ప్రెస్ రివ్యూ: తెలుగు మీడియం వల్లే ర్యాంకులు రాలేదు - ఏపీ మంత్రి నారాయణ

ఫొటో సోర్స్, Getty Images
ఈనాడు: ఇవాంక ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు మాత్రమే కాదు ఆయన ముద్దుల కుమార్తె కూడా. అందుకే ఇంచుమించు ప్రపంచంలోని అన్ని ఉగ్రవాద సంస్థల నుంచీ ఆమెకు ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రానున్న ఇవాంకకు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడి కుటుంబం కోసం జనరల్ మోటార్స్ సంస్థ ప్రత్యేకంగా తయారు చేసే లీమోజీన్ వాహనాలు త్వరలో హైదరాబాద్ రానున్నాయి. మందుపాతరలు, తుపాకీ తూటాల నుంచి మాత్రమే కాదు రాకెట్ లాంచర్లు, జీవ, రసాయన దాడుల నుంచీ రక్షించగలిగేలా అన్ని రకాల సదుపాయాలు ఈ వాహనంలో ఉంటాయి. ఇటువంటి వాహనాలు మూడింటిని తెప్పిస్తున్న అమెరికా అధికారులు ఇవాంక హైదరాబాద్‌లో పాల్గొనే అన్ని కార్యక్రమాలకూ వీటినే వాడబోతున్నారు.
ఇవాంకకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు దేశంలోని ముంబయి, దిల్లీ, చెన్నై అమెరికా రాయబార కార్యాలయాల నుంచి 100 మంది ఉద్యోగులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ బృందంలో 20 మందికిపైగా వంటవాళ్లూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విందులో తప్ప మిగతా కార్యక్రమాల్లో ఇవాంక వీరు తయారు చేసే ఆహారమే తీసుకుంటారు. వంటదినుసులు కూడా అమెరికా నుంచే దిగుమతి చేసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలుగు మీడియం వల్లే ర్యాంకులు రాలేదు: నారాయణ
సాక్షి: తెలుగు మాధ్యమంలో చదవడం వల్లే రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో ర్యాంకులు సాధించలేకపోయారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. మున్సిపల్ స్కూళ్లలో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంపై అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
2015-16, 2016-17 సంవత్సరాల్లో మున్సిపల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో ఒక్కరికీ పదివేలలోపు ఇంజనీరింగ్ ర్యాంకులు రాలేదంటే ఇంగ్లిష్ రాకపోవడమే కారణమని చెప్పారు. మాతృభాష తెలుగును తీసెయ్యట్లేదని, ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చునన్నారు. దీనికి పలువురు సభ్యులు అడ్డుతగిలారు.
తెలుగు మీడియంలో చదవడం వల్లే ర్యాంకులు రాలేదనడం సరికాదని, దీనిపై తమకు మాట్లాడే అవకాశమివ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, శ్రావణ్‌కుమార్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిలతోపాటు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. ఇందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఒప్పుకోలేదు. దీంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఆంగ్ల మాధ్యమం పేరుతో తెలుగును దూరం చేయడం దారుణమన్నారు.

ఫొటో సోర్స్, Brahmos
సుఖోయ్ నుంచి బ్రహ్మాస్త్రం
నమస్తే తెలంగాణ: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమైంది. బుధవారం మధ్యాహ్నం భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం నుంచి తొలిసారిగా బ్రహ్మోస్‌ను పరీక్షించామని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. బ్రహ్మోస్-ఎయిర్‌లాంచ్డ్ క్రూయిజ్ మిసైల్ (ఏఎల్సీఎం) ప్రయోగాన్ని రెండు దశల్లో చేపట్టగా, బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని తెలిపింది.
2.5 టన్నుల బరువున్న బ్రహ్మోస్ క్షిపణికి 290 కిలోమీటర్ల రేంజ్‌లో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యముందని ఈ ప్రయోగంతో మరోసారి నిరూపణ అయ్యిందని రక్షణశాఖ పేర్కొంది. 3200 కిలోమీటర్ల సామర్థ్యమున్న సుఖోయ్-30 ఎంకేఐ విమానాలద్వారా ప్రయోగించడం వల్ల సుదూర లక్ష్యాలను కూడా బ్రహ్మోస్ సునాయాసంగా ఛేదించగలదని తేలింది.
భూతలం, గగనతలం, సముద్రంపై నుంచి ప్రయాణించగలగడంతోపాటు ప్రపంచంలోనే వేగంగా ప్రయాణించగల సూపర్‌సోనిక్ మిసైల్ కావడం బ్రహ్మోస్ ప్రత్యేకత. ఇప్పటికే భూమిపై నుంచి, నీటి పైనుంచి ప్రయోగించగల బ్రహ్మోస్ క్షిపణులు ఆర్మీ, నౌకాదళ అమ్ములపొదిలోకి చేరాయి. తాజా పరీక్షతో బ్రహ్మోస్ క్షిపణి భారత వాయుసేనకు బ్రహ్మాస్త్రంగా మారనుంది.

