతే మర్చిపోలేదు కదా?

సఫ్దర్ హాష్మీ

ఫొటో సోర్స్, SAHAMAT

    • రచయిత, ప్రదీప్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"దేశంలో తర్కబద్ధంగా లేచే ప్రతి గొంతునూ నొక్కి వేస్తున్నప్పుడు.. ప్రతి వ్యక్తిపై ఒక ప్రత్యేక తరహా భావజాలాన్ని రుద్దాలని చూస్తున్నప్పుడు.. ముఖ్యంగా అధికారం నిరంకుశంగా మారుతున్న ఇలాంటి ప్రతి సందర్భంలోనూ సఫ్దర్ హాష్మీ ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.. యువజనులకు ఆయన ఎల్లప్పుడూ గుర్తొస్తుంటాడు."

సఫ్దర్ హాష్మీని ఇలా గుర్తు చేసుకుంటున్న వారిలో ఆయన సోదరుడు సోహైల్ హాష్మీ ఒక్కరే లేరు. ప్రతి జనవరి 1 నాడు ఆయనతో పాటు వందలాది యువతీయువకులు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌కు వచ్చి, సఫ్దర్ హాష్మీని గుర్తు చేసుకుంటారు. ఆయనకు నివాళిగా ప్రజాస్వామ్యం గురించి నినాదాలు చేస్తుంటారు.

సోమవారం సాయంత్రం ఈ సమూహంలో వృద్ధతరానికి చెందిన ఎందరో కనిపించారు. సఫ్దర్ చనిపోయి 29 ఏళ్లు గడచిపోయినా ఆయన జ్ఞాపకాలు వారి ముఖాల్లో ప్రతిఫలిస్తున్నాయి. కేవలం 34 ఏళ్లే జీవించిన సఫ్దర్ హాష్మీ ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని ముద్ర వేయగల స్థాయికి చేరుకున్నారు.

ఇంతకూ సఫ్దర్ చేసిన కృషి ఏమిటి?

దిల్లీలోని ప్రతిష్ఠాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఇంగ్లిష్ సాహిత్యంలో ఎంఏ చదివిన సఫ్దర్ హాష్మీది ఒక సంపన్న కుటుంబం. సమాచార శాఖ అధికారి ఉద్యోగాన్ని వదిలేసి ఆయన సీపీఐ(ఎం) పార్టీలో హోల్ టైమర్‌గా చేరారు. ఆ తర్వాత తాను సామాన్య ప్రజల గొంతుకగా మారిపోవాలన్న ఉద్దేశంతో వీధి (నుక్కడ్) నాటకాలనే తన ప్రధాన కార్యరంగంగా మల్చుకున్నారు.

1978లో జననాట్య మంచ్‌ను ఏర్పాటు చేసిన సఫ్దర్ కార్మిక హక్కుల కోసం గొంతెత్తారు. 1989 జనవరి 1న దిల్లీకి సమీపంలో ఉన్న ఘాజియాబాద్‌లోని సాహిబాబాద్‌లో 'హల్లా బోల్' అనే నుక్కడ్ నాటకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, ఆనాటి స్థానిక కాంగ్రెస్ నాయకుడు ముకేశ్ శర్మ కొందరు గూండాలతో కలిసి సఫ్దర్ బృందంపై ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ సఫ్దర్ హాష్మీ మరుసటి రోజు ఆస్పత్రిలో కన్ను మూశారు.

ఈ దాడికి పాల్పడ్డ దోషులకు శిక్ష పడేలా చేయడం కోసం సఫ్దర్ కుటుంబ సభ్యులు, మిత్రులు చాలా సుదీర్ఘ కాలమే పోరాడాల్సి వచ్చింది. "దిల్లీకి సమీపంలో పట్ట పగలే జరిగిన హత్య ఇది. దీనికి ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా మంది ఉన్నారు. అయినా నిందితులకు బెయిల్ ఇచ్చారు. మేం చాలానే పోరాడాల్సి వచ్చింది. 14 సంవత్సరాల తర్వాత మాత్రమే దోషులకు శిక్ష పడింది. సఫ్దర్ పోరాటం సామాన్యుల హక్కుల కోసం జరిగే పోరాటంతో పాటు న్యాయం కోసం పోరాటంగా మారిపోయింది" అని సుహైల్ హాష్మీ వివరించారు.