ఫొటో సోర్స్, Getty Images
హాంకాంగ్ ఓపెన్‌లో సింధు, సైనా శుభారంభం
నవతెలంగాణ: హైదరాబాదీ స్టార్ షట్లర్లు పి.వి సింధు, సైనా నెహ్వాల్‌లు హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో శుభారంభం చేశారు. తొలి రౌండ్లో ఒలింపిక్ సిల్వర్ స్టార్, తెలుగు తేజం సింధు ఆతిథ్య క్వాలిఫైయర్‌ను 21-18, 21-10తో ఓడించి ప్రీ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. ఇటీవలి నేషనల్ చాంపియన్ సైనా డెన్మార్క్ షట్లర్ మెట్టె పౌల్సెన్‌పై 21-19, 23-21తో గెలుపొంది ప్రీ క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నది.
సూపర్ టైటిళ్ల వేటగాడు కిదాంబి శ్రీకాంత్ లేని తరుణంలో పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణరు భారత్ ఆశలను సజీవంగా నిలిపాడు. సహచర ఆటగాళ్లందరూ నిష్క్రమించినా.. హోరాహోరీ పోరులో అజేయంగా నిలిచి ప్రీ క్వార్టర్‌లో కాలుమోపాడు.
అర్హత మ్యాచుల్లో వరుస విజయాలతో ప్రధాన టోర్నీలో కాలుమోపిన పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లో లీ డాంగ్‌క్యూన్ చేతిలో 15-21, 21-9, 22-20తో పోరాడి ఓడాడు. బి సాయి ప్రణీత్ బలమైన ప్రత్యర్థి చేతిలో ఓడాడు. రెండో సీడ్ సన్ వాన్‌హో (కొరియా) 21-8, 21-16తో సాయి ప్రణీత్ టైటిల్ ఆశలపై నీళ్లు చల్లాడు. టామీ సుగియార్టో (ఇండోనేషియా) 21-15, 21లి8తో సౌరభ్ వర్మ ను ఇంటి ముఖం పట్టించాడు.

ఫొటో సోర్స్, Hyderabad metro rail limited
హైదరాబాద్ మెట్రో స్మార్ట్‌కార్డు విక్రయం ప్రారంభం
ఆంధ్రజ్యోతి: మెట్రోరైలు తొలి దశ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మెట్రో స్మార్ట్‌కార్డుల బుకింగ్ చేపట్టింది. ఐటీ కారిడార్‌లోని ఓ రియల్ ఎస్టేట్ సర్వీస్ టీంతో కలిసి వీటి విక్రయాన్ని ప్రారంభించింది. ఆసక్తి ఉన్న ఐటీ ఉద్యోగుల నుంచి పూర్తి వివరాలను సేకరించి రూ.200 కు కార్పొరేట్ తరహాలో ఈ కార్డులను విక్రయిస్తున్నారు. స్మార్ట్‌కార్డు కలిగిన వారు నేరుగా మెట్రో స్టేషన్‌లోని ఆటోమేటిక్ టికెట్ కలెక్షన్ గేట్ల వద్ద స్వైపింగ్ చేసి లోపలికి వెళ్లవచ్చు.
రైలులో ప్రయాణించి దిగిపోయే సమయంలో మళ్లీ స్మార్ట్‌కార్డును స్వైప్ చేస్తే.. ప్రయాణించిన దూరానికి చార్జీ మెట్రో ఖాతాలోకి వెళుతుంది. మెట్రో ప్రయాణం ఎంతో సులభంగా ఉండేలా ఇది ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ మేరకు ఐటీ కారిడార్‌లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగులకు అందుబాటులో ఉండేలా మాదాపూర్ ఐటీ కారిడార్‌లోని రహేజా మైండ్ స్పేస్ పార్క్‌లోని 5ఎ భవనం వద్ద కియోస్క్‌ను ఏర్పాటు చేశారు.
నెబులా స్మార్ట్ కార్డ్‌గా పిలిచే ఈ కార్డును నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మరిన్ని ప్రాంతాల్లో ఎల్‌అండ్‌టీ కియోస్కులు ఏర్పాటు చేయనుంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