సఫ్దర్ హత్య జరిగిన 48 గంటల లోపే, జనవరి 4న ఆయన సహచరులు, భార్య మౌలిశ్రీ కలిసి సరిగ్గా సఫ్దర్ హత్య జరిగిన స్థలంలోనే 'హల్లా బోల్' నాటకాన్ని మళ్లీ ప్రదర్శించారు.

సఫ్దర్ హాష్మీ

ఫొటో సోర్స్, SAHAMAT

పెద్దా, చిన్నా అంతా వీధుల్లోకొచ్చారు

దాడిలో తీవ్రంగా గాయపడ్డ సఫ్దర్ హాష్మీ జనవరి 2న రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చనిపోయారు. ఈ దాడి తీవ్రత ఎంతో అర్థం కావాలంటే సఫ్దర్ మృతి తర్వాత ఆయన తల్లి రాసిన పుస్తకం 'పాంచ్వా చిరాగ్' చదవాలి. "తల మూడు వైపులా పగిలిపోయింది. బతికే అవకాశాలు ఏ మాత్రం లేవు అని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి డాక్టర్లు చెప్పారు" అని ఆమె తన పుస్తకంలో రాశారు.

సఫ్దర్ అంతిమయాత్రలో సామాన్య ప్రజలతో పాటు దిల్లీలోని ఇలీట్‌గా పిలిచే సంపన్నులు కూడా చాలా మంది పాల్గొన్నారు. మొబైల్‌ఫోన్లు, ఇంటర్నెట్ వంటివి ఏవీ లేని ఆ కాలంలోనే ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం 15 వేల మంది జమయ్యారు.

ప్రస్తుత కాలంలో సఫ్దర్ హాష్మీ వంటి యువకుల అవసరం ఎంతగానో ఉందని సీనియర్ కవి, పాత్రికేయుడు మంగళేశ్ డబ్రాల్ అన్నారు. "సామాన్యుల, నిరుపేద కార్మికుల కోసం గొంతెత్తడానికి, వారిని తమ హక్కులు సాధించుకునేలా చైతన్యపర్చడం కోసం నుక్కడ్ నాటకాన్ని సఫ్దర్ ఒక ఆయుధంలా ఉపయోగించారు. ఆయన అలాంటి శక్తిమంతమైన నాటకాలను ఎంచుకున్నాడు కనుకనే వారు ఆయనను హత్య చేయాలనుకున్నారు. నేటి రోజుల్లో అలాంటి నాటకాలను ఊహించను కూడా ఊహించలేం" అని ఆయనన్నారు.

సమాజంలో మైనారిటీలను ఒక మూలకు నెట్టేస్తున్న నేటి కాలంలో దాన్ని అడ్డుకునే శక్తి సఫ్దర్ వంటి యువజనులకే ఉంటుంది. "సఫ్దర్ ప్రాసంగికత నేటికీ ఉందంటారా అని జనాలు నన్ను తరచుగా అడుగుతుంటారు. ఆయన ప్రాసంగికత నేటి సమయంలో మరింత పెరిగిందని నేనంటాను" అని డబ్రాల్ చెప్పారు.

సఫ్దర్ కుటుంబం దిల్లీలోని ఒక సంపన్న కుటుంబమే. అయితే ఆయన పేద కార్మికుల సమస్యలను చేపట్టేవారు. సమకాలీన అంశాలపై ఆయన లోతైన వ్యంగ్య శైలిలో నుక్కడ్ నాటకాలు రూపొందించేవారు. అంతేకాదు, వాటిని ఆయన చాలా సజీవంగా ప్రదర్శించేవారు. సామాన్య ప్రజలతో మమేకం కావాలన్న తాపత్రయం ఆయనలో బాగా కనిపించేది.

మంగళేశ్ డబ్రాల్ చెప్పిన దాని ప్రకారం, సామాన్య జనాలలో బాగా కలిసిపోగలడం సఫ్దర్‌లో ఉన్న మరో గొప్ప విషయం.

సఫ్దర్ హాష్మీ

ఫొటో సోర్స్, SAHAMAT

'పుస్తకాలే నీకు అండ'

సఫ్దర్, సుహైల్‌ల మిత్రుడు, దిల్లీ సత్యవతి కాలేజీ రిటైర్డ్ ప్రొఫెసర్ మదన్ గోపాల్ సఫ్దర్‌ను గుర్తు చేసుకుంటూ, "సఫ్దర్‌తో కలిసి పని చేసిన సమయంలో అసలాయన ఎన్ని పనుల్లో భాగమై ఉన్నాడో మాకు తెలియనే లేదు. ఆ రోజుల్లో మంజీత్ బాబా, ఎంకే రైనా, సఫ్దర్, సుహైల్ అందరూ కలిసే ఉండేవారు. కానీ వీరిలో సఫ్దర్ చరిష్మానే వేరు. బాగా ఎత్తు, ఎదుటి వాళ్లను మైమరిపింపజేసే చిరునవ్వుతో ఎప్పుడూ కనిపించే సఫ్దర్ ఏది చేసినా, ఏం మాట్లాడినా అంతా ప్రత్యేకంగానే ఉండేది. ఆయనతో ఎవరైనా హాయిగా కలగలసిపోయేవారు" అని అన్నారు.

నుక్కడ్ నాటకాలతో పాటు సఫ్దర్ ఇతర ప్రత్యేకతల గురించి మాట్లాడుతూ మంగళేశ్, "బ్రెఖ్త్ కవితలను సఫ్దర్ ఎంతో అద్భుతంగా అనువదించారు. పిల్లల కోసం ఆయన ఎన్ని కవితలు రాశారో. ఆయన ఆ కవితలు రాసిన పద్ధతిని గమనిస్తే మానసిక శాస్త్రంపై కూడా ఆయనకు మంచి పట్టు ఉన్నట్టుగా అర్థమవుతుంది" అని చెప్పారు.

సఫ్దర్ రాసిన కవితల్లో కొన్ని నేటికీ జాదూను కోల్పోలేదు.

"పుస్తకాలు మాటలాడుతాయి. గడచిన కాలం గురించీ, ప్రపంచంలోని జనాల గురించీ" అనే పంక్తులు మచ్చుకు కొన్ని.

ఆయన పిల్లల కోసం రాసిన కొన్ని కవితలు నేటికీ చాలా మంది నోళ్లలో ఆడుతాయి. ఆయన సామాన్య ప్రజలు బాగా చదువుకోవాలని కోరుకునే వారు. చదువుతోనే చైతన్యం పెరుగుతుందని ఆయన భావించారు.

ఇవే కాకుండా, పిల్లల కోసం అనేక స్కెచ్‌లు, మాస్క్‌లు, వందలాది పోస్టర్‌లు సఫ్దర్ డిజైన్ చేశారు.

వీధిలో నాటకం

'ఎప్పుడూ నాయకుడిగా భావించలేదు"

సఫ్దర్ వ్యక్తిత్వం గురించి ప్రఖ్యాత నాటక దర్శకుడు హబీబ్ తన్వీర్ ఇలా రాశారు, "ఆయన నాటకాల కోసం చాలా మంచి పాటలు రాసేవారు. అయినా తనను తాను ఎప్పుడూ కవిగా భావించలేదు. డైరెక్షన్ చేసే వారు కానీ, దాని గురించి అంతగా తెలియని వాడిలానే వ్యవహరించేవారు. బాగా నటించేవారు కానీ ఎప్పుడూ తానో గొప్ప నటుడినని భావించలేదు. మంచి నాయకుడే. కానీ ఎప్పుడూ తననో నాయకుడిగా భావించలేదు. అతడో మంచి స్వభావం గల వ్యక్తి. ఆయన ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ జీవం ఉట్టిపడినట్టుండేది."

మీరెప్పుడైనా దిల్లీలోని మండీ హౌజ్ సమీపంలో ఉన్న సఫ్దర్ హాష్మీ రోడ్డు గుండా వెళ్లినట్టయితే అక్కడి గాలిలో ఆయన జీవన తరంగాలను గుర్తించే ప్రయత్నం చేయండి.

సఫ్దర్ హాష్మీని మరచిపోకండి. ఎందుకంటే, ఏ కాలంలోనైనా సఫ్దర్ హాష్మీ కావడం అంత సులువైన పనేం కాదు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)